ఒక చాణక్యుడు... ఒక భీష్మాచార్యుడు...

14 Apr, 2015 00:25 IST|Sakshi

అంబేడ్కర్ పూర్తిగా సమాఖ్య కాని, పూర్తిగా కేంద్రీకృత పాలనా కాని కొత్త సహకార సమాఖ్య విధానంతో సంవిధానాన్ని రచించిన రాజధర్మ నిపుణుడు. అర్థశాస్త్రం రచించిన చాణక్యుడు, రాజధర్మం తెలిసిన భీష్మాచార్యుడు కలిస్తే ఒక అంబేడ్కర్ అవుతాడు.
 
మాడభూషి శ్రీధర్

సంవిధానాన్ని మనం రాజ్యాంగం అంటాం. కాని సంవిధానం అనడమే సరైంది. ఎందుకంటే రాజ్యాంగం అంటే అర్థం... రాజ్యంలో ఒక అంగం మాత్రమే అని. కాని సంవిధానం మొత్తం రాజ్యాన్ని నడిపే విధానం. ఒక మనిషి జీవన విధానాన్ని నిర్దేశించడానికి మతాల ప్రవర్తనా నియమావళులెన్నో ఉన్నాయి. కాని ఒక దేశం ఏ విధంగా నడవాలో నడపాలో తేల్చడం చాలా కష్టం. దానిని అంబేడ్కర్ సుసాధ్యం చేశారు.
 
సంవిధానం రూపొందించడానికి ఒక సభను రూపొందించారు. దానికి అధ్యక్షుడు బాబూ రాజేంద్రప్రసాద్. కొన్ని ఉపసంఘాలు ఏర్పాటుచేశారు. అందులో ఒకటి సంవిధాన రచనా సంఘం. దానికి అధ్యక్షుడు భీంరావ్ అంబేడ్కర్. ఆయన్ను మించిన గొప్ప సమర్థుడు ఆ పనికి దొరకలేదు. దొరకడు. మిగతా సంఘాల వారు గొప్పపనే చేసినా, ఈయన పని తరతరాలకు గుర్తుంటుంది. ఎందుకంటే మొత్తం దేశం ఏ విధంగా నడపాలో చెప్పే ఒక ప్రాథమిక ప్రణాళికను రూపొందించి దాన్ని తొలిప్రతిగా సభ ముందుంచి, ఒక్కొక్క అక్షరాన్ని, పదాన్ని, వాక్యాన్ని అధికరణాన్ని సమర్థించుకుంటూ, వాదోపవాదాలను ఎదుర్కొని అందరినీ ఒప్పించి, అవసరమైన మార్పులను ఆహ్వానించి, అంగీకరించి, వాటిని చేర్చిన రాజ్యపాలనా తత్వవేత్త అంబేడ్కర్.

కానీ అంబేడ్కర్ విగ్రహాల్లో ఆయన చేతికి మాత్రం సంవిధానం పుస్తకం ఇచ్చి, అది చదవడం మానేశాం. చూపుడు వేలుతో ఆయన మనకు చూపిస్తున్న దారి మరిచిపోయాం. అంబేడ్కర్ పూర్తిగా సమాఖ్య కాని, పూర్తిగా కేంద్రీకృత పాలనా కాని కొత్త సహకార సమాఖ్య విధానంతో సంవిధానాన్ని రచించిన రాజధర్మ నిపుణుడు. అర్థశాస్త్రం రచించిన చాణక్యుడు, రాజధర్మం తెలిసిన భీష్మాచార్యుడు కలిస్తే ఒక అంబేడ్కర్ అవుతాడు. అంబేడ్కర్ గురించి ఎంతో చదవవలసి ఉంది. ఎంతో వ్రాయవలసి ఉంది.
(వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్, న్యాయశాస్త్ర అధ్యాపకులు, ఫోన్: 08447651505)

మరిన్ని వార్తలు