శ్రీ గురుదత్తాత్రేయుడు

8 Dec, 2019 00:29 IST|Sakshi

గురు సన్నిధి

నేడు దత్తజయంతి

లోకానికి జ్ఞానకాంతులను ప్రసరింపజేసేందుకు అవతరించిన గురుమూర్తి దత్తాత్రేయుడు. జన్మసంసార బంధనాలను సులువుగా వదిలించి, జ్ఞానానందాన్ని పంచుతూ, ముక్తిపథంలో నడిపించి మోక్షాన్ని ప్రసాదించగలిగిన పరమ యోగీశ్వరుడు దత్తాత్రేయుడు. ఈయన అవతార వర్ణన నారదపురాణం, శాండిల్యోపనిషత్తు, అవధూతగీత, జీవన్ముక్తిగీత తదితరాలలో కనపడుతుంది.

అత్రికుమారా.... దత్తాత్రేయ
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు వేరుకారని నిరూపించిన సన్నివేశమే దత్తాత్రేయ ఆవిర్భావం. త్రిమూర్తులే తనకు పుత్రులుగా జన్మించాలంటూ అత్రిమహర్షి–అనసూయ దంపతులు చేసిన తపస్సుకు మెచ్చి బ్రహ్మ అంశతో చంద్రుడు, రుద్రాంశతో దూర్వాసుడు జన్మించగా, విష్ణు అంశతో అవతరించినవాడే దత్తాత్రేయుడు! ‘దత్తా’ అనే పదానికి ‘సమర్పించిన’ అని అర్థం. త్రిమూర్తులు అత్రి–అనసూయ దంపతులకు పుత్రుడి రూపంలో తమను తాము సమర్పించుకున్నారు కనుక దత్తా అని పేరు వచ్చింది. అత్రిపుత్రుడు కాబట్టి ‘ఆత్రేయ’ అయింది.

త్రిమూర్తులే శిరస్సులై...
దిక్కులనే అంబరముగా చేసుకుని, భక్తులనుద్ధరించేందుకు అనేక రూపాలను ధరించిన దత్తాత్రేయుడి మూడుతలలలో నడిమి శిరస్సు విష్ణువుదికాగా.. కుడివైపున శివుడు సద్గురు స్వరూపంగా, ఎడమవైపు బ్రహ్మదేవుడు పరబ్రహ్మస్వరూపమైన శిరస్సుతో భాసిస్తారు. మధ్యభాగంలో అజ్ఞానాన్ని తొలగించే గురుమూర్తిగా శ్రీదత్తుడు ముల్లోకాలను రక్షిస్తాడు.

ఆధ్యాత్మ సిద్ధి–నిష్కామబుద్ధి
దేహంపై వ్యామోహాన్ని వదిలి, జడ పదార్థంలా ఉండేవారిని అవధూత అంటారు. ఈ పదానికి అసలైన నిర్వచనంగా మారి దత్తావధూత అయ్యాడు. ఒకానొక సందర్భంలో పద్మాసనుడై, ధ్యానముద్రలో ప్రకాశిస్తూ యోగవిద్యను సాంకృతిమహర్షికి ఉపదేశించి దానిని భోగ–విలాసాలకు ఉపయోగించకూడదని, పరబ్రహ్మను పొందడమే యోగం అంతిమలక్ష్యం అని వివరిస్తాడు. ఆధ్యాత్మ సిద్ధి, నిష్కామబుద్ధి, యోగవిద్య ఇవన్ని దత్తాత్రేయుని ఉపదేశాల్లో ప్రధానమైనవి.

దత్తజయంతి
దత్తుడు ఉదయించిన మార్గశిర పౌర్ణమినే దత్తజయంతిగా జరుపుకుంటారు.‘దిగంబరా దత్త దిగంబరా’ అంటూ దత్తనామ స్మరణలో గడుపుతారు. దత్తచరిత్ర, అవధూతగీత మొదలైన గ్రంథాల్ని పారాయణ చేస్తారు. భజనలు, సత్సంగాలు నిర్వహిస్తారు. త్రిపురారహస్యం పేరుతో పరశురాముడికి త్రిపురసుందరీ తత్త్వాన్ని ఉపదేశించాడు దత్తాత్రేయుడు. ఉపాసకులకు ఇది ఎంతో ఉపయుక్తమైన గ్రంథం. దత్తాత్రేయ వజ్రకవచం పఠించడం వలన అన్నిరకాల రక్షణ భిస్తుంది. దత్తుడి ఆరాధన పితృదోషాలను తొలగిస్తుంది. ధర్మబద్ధంగా ఇహలోక సుఖాలను కోరుకునేవారికి వాటిని అనుగ్రహిస్తూ, వారిని యోగమార్గంవైపు పయనింపజేసే విశ్వగురు దత్తాత్రేయడు. ఆయన అనుగ్రహిస్తే గురువుతోబాటుగా దైవానుగ్రహమూ లభించినట్లే!
– అప్పాల శ్యామప్రణీత్‌ శర్మ అవధాని
వేదపండితులు

మరిన్ని వార్తలు