పులి.. చిరుత

4 Jun, 2018 00:10 IST|Sakshi

బిడ్డకు పాలిచ్చి వచ్చిన పులి సెరెనా. బోనులోంచి బయటికి వచ్చిన చిరుత షరపోవా. ఇద్దరిలో ఆకలి ఉంది. బరిలో ఆహారం ఉంది. ఇదొక యుగాంతపు ఆట.

ఉమెన్స్‌ టెన్నిస్‌లో ఈరోజు ధూమ్స్‌ డే. లైక్‌.. డూమ్స్‌ డే! సెరెనా, షరపోవాలు పరస్పర శత్రు ఘీంకార వందన సమర్పణతో బరిని బ్లాస్ట్‌ చేయబోతున్న మచ్‌ అవెయిటెడ్‌ అండ్‌ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌ (ఎదురుచూడబోతామని ఎవరూ ఎదురుచూడని) ఈవెంట్‌ ఇవాళ్టిది. ఇదింకా ఫోర్త్‌ రౌండే. ఫైనల్స్‌ కాదు. సెమీ ఫైనల్‌ కాదు. క్వార్టర్‌ ఫైనల్‌ కాదు. కేవలం ప్రీక్వార్టర్‌. అంతే. బట్, ఇదొక యుగాంతపు ఆట. ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఆరో సీడ్‌ ప్లిస్కోవాను కొట్టి, సెరెనా అనే కొరివితో పెట్టుకోబోతున్నారు షరపోవా.

పదకండవ సీడ్‌ జూలియా జార్జెస్‌ను ఓడించి, షరపోవాను చిన్నపిల్లలా ఆటాడించేందుకు సిద్ధమై ఉన్నారు సెరెనా. గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఫైనల్‌లో ఇప్పటికి మూడుసార్లు షరపోవాపై గెలిచారు సెరెనా. ఇప్పటికి ఒకేసారి సెరెనాపై గెలిచారు షరపోవా. ఎవరు ఎవరిపై ఎన్నిసార్లు గెలిచారనేది.. ఈరోజు ఈ ఇద్దరి మధ్యా జరుగుతున్న ఆటలో ఓటమిని అంచనా వెయ్యడానికి పనికొచ్చే.. గెలుపు పాయింట్‌ ఏమీ కాబోదు. కానీ ప్రాణమున్న ఆట. సెరెనా ఒక బిడ్డకు జన్మనిచ్చాక, షరపోవా నిషేధం నుంచి పునర్జన్మించాక ఆడుతున్న ఆట.

సెరెనా, షరపోవా చివరిసారిగా రెండున్నరేళ్ల క్రితం ఆస్ట్రేలియన్  ఓపెన్‌లో ఒకరితో ఒకరు తలపడ్డారు. తర్వాత ఇద్దరూ పరిస్థితులతో తలపడ్డారు. ఒక సంవత్సరం తేడాతో ఇద్దరి జీవితాల్లో మార్పులకు, మలుపులకు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ కారణం అయింది. 2016 ఓపెన్‌లో వరల్డ్‌ యాంటీ డోపింక్‌ ఏజెన్సీ షరపోవాపై రెండేళ్ల నిషేధం విధించింది. ఆ రెండేళ్ల నిషేధాన్ని ఆ తర్వాత పదిహేను నెలలకు తగ్గించింది. లేకుంటే ఈ జూన్‌ 8 వరకు ఆ నిషేధం ఉండేది. ఈరోజు సెరెనా, షరపోవాల ఆట లేకపోయేది.

షరపోవాలా సెరెనా కూడా తనకెంతో ప్రాణప్రదమైన టెన్నిస్‌కు కొన్ని నెలలు దూరంగా ఉండవలసి వచ్చింది. డోపింగ్‌ టెస్ట్‌లో ఫెయిల్‌ అయినందుకు షరపోవా ఆటకు దూరం అయితే, మాతృత్వపు టెస్ట్‌లో పాస్‌ అయినందుకు సెరెనా తన బిడ్డ కోసం ఆటలు కట్టిపెట్టవలసి వచ్చింది. 2017 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఆడుతున్న సమయానికే ఆమె ఎనిమిది వారాల గర్భిణి.

ఆ తర్వాత బిడ్డ పుట్టేవరకు, బిడ్డ పుట్టిన తర్వాత కూడా కొన్నాళ్లపాటు ఆటకు దూరంగా ఉన్నారు. తిరిగి ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆటలోకి వచ్చారు. అక్కణ్ణుంచి ఇప్పుడు జరుగుతున్న ఫ్రెంచి ఓపెన్‌లోకి వచ్చారు. తొలి రౌండ్‌లో చెక్‌ అమ్మాయిని, రెండో రౌండ్‌లో ఆస్ట్రేలియా అమ్మాయినీ, మూడో రౌండ్‌లో జర్మన్‌ అమ్మాయినీ ఓడించి, నాలుగో రౌండ్‌లో రష్యా అమ్మాయి షరపోవా మీదకు రాకెట్‌ పట్టుకుని వచ్చేశారు.

షరపోవా కూడా గ్యాప్‌ తర్వాత గత ఏడాది ఏప్రిల్‌లో ఆటలోకి వచ్చారు. అక్కణ్ణుంచి ఫ్రెంచ్‌ ఓపెన్‌కి వచ్చారు. తొలి రౌండ్‌లో నెదర్లాండ్స్‌ అమ్మాయిని, రెండో రౌండ్‌లో క్రొయేషియా అమ్మాయిని, మూడో రౌండ్‌లో చెక్‌ అమ్మాయిని ఓడించి నాలుగో రౌండ్‌లో అమెరికన్‌ యోధురాలు సెరెనా వైపు చిరుతలా చూస్తున్నారు. అయినా.. ఎన్ని చిరుతల్ని చూడలేదూ సెరెనా! షరపోవా కూడా! ఎదురుగా ఉన్నది యోధానుయోధులైతే మాత్రం ఎప్పుడైనా గాండ్రించకుండా ఉందా? గ్యాప్‌ వచ్చిన తర్వాత కూడా ఇంకా రిటైర్‌ కాకుండా ఉన్నారంటే.. వీళ్ల లోలోపలి ఫైరే.. వీళ్ల ఆటను వెలిగిస్తోంది.

గత ఏడాది షరపోవా ఆత్మకథ ‘అన్‌స్టాపబుల్‌: మై లైఫ్‌ సో ఫార్‌’ విడుదలైంది. 2004 వింబుల్డన్‌ ఫైనల్‌లో తనపై ఓడిపోయినప్పుడు సెరెనా లాకర్‌ రూమ్‌లో కన్నీళ్లతో కూర్చొని ఉన్న దృశ్యాన్ని చూసినందుకు తనెప్పటికీ క్షమార్హురాలిని కాబోనని ఆ పుస్తకంలో రాసుకున్నారు షరపోవా. ‘ఒక బక్కపలుచని అమ్మాయి తనని ఓడించినందుకు సెరెనా నన్ను ద్వేషించి ఉండొచ్చు. తనది అనుకున్న దానిని నేను తీసేసుకున్నందుకు తను నన్ను ద్వేషించి ఉండొచ్చు. తన జీవితంలోని అతి దయనీయమైన క్షణాలు నా కంట్లో పడినందుకు తను నన్ను ద్వేషించి ఉండొచ్చు. అన్నిటికన్నా.. తను ఏడ్వటం నేను చూశాను. అందుకు మరీ ఎక్కువగా ద్వేషించి ఉండొచ్చు’ అని ఆ ప్యారాగ్రాఫ్‌ను కొనసాగించారు షరపోవా.

ఈ విషయాన్ని శనివారం న్యూయార్స్‌ టైమ్స్‌ ప్రతినిధి సెరెనా ముందు ప్రస్తావించినప్పుడు.. ‘ఏడ్వకపోవడం విడ్డూరం గానీ, ఏడ్వటంలో ఆశ్చర్యం ఏముంది?’ అన్నారు సెరెనా. ‘ఆ సంగతిని లాకర్‌ రూమ్‌లోనే ఉంచేయవలసింది. పుస్తకం వరకూ తేకుండా. నాకూ ఎమోషన్స్‌ ఉంటాయి. నేనూ మనిషినే’ అని కూడా అన్నారు. అవును కదా! ఎంత ఫైర్‌ ఉన్న మనిషిలోనైనా ఏమూలో ‘ఐస్‌’ లేకుండా ఉంటుందా? ఎంత ‘అన్‌స్టాపబుల్‌’ అయినా చిన్న గులకరాయి తగలకుండా ఉంటుందా? బిడ్డకు పాలిచ్చి వచ్చిన పులి సెరెనా.  బోనులోంచి బయటికొచ్చిన చిరుత షరపోవా. ఆకలి ఉంది. బరిలో ఆహారం ఉంది.   

- మాధవ్‌ శింగరాజు

మరిన్ని వార్తలు