అభివృద్ధికి నీడలా పేదరికం!

22 Apr, 2018 00:47 IST|Sakshi

నేడు ‘ఎర్త్‌ డే’. భూమిపై జనాభా ఎంత పెరిగితే మాత్రం ఏమిటి? ప్రకృతి వనరులను పాతాళం నుంచి అయినా తోడుకునే శక్తి మనుషులకు లేనప్పుడు కదా మనం భయపడాలి అని అభివృద్ధివాదులు వాదిస్తుంటారు. పెరుగుతున్న జనాభాకు నీడలా దీర్ఘంగా పొడవెక్కే పేదరికం కూడా వీరికి అభివృద్ధిలా కనిపిస్తుందో ఏమో! ఎంత సంపన్న సమాజంలోనైనా అధిక జనాభా వల్ల మొదట ఇక్కట్ల పాలయ్యేది నిరుపేదలే. వీరిని దృష్టిలో పెట్టుకునే అభివృద్ధి పథకాలను రూపొందించాలి ప్రభుత్వాలు. అభివృద్ధి పేదల్ని మింగేయకుండా.

ఒక్కోసారి –లోకంలోని ఈ పేదరికం, క్షుద్బాధ.. భగవంతుడి సంకల్పం ప్రకారమే జరుగుతున్నాయా అన్న సందేహం కలుగుతుంటుంది. కష్టం తెలియడానికి, కష్టపడి బతకడం ఎలాగో నేర్పించడానికి, నీతి నియమాలను ఏర్పరచడానికి దేవుడు ఇంతమందిని పుట్టించి, ఆహారాన్ని అతి ప్రయాస మీద మాత్రమే సంపాదించుకునే పరిస్థితుల్ని కల్పిస్తున్నాడా? జనాభా, ఆహార వనరులు ఒకే నిష్పత్తిలో పెరుగుతూ పోతుంటే మనిషి ఎప్పటికీ ఆదిమ దశలోనే ఉండిపోయేవాడా... దొరికిందేదో ఇంత తిని, దొరలా మంచెలపై దొర్లి!

కానీ... సర్వ శక్తి సంపన్నుడైన కారుణ్యమూర్తిలో ఇంతటి క్రౌర్యం ఉంటుందా? అయినా క్రౌర్యమని, కాఠిన్యం అని ఎందుకనుకోవాలి? జీవన పోరాటంలో మానవజాతిని రాటు తేల్చడానికి అయివుండొచ్చు కదా! ఇదే నిజం అనుకుంటే జనాభా సూత్రాలన్నిటి వెనుకా అంతస్సూత్రంగా దేవుడు ఉండాలి, దేవుడు పెడుతున్న యాతన ఉండాలి, ఆ యాతన... మనిషిని నిస్పృహలోకి నెట్టడానికి కాక, క్రియాశీలం చేయడానికి అయివుండాలి.

మరిన్ని వార్తలు