అతడు ఈ దేశం ‘డీఎన్‌ఏ’లో ఇంకిపోయిన వాడు!

14 Apr, 2015 00:35 IST|Sakshi

జాన్‌సన్ చోరగుడి
ఆయన ఇప్పుడు లేరు. ఏడు దశాబ్దాల కాలంలో మొదటి పదేళ్లే ఆయన మనతో భౌతికంగా ఉన్నారు. అయినా, ఇప్పటికీ ఉన్నారు ‘అంబేడ్కరిజం’ పేరుతో. అది - 1935. అనారోగ్యంతో మంచంలో ఉన్న - ‘ఆమె’. ‘ఒకసారి నన్ను పంఠాపూర్ గుడికి తీసుకెళ్లండి’ - అడిగిందామె. ‘‘మనల్ని అంటరానివారిగా వెలిగా ఉంచిన ఆ గుడికి మనం వెళ్లేదేమిటి, నేనే అటువంటి గుడిని నీకోసం కడతాను’ ఆయన వాగ్దానం! క్షణం తీరిక లేదు. ఎలా ఉన్నావ్ అని ఆగి ఆమెను పలకరించడానికి టైం లేదు, సరైన నిద్ర లేదు. ఎవరి కోసం ఈ మనిషి ఇలా తనను తాను హననం చేసుకుంటున్నాడు?
 
ఆమె మనసు, శరీరం రెండూ విశ్రాంతి కోరాయి. చివరికి ఆమె కన్ను మూసింది. క్రియాశీలంగా ముమ్మరంగా ఉన్న కాలంలో 13 ఏళ్ల ఒంటరితనం. చెట్టుకు చెద పట్టినట్టుగా ఒళ్లంతా తొలుస్తున్న - షుగర్ వ్యాధి. ఇన్సులిన్ తీసుకునేవారు. ఏమో, అయినా తొలుస్తున్నది వంటికి వచ్చిన వ్యాధా? లేక మనసుదా? తన సమాజం కోసం తాను స్వప్నించి రచించినవేవీ తనవాళ్లకు ఎందుకు ‘కనెక్ట్’ కావడం లేదు? సమస్య తనకు - తనవారికీ మధ్య ఉన్న ‘వేవ్ లెంగ్త్’ది అయితే, అందుకు ఉన్న పరిష్కారం ఏమిటీ? చివరికి ఆయన్ని కాపాడుకోవడం కోసం, ఆయన ‘ఆధునీకరించ’డానికి ప్రయత్నించిన బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచే వైద్యురాలిగా, భార్యగా డా. సవిత ఆయన జీవితంలో ప్రవేశించారు.
 
ఇది స్తబ్దమైన వ్యవస్థ - ఆధునికతకు దీనిలో ఆస్కారం లేదు - దీన్ని ‘బ్రేక్’ చేయాలి - తప్పదు ధిక్కారాన్ని ప్రకటించాలి - ఎప్పుడు? జీవించి ఉండగానే -  ఒక పక్క సమయం లేదని శరీరం సంకేతాలు పంపుతున్నది. బౌద్ధమత స్వీకరణ (అక్టోబర్ 1956) ఆ వేలితో ‘బుద్ధ అండ్ హిజ్ ధమ్మ’ గ్రంథం కూడా రాయడం పూర్తి అయి ప్రింటుకు సిద్ధమయింది. రోజులు బాగా భారంగా గడుస్తున్నాయి. ఒకటి - రెండు - మూడు - నాలుగు... ‘ఆయన కన్ను మూశారు’ (6 డిసెంబర్ 1956)
     
ఒక ‘సాఫ్ట్‌వేర్’గా అంబేడ్కర్‌ది నూటికి రెండొందల శాతం విజయం! రాజ్యానికి అభివృద్ధి - సంక్షేమం రెండు కళ్ల వంటివి అయితే, రాజ్యాంగ ప్రతికి రెండు షెడ్యూళ్లుగా ఆయన జతచేసిన జాబితాలు - అందుకు ప్రధాన మానవ వనరు అయ్యాయి. ‘హార్డ్‌వేర్’గా అరకొర వైఫల్యాలు.
 అయినా, కాలానికి ఎదురీదిన వాడ్ని ‘కాలం’ గుర్తించి అక్కున చేర్చుకుంది. తిలక్ - గాంధీజీ - అంబేడ్కర్ - నెహ్రూ.... అదొక పాలపుంత అనబడే - ‘గెలాక్సీ’. అంతెత్తున మిగిలి, దేశం దేహంలో డి.ఎన్.ఎ. అయినవాడ్ని; మళ్లీ ఎవరైనా మా వాడు అనడం, ఆరోగ్యవంతమైన దేహం మీద - కణితిని కోరుకోవడం అవుతుంది.
(వ్యాస రచయిత అభివృద్ధి - సామాజిక అంశాల వ్యాఖ్యాత)

>
మరిన్ని వార్తలు