గ్లోబల్ నైపుణ్యాలు అందిపుచ్చుకోవాలి!!

17 Aug, 2014 23:56 IST|Sakshi

గెస్ట్ కాలమ్
 
ప్రపంచీకరణతో.. దేశాల మధ్య వ్యాపార, వాణిజ్యపరమైన సరిహద్దులు తొలిగిపోతున్నాయి. ఒక దేశంలోని కంపెనీలు.. తమ కార్యకలాపాలను ఇతర దేశాలకు విస్తరించడం.. స్వయంగా సంస్థలు నెలకొల్పడం సర్వసాధారణంగా మారింది. ఈ పరిస్థితుల్లో కంపెనీల అవసరాలకు తగ్గట్టు విద్యార్థులు అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలు అందిపుచ్చుకోవాల్సిన ఆవశ్యకత కూడా పెరుగుతోంది. ఇందుకు ఇన్‌స్టిట్యూట్‌ల మధ్య ఎక్సే ఛంజ్ ప్రోగ్రామ్‌లు, సహకారం దోహదం చేస్తాయి అంటున్నారు..  వాషింగ్టన్ యూనివర్సిటీ- సెయింట్‌లూయిస్, ఛాన్సలర్ మార్క్ ఎస్.రింగ్టన్. జేఎన్‌యూ, టిస్, ఐఐటీ-ముంబైలతో కలిసి పలు ప్రోగ్రామ్స్ అందిస్తున్న వాషింగ్టన్ యూనివర్సిటీ... తాజాగా ఐఐటీ-ముంబైతో కలిసి సంయుక్తంగా ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో.. మార్క్ ఎస్.రింగ్టన్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూ..
 
అంతర్జాతీయ పరిస్థితులపై అవగాహన అవసరం
 
ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ కంపెనీలు తమ వ్యాపారాన్ని విస్తరించుకుంటున్నాయి. అవుట్‌సోర్సింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. అవుట్‌సోర్సింగ్ చేసే సంస్థలు తమ స్వదేశీ పరిస్థితులను దృష్టిలో పెట్టుకునే కార్యకలాపాలు జరుపుతాయి. కాబట్టి భవిష్యత్తులో రాణించాలనుకునే విద్యార్థులు గ్లోబల్ నాలెడ్జ్ పెంచుకోవాలి. ముఖ్యంగా విదేశీ విద్య, ఉద్యోగాల ఔత్సాహికులకు ఇవి చాలా అవసరం. ఒక్కమాటలో చెప్పాలంటే.. దేశమేదైనా అంతర్జాతీయ స్థాయిలో పరిశ్రమల అవసరాలు, సామాజిక పరిస్థితులపై అవగాహన ఏర్పరచుకోవడం ఇప్పుడు కెరీర్ పరంగావిద్యార్థులకు తప్పనిసరిగా మారింది.
 
భారతదేశంలో ఎంతో అనుకూలం
 
భారత్‌లోని ఐఐటీలు, ఐఐఎంల వంటి ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్‌లలో విద్యను అభ్యసించినవారు అమెరికాలో కీలక పదవులు పొందుతున్నారు. ముఖ్యంగా బోధన రంగంలో ప్రొఫెసర్లుగా, శాస్త్రవేత్తలుగా అంతర్జాతీయంగా రాణిస్తున్నారు. ప్రస్తుతం ప్రధాన సమస్య ఏమిటంటే.. విద్యార్థులకు అంతర్జాతీయ అవసరాలు, అవకాశాలపై తగినంత అవగాహన లేకపోవడం. ఈ సమస్యలకు పరిష్కారమే గ్లోబల్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్స్. అందుకే వాషింగ్టన్ యూనివర్సిటీ - సెయింట్‌లూయిస్ తరఫున భారత్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ, టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్, ఐఐటీ-ముంబైలతో కలిసి జాయింట్ డిగ్రీ ప్రోగ్రామ్‌లు అందిస్తున్నాం. జేఎన్‌యూ, టిస్‌లతో ఎప్పటి నుంచో ఎక్స్ఛేంజ్ ఒప్పందం అమలవుతోంది. తాజాగా ఐఐటీ-ముంబైతో కలిసి సంయుక్తంగా ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ప్రోగ్రామ్‌ను ప్రారంభించాం. 18 నెలల వ్యవధి ఉండేలా వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం ఈ కోర్సును రూపొందించాం. ఇందులో చేరిన అభ్యర్థులు మా క్యాంపస్‌లో రెండు వారాల ప్రాక్టికల్ ట్రైనింగ్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. దీనివల్ల అమెరికాలోని మేనేజ్‌మెంట్ రంగ అవసరాలపైన అవగాహన లభిస్తుంది.
 
ప్రయోజనాలెన్నో
 
అకడమిక్, ఇండస్ట్రీ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌లతో విద్యార్థులకు ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. రెండు సంస్థల మధ్య ఉన్న ఒప్పందాల కారణంగా.. ఇరు దేశాల్లోని పరిస్థితులకు అనుగుణమైన నైపుణ్యాలు పొందే విధంగా శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యమైంది.. భవిష్యత్తులో విదేశీ కొలువు కోరుకునే వారికి ఈ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్స్‌ను ఎంట్రీ పాయింట్స్‌గా పేర్కొనొచ్చు. అంతేకాకుండా ఇతర దేశాల కోణంలో అధ్యయనం, పరిశోధన తదితర అవకాశాలు లభిస్తాయి.
 
భారత్, అమెరికా.. అకడమిక్ వ్యత్యాసాలు
 
అకడమిక్ పరంగా రెండు దేశాల మధ్య ప్రధాన వ్యత్యాసం.. ప్రాక్టికల్ లెర్నింగ్, ఫ్లెక్సిబుల్ అప్రోచ్. భారత్‌లో ఇది కొంత తక్కువగా ఉంది. కానీ.. వ్యక్తిగతంగా చక్కటి నైపుణ్యాలు కలిగిన విద్యార్థులు ఎందరో ఉన్నారు. వారికి ప్రాక్టికల్ నైపుణ్యాలు అందించేలా బోధనలో మార్పులు తీసుకొస్తే మరింతగా రాణిస్తారు. మా యూనివర్సిటీలోనే వందల సంఖ్యలో భారతీయ విద్యార్థులు, ప్రొఫెసర్లు ఉన్నారు. అకడమిక్‌గానూ మంచి ప్రతిభ చూపుతున్నారు. విభిన్న దేశాలు, సంస్కృతుల నుంచి వచ్చిన సహచరులతో కలిసిపోయే విషయంలోనే కొంత ఇబ్బందిపడుతున్నారు. ఈ సమస్యను విద్యార్థులే స్వయంగా అధిగమించాలి. కేవలం అమెరికా అనే కాకుండా.. ఏ దే శాన్ని ఎంచుకున్నా.. అక్కడి సామాజిక, సాంస్కృతిక అంశాలపై ముందుగానే ఒక అవగాహన ఏర్పరచుకుంటే.. అక్కడకు వెళ్లాక ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగొచ్చు.
 
నిబంధనలు కొంత కఠినమే కానీ..
 
అమెరికాను గమ్యంగా ఎంచుకున్న విదేశీ విద్యార్థులు.. నిబంధనల పరంగా ఇబ్బంది పడుతున్నారనే అభిప్రాయాలు వాస్తవమే. అయితే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల విద్యార్థులకు అమెరికా టాప్ డెస్టినేషన్‌గా నిలుస్తోంది. ఈ క్రమంలో.. కొన్ని పరిమితులు విధించడం, ఆ మేరకు నిబంధనలు రూపొందించడం సహజమే. ఇటీవల కాలంలో అమెరికాలోని ఎన్నో యూనివర్సిటీలు ‘స్టూడెంట్-ఫ్రెండ్లీ’ విధానంలో నిబంధనలను సడలిస్తున్నాయి. విద్యార్థులకు ఎదురవుతున్న సమస్య అంతా వీసా సమయంలోనే!
 
వాషింగ్టన్ అకార్డ్‌తో లాభాలు
 
వాషింగ్టన్ అకార్డ్ అనేది.. ప్రొఫెషనల్ ఇంజనీరింగ్ కోర్సులకు సంబంధించి ఆయా దేశాల అకడమిక్ నియంత్రణ సంస్థల మధ్య జరిగే ఒప్పందం. ఒక దేశంలోని ఇంజనీరింగ్ ప్రోగ్రామ్‌ల కోసం ఈ ఒప్పందంపై సంతకం చేస్తే.. ఇప్పటికే ఈ జాబితాలో ఉన్న అన్ని దేశాల్లోనూ సదరు ఇంజనీరింగ్ ప్రోగ్రామ్‌లకు గుర్తింపు లభిస్తుంది. ఇటీవలే భారత్ కూడా ఈ జాబితాలో చేరింది. దీనివల్ల భారత్‌లోని ఎన్‌బీఏ అక్రెడిటేడ్ ఇంజనీరింగ్ కోర్సులకు వాషింగ్టన్ అకార్డ్‌లో సంతకాలు చేసిన 17 దేశాల్లో గుర్తింపు దక్కుతుంది. దీనివల్ల విద్యార్థులు అంతర్జాతీయ అవకాశాలు పొందొచ్చు.
 
పరిశోధనలు పెరగాలంటే

 
భారత్‌లో పరిశోధన కార్యకలాపాలు ఇటీవల కాలంలో పెరుగుతున్నాయి. ఇది ఆహ్వానించదగిన పరిణామం. అయితే వీటిని మరింత విస్తృతం చేయాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. ఇందుకోసం ఇన్‌స్టిట్యూట్‌లు, యూనివర్సిటీలు జాయింట్ ప్రోగ్రామ్స్, ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్స్ కు ప్రాధాన్యమివ్వాలి. ముఖ్యంగా అమెరికా, భారత్‌లు కలిసి సంయుక్తంగా పరిశోధనలు చేస్తే భవిష్యత్తులో అత్యున్నత ఆవిష్కరణలకు మార్గం ఏర్పడుతుంది. ప్రస్తుతం వాషింగ్టన్ యూనివర్సిటీ.. ఐఐటీ-ముంబైలు సంయుక్తంగా సోలార్ ఎనర్జీ రీసెర్చ్ చేపడుతున్నాయి. వీటికి అమెరికా, భారత్ ప్రభుత్వాల ఇంధన శాఖల సహకారం కూడా ఉంది. ఇలాంటి అవకాశాలను మరింత పెంచాలి.
 
అమెరికాలో చదవాలనుకుంటున్న భారతీయ విద్యార్థులకు నా సలహా.. వర్క్ హార్డ్, బీ ప్రాక్టికల్.. నెవర్ డిజప్పాయింట్! అమెరికాలో ఉన్నత విద్య అధిక శాతం ప్రాక్టికాలిటీకి ప్రాధాన్యమిస్తుంది. కాబట్టి విద్యార్థులు కష్టించే తత్వం, ప్రాక్టికల్ దృక్పథం అలవర్చుకోవాలి. కొత్త వాతావరణంలో త్వరగా ఇమిడిపోయే విధంగా మానసిక సంసిద్ధత ఉండాలి. అమెరికాను గమ్యంగా ఎంచుకోవడం వెనుక ఉన్న లక్ష్యాన్ని నిరంతరం గుర్తు చేసుకోవాలి.
 

మరిన్ని వార్తలు