విలువలకు కంచె ఉండదు

6 Dec, 2017 23:14 IST|Sakshi

చెట్టు నీడ

‘‘యుద్ధంలో నీకు అత్యంత విలువైనది ఏది?’ అని అడిగినప్పుడు ఏ దేశ సైనికుడైనా ‘రైఫిల్‌’ అనే చెబుతాడు. అతడికి రైఫిల్‌ విలువైనదే కావచ్చు. కానీ దేశ పౌరులకు అతడి ప్రాణం విలువైనది. అందుకే దేశానికీ, దేశాధినేతలకూ ఇచ్చినంత గౌరవాన్ని మనం సైనికుడికీ ఇవ్వాలి. శత్రు దేశ సైనికుడు అయినా సరే అతడికుండే గౌరవం అతడికి ఉంటుంది. ఆ గౌరవాన్ని ఇరు దేశాల సైనికులు ఇచ్చిపుచ్చుకోవాలి. ఇక్కడ ‘గౌరవం’ అంటే అవతలి సైనికుడు బందీగా దొరికినప్పుడు యుద్ధనీతిని మరిచి ప్రవర్తించకుండా ఉండటం.’’ రెండో ప్రపంచ యుద్ధ కాలపు బ్రిటన్‌ సేనాని మాంట్‌ గొమరీ అన్న మాటలివి. ‘పీపుల్స్‌ జనరల్‌’ అని ఆయనకు పేరు. ఆదేశాలతో కాకుండా, సైనికుల మీద నమ్మకంతో ఆయన తన సైన్యాన్ని నడిపించాడు. లొంగిపోయిన శత్రుదేశ సైనిక అధికారిని విందుకు ఆహ్వానించి వీర సైనికుల మంచీ చెడుల గురించి మాట్లాడిన యుద్ధ ‘దళపతి’ చరిత్రలో బహుశా ఆయన ఒక్కరేనేమో! దేశాల మధ్య కంచె ఉంటుంది. దేశాల సైనికుల మధ్య దేశభక్తి అనే కంచె ఉంటుంది. కానీ మనిషిగా మనం పాటించవలసిన విలువలకు కంచె ఉండదు.

జవహర్‌లాల్‌ నెహ్రూలో మాంట్‌ గొమరీ పోలికలు కొన్ని కనిపిస్తాయి. భారత ప్రధానిగా నెహ్రూ 1954 నవంబరు చివరివారంలో ఇండో–చైనా సరిహద్దు ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడి మన సైనికులలోని స్నేహశీలతను, సరిహద్దు గ్రామాల్లోని ప్రజలతో వారు కలిసిపోయిన తీరును చూసి నెహ్రూ అబ్బురపడ్డారు. ప్రతికూల పరిస్థితులలో సైతం వివేకం కోల్పోకుండా, నిగ్రహంతో మనవాళ్లు తమ విధులలో నిమగ్నమై ఉండటం ఆయనకు నచ్చింది. పైగా ఇటువాళ్లు గానీ, అటువాళ్లు గానీ కయ్యానికి కాలు దువ్వుతుండే వాతావరణానికి భిన్నంగా.. ఎవరి దేశానికి వారు కాపలా కాస్తూనే, ఎవరి పరిధితో వారు ఉండి రెండో వారితో కలుపుగోలుగా ఉండటం.. ప్రపంచవ్యాప్త సైనికులపై నెహ్రూకు గౌరవభావం కలిగేలా చేసింది. ఇదే విషయాన్ని బోర్డర్‌ నుంచి తిరిగి వచ్చాక డిసెంబర్‌ 7న నెహ్రూజీ బహిరంగంగా ప్రకటించారు! సైనికుడు దేశాన్ని కాపాడితే, సైనికుడి కుటుంబాలను దేశ పౌరులు కాపాడాలి అని పిలుపు కూడా ఇచ్చారు. ఆ పిలుపును ప్రతి తరం అందుకోవాలి. ఎదురు పడిన సైనికుడికి వందనం చేసి ఊరుకోకండి. నేను మీకెలాగైనా సహాయపడగలనా? అని అడగండి.
(నేడు భారత సైనిక దళాల పతాక దినోత్సవం. ‘ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ ఫ్లాగ్‌ డే).

>
మరిన్ని వార్తలు