తల్లి్ల మరియా... కాచికాపాడుమమ్మా!

30 Jan, 2019 01:36 IST|Sakshi

నేడు మరియగిరి మహోత్సవం

కులమతాలకు అతీతంగా ఏటా భక్తుల యాత్ర

హిందూ, క్రై స్తవుల ఐక్యతే ఉత్సవం ప్రత్యేకత

శ్రీకాకుళం మేత్రాసన పాలక పునీతురాలు, క్రైస్తవుల సహాయమాత మేరిమాత మహోత్సవం నేడు శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం సమీపంలోని యు.వెంకమ్మపేట వద్ద మరియగిరిపై జరుగుతోంది. ఈ కొండపై వెలసిన మరియమ్మకు శ్రీకాకుళం మేత్రాసనం పీఠాధిపతి అడ్డగట్ల ఇన్నయ్య ఆధ్వర్యంలో ఏటా జనవరి 30న ప్రత్యేక దివ్యపూజలు నిర్వహిస్తారు. ‘విశ్వ స్వరూపుడైన దేవదేవుని పుత్రుని నీ వరాల గర్భంబున ధరియించిన మేరిమాతా వందనం అభివందనం..’  అంటూ, ‘దేవునిచే ఎన్నుకొనబడిన ఓ సుధాభాషిణి నీకే వందనం.. దైవప్రజలారా.. దైవ జనమా..’ అంటూ బిషప్‌ ఇన్నయ్య స్తోత్రం పలికి పూజలు చేయడం ఇక్కడ ఆనవాయితీ. ఈ యాత్రకు ఒక రోజు ముందే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాలతో పాటు ఒడిశ్సా రాష్ట్రం నుండి తండోపతండాలుగా క్రైస్తవులు,  హిందువులు తరలివచ్చి దివ్యపూజలో పాల్గొంటారు. అనంతరం మరియగిరి కొండను అధిరోహించి మేరిమాతను దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు.

కులమతాలకు అతీతం
మరియగిరి యాత్ర రోజున ఈ ప్రాంతంలో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంది. మఠకన్యలు, పీఠాధిపతులు, క్రైస్తవ గురువుల ప్రత్యేక ప్రార్థనలతో మేరిమాత స్తోత్రం మారు మ్రోగుతుంది. ఈ సందర్భంగా మేరిమాతను దర్శించుకొనేందుకు కులమతాలకు అతీతంగా భక్తులు కొవ్వొత్తులు వెలిగించి, కొబ్బరికాయలు కొట్టి, హిందూ సంప్రదాయంలో ఉన్నట్లు తలనీలాలు అర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. ‘ఓ తల్లీ మరియా.. మమ్మల్ని కాచికాపాడుమమ్మా’ అంటూ ప్రార్థనలు చేస్తారు. దివ్య పూజలో క్రైస్తవ గీతాలను ఆలపిస్తూ మరియమ్మను స్తుతిస్తారు. కుటుంబ సమేతంగా మేరీమాతను దర్శించుకున్న తర్వాత భక్తులు వనభోజనాలు చేస్తారు. ఏటా 25 వేల నుండి 30 వేల మంది భక్తులు హాజరై మేరీమాతను దర్శించుకుంటారు. ఈ ఏడాది కూడా ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ముమ్మర ఏర్పాట్లు చేశారు.

ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
నేటి మరియగిరి యాత్రకు ఉత్తరాంధ్ర జిల్లాల నుండి తరలివచ్చే భక్తుల కోసం పార్వతీపురం, పాలకొండ, శ్రీకాకుళం, సాలూరు, టెక్కలి, విజయనగరం తదితర ఆర్టీసీ డిపోల నుండి స్పెషల్‌ బస్సులు నడుపుతున్నారు. ఈ ఏడాది సుమారు 35 వేలమంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందన్న అంచనాతో మరియగిరి వద్ద ప్రత్యేక ఆర్టీసీ కంట్రోల్‌ పాయింట్‌ను ఏర్పాటు చేశారు.

మరిన్ని వార్తలు