ఈ రోజు అమెరికాలో ఎవరు ఎవర్నైనా హగ్‌ చేసుకోవచ్చు!

21 Jan, 2017 00:32 IST|Sakshi
ఈ రోజు అమెరికాలో ఎవరు ఎవర్నైనా హగ్‌ చేసుకోవచ్చు!

నిన్నంతా అమెరికాలో ట్రంప్‌ హడావిడి. ప్రెసిడెంట్‌ గారి ప్రమాణం స్వీకారం కదా. అందుకు. అదే సందర్భంలో వైట్‌ హౌస్‌నుంచి వెళ్లిపోతున్న ఒబామాను చాలామంది హగ్‌ చేసుకున్నారు. ప్రమాణం స్వీకారంలో గాంభీర్యం ఉంటుంది. పదవీ విరమణలో ఉద్వేగం ఉంటుంది. ఏమైనా.. అమెరికాలో ఉద్వేగాలకన్నా, గాంభీర్యాలే ఎక్కువ. ఈ సంగతిని ఈసరికే చాలామంది అమెరికన్‌ పౌరులు కనిపెట్టే ఉంటారు కానీ.. కెవిన్‌ జబోర్ని అనే యువకుడు కనిపెట్టి ఊరుకోలేదు. ‘మనం ఎందుకు ఇలా ఉండాలి?’ అని ప్రశ్నించుకున్నాడు. 

‘ఇలా’ అంటే.. విడివిడిగా, వేరువేరుగా, నువ్వో మనిషివి, నేనో మనిషిని అన్నట్టుగా, అసలు మనిషన్నవాడే పట్టనట్టుగా.. అని! కెవిన్‌కి చాలా ఆవేదన కలిగింది. అమెరికా అగ్రరాజ్యం అయితే అయివుండొచ్చు గానీ, అనుబంధాలలో ఇంత అల్పరాజ్యం అయిపోతే ఎలా అనుకున్నాడు. బాగా ఆలోచించి.. ‘నేషనల్‌ హగ్గింగ్‌ డే’ని ప్రచారంలోకి తెచ్చాడు.

దానికి అమెరికన్‌ ప్రజల ఆమోదం కూడా పొందాడు. అప్పట్నుంచీ.. అంటే 1986 జనవరి 21 నుంచీ.. ఏటా అమెరికా ‘హగ్‌ డే’ని జరుపుకుంటోంది. ఇవాళ అక్కడ హగ్‌ డే. ఎవరు ఎవర్నైనా హగ్‌ చేసుకోవచ్చు. అయితే, చిన్న కండిషన్‌. అనుమతి తీసుకున్నాకే హగ్‌ చేసుకోవాలి. అనుమతి లేకుండా హగ్‌ చేసుకున్నామంటే ఆ హగ్‌ కాస్తా క్రైమ్‌ అయిపోతుంది. మరి జనవరి 21 నే ‘హగ్‌ డే’గా ఎందుకు జరుపుకుంటున్నట్లు? దానికో కారణం చెప్పాడు కెవిన్‌. క్రిస్మస్‌ నుంచి వాలెంటైన్స్‌ డే వరకు అంతా ఫెస్టివ్‌ మూడ్‌లో ఉంటారు కాబట్టి.. ఈ మధ్యలో.. ఏదైనా ఒకరోజును హగ్‌ డేగా డిసైడ్‌ చేసుకుంటే ఫెస్టివ్‌ ఫీల్‌ కంటిన్యూ అవుతుందని అనుకున్నాడట. కౌగిలింతల వల్ల ఆత్మీయతలు పెరుగుతాయని, అనుబంధాలలోనూ అమెరికా అగ్రరాజ్యంగా ఎదుకుతుందని కెవిన్‌ ఆశ.

మరిన్ని వార్తలు