వలస దేవోభవ

17 Dec, 2017 23:43 IST|Sakshi

సైబీరియా నుంచి లక్షల కొలదీ పక్షులు భారతదేశానికి వలస వస్తాయి. మంచి నీటి సరస్సులు ఉన్న ప్రాంతంలో చెట్ల మీద గూళ్లు కట్టుకుంటాయి. గుడ్లు పెట్టి, పిల్లల్ని కని, వాటికి రెక్కలు వచ్చేవరకు అక్కడే ఉంటాయి. ఆ తరవాత సైబీరియా తరలి వెళ్లిపోతాయి.సంతానోత్పత్తి కోసం ఎంతో సంతోషంతో వలస వస్తాయి. సంతానంతో ఆనందంగా మరలి వెళ్లిపోతాయి. ఆదిమ మానవుడి జీవితం వలసలతోనే ప్రారంభమైంది. ఆహారం కోసం వేటాడుతూ కొన్ని వందల మైళ్ల దూరానికి కూడా వలస వెళ్లేవాడు. ఆహారం కోసం వలసలు వెళ్లడం నాటి నుంచి నేటి వరకూ ఉంది.

మంచి ఉద్యోగాలు, మంచి సంపాదన కోసం యువతరం పొరుగు దేశాలకు వలస వెళ్లిపోతున్నారు. అక్కడే స్థిరపడిపోతున్నారు. మరి కొందరు... వరదలు, భూకంపాలు వంటి విపత్తులు ఏర్పడినప్పుడు తాత్కాలికంగా మరో ప్రాంతానికి వలసలు వెళ్తున్నారు. వాతావరణం అనుకూలించాక స్వగ్రామానికి మరలి వస్తారు. అన్నిటి కంటే బాధాకరమైనది... ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జన్మభూమి నుంచి  మరో ప్రాంతానికి శాశ్వతంగా వలస వెళ్లవలసిరావడం.

దేశంలో అంతర్యుద్ధాలు జరుగుతున్నప్పుడు, ఉగ్రవాదం కోరలు చాచినప్పుడు... ఆయా దేశాల వారు వలస పోతున్నారు. ఇదే విషాదమనుకుంటే, వారిని ఎవ్వరూ చేరనివ్వకపోవడం మరింత విషాదం. వారిని పెద్ద మనసుతో అక్కున చేర్చుకోవాలి. సాటి మనిషికి సహాయపడినట్లే సాటి దేశాలకు ఆపన్న హస్తం అందించాలి.  అదే మానవత్వం, దైవత్వం అనిపించుకుంటుంది.
(నేడు అంతర్జాతీయ వలసదారుల దినం)

మరిన్ని వార్తలు