డయాబెటిస్ కంట్రోల్‌కు డజన్ సూత్రాలు

7 Apr, 2016 06:06 IST|Sakshi
డయాబెటిస్ కంట్రోల్‌కు డజన్ సూత్రాలు

నేడు ప్రపంచ ఆరోగ్య దినం

ఆరోగ్యం ఒక నిధి. పెంచుకోవాల్సిన పెన్నిధి. కానీ మనం జీవితపు రేస్‌లో... మన పరుగెడుతున్న పేస్‌తో అనుకోకుండానే కొన్ని ఆధునికతలను అలవరచుకోవాల్సి వస్తోంది. ఆ ఆధునీకరణతో ఒరిగే అనుకూలతలుంటాయి. జరిగే అనర్థాలుంటాయి. నగరీకరణతో పెరిగే సౌకర్యాలుంటాయి. తరిగే ఆరోగ్యాలూ ఉంటాయి. నగరాల్లో విస్తరిస్తున్న సత్వరాహారంలో సమకూరే రుచి  ఉంటుంది. హాని కూడా ఉంటుంది. మేలు పక్కనే క్రీనీడలా కీడు ఉంటుంది. ఆధునీకరణతో అపాయాలు ఆరోగ్యానికి ముప్పు తెస్తున్నాయి. డయాబెటిస్ రూపంలో అన్ని అవయవాలపై ప్రభావం చూపుతున్నాయి. అందుకే మరింత అప్రమత్తంగా ఉండాల్సిందే. మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఆరోగ్య నిధిని కాపాడుకోడానికి కొన్ని మంచి అలవాట్లు పెంచకుంటే ఈ ఏడాది ప్రపంచ ఆరోగ్య దిన నినాదమైన ‘బీట్ డయాబెటిస్’ను అనుసరించినట్లవుతుంది.

 

మీకు డయాబెటిస్ ఉందా. అయితే మీకు కొన్ని చిన్న చిన్న సూచనలు. దాంతో పెద్ద పెద్ద ఫలితాలు. తప్పకుండా కనిపించే సాఫల్యాలు. టక్కున అనుసరిస్తూ చిక్కులు తొలగించుకునే తేలిక మార్గాలివి. ఇవి మీకోసం, మిమ్మల్ని డయాబెటిస్ ముప్పు నుంచి దూరం చేయడం కోసం.


1ఫాస్టింగ్ వద్దు...  ఫీస్టింగ్ వద్దు...
మనం ఆహారం తీసుకునే సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. సుదీర్ఘకాలం పాటు జీర్ణకోశానికి ఆహారం అందకుండా ఉంచడం మంచిది కాదు. అలాగని ఒకేసారి ఎక్కువ పరిమాణంలో ఆహారం తీసుకోవడమూ సరికాదు. అందుకే గుర్తుపెట్టుకోండి. డయాబెటిస్ ఉంటే ఉపవాసాలూ (ఫాస్టింగ్) మంచివి కావు. అలాగని విందుభోజనాలూ (ఫీస్టింగ్) వద్దు. మితంగా ఎక్కువసార్లు తింటూ ఉండటమే మేలు.

 

2 ఏరోబిక్స్...
ఆరోగ్యానికి బ్రిక్స్: ఆరోగ్య నిర్మాణం కోసం అవసరమైన బ్రిక్స్ ఏరోబిక్స్ అని గ్రహిస్తే వ్యాయామం ఆహ్లాదంగా ఉంటుంది.  క్రమం తప్పకుండా చేసే వ్యాయామంతో డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. మరీ భారం కాకుండా ఉండేవీ, మరీ తేలికపాటివి కాకుండా కాస్తంత శరీరానికి కాస్తంత శ్రమ కలిగేలా ఉండే వ్యాయమాలు మేలు. రోజూ 30 నిమిషాల చొప్పున కనీసం ఐదు రోజులు చాలు. 

 

 3 ఒత్తిడితో పొత్తు వద్దు... 
ఒత్తిడితో చెలిమి అంటే డయాబెటిస్‌తో కలిమి అని గుర్తుంచుకోండి. అందుకే ధ్యానం, ఆహ్లాదకరమైన సంగీతం, క్రమం తప్పక చేసే యోగా, వీలైతే తాయ్‌చీ వంటి మార్గాలతో ఒత్తిడిని దాన్ని చిత్తు చేయడమే మంచిదని అని గ్రహించండి. మెడిటేషన్ లాంటి రిలాక్సేషన్ మేలు అని జ్ఞాపకముంచుకోండి.

 

4 పొగ గరళంతో మధుమేహం
సిగరెట్స్‌పైన ఉండే తెల్లటి గుండ్రటి కాగితాన్ని చూడకండి. దాని మాటున నల్లటి పొగాకును చూడండి. మామూలు వారితో పోలిస్తే పొగతాగే అలవాటు ఉన్నవారిలో టైప్-2 డయాబెటిస్ వచ్చేందుకు 30 నుంచి 40 శాతం వరకు ఎక్కువ అవకాశాలున్నాయి. ఆరోగ్యం పొగచూరిపోవడంతో పాటు డయాబెటిస్‌ను పొగ మరింతగా రగిలిస్తుంది జాగ్రత్త.

 

5 మధువుతోనూ మధుమేహం
ఇక ఆల్కహాల్‌తోనూ అంతే ముప్పు. అందుకే పరిమితికి మించిన మధుపానం కూడా మధుమేహాన్ని కలిగిస్తుందని గుర్తుపెట్టుకోండి. ఆరోగ్యాన్ని కనిపెట్టుకోండి.



6 రెగ్యులర్ చెక్‌తో చక్కెరకు చెక్
క్రమం తప్పకుండా మన రక్తంలోని గ్లూకోజ్ పాళ్లను పరీక్షించుకుంటూ ఉండాలి. అవి అదుపులో ఉంటున్నాయా లేదా అని చూసుకోవాలి. ఇలా రెగ్యులర్‌గా చెక్ చేసుకుంటూ ఉండటం వల్ల పెరిగే చక్కెరపాళ్లకూ చెక్ పెట్టవచ్చు. అది స్వయంగా చెక్ చేసుకోవాలి. అలాగే హెచ్‌బీఏ1సీ అనే పరీక్షతో మూడు నెలలకోసారి చేయించుకోవాలి.

 

7 విటమిన్ డితో డయాబెటిస్‌పై ఢీ
మనం తీసుకునే ఆహారంలో విటమిన్-డి ఎక్కువగా ఉంటే అది ఇన్సులిన్ యాక్షన్‌ను మరింత పెంచుతుంది. డయాబెటిన్‌పై అంకుశం ఉంచుతుంది. అంటే విటమిన్-డి తీసుకోవడం ద్వారా డయాబెటిస్‌ను ఢీ కొట్టవచ్చు. రవి నుంచి లభించే ఈ ‘డీ’ విటమిన్ డయాబెటిస్‌కు మాత్రమే కాదు... అన్ని రోగాల పట్ల ‘రవి’డీ!

 

8 అదే వేళకు అదే డోస్...
రోగుల పాలిట హ్యాపీ డేస్: డయాబెటిస్ రోగులు రోజూ మందులు తీసుకోవాల్సిందే. అయితే రోజూ డాక్టర్ సూచించిన మోతాదులోనే క్రమం తప్పకుండా తీసుకోవడం కూడా అవసరం. వేళకు మందులు తీసుకోవాలి. మిస్ కొట్టడానికి సాకులు మానుకోవాలి.

 

 9 అదనపు బరువు... ఆరోగ్యానికి చెరుపు:  ఉండాల్సిన బరువు కంటే ఎక్కువగా పెరుగుతుండే ప్రతి కేజీతో పేచీ వచ్చిపడుతుంది. అది సమస్యను  తెచ్చిపెడుతుంటుంది. అందుకే అదనపు బరువు ఆరోగ్యానికి చెరుపు అని గుర్తుంచుకోండి. బరువు తగ్గించుకోండి. ఆరోగ్యాన్ని పెంచుకోండి.

 

10 అతి నియంత్రణతో అసలుకే మోసం
ఒక్కోసారి మరింత ఎక్కువ నియంత్రణతో పాటిస్తే శరీరంలో అవసరమైన దాని కంటే చక్కెర పాళ్లు మరింత తక్కువకు పడిపోవయచ్చు. నిస్సత్తువగా, నీరసంగా అయిపోవచ్చు. దీన్నే హైపోగ్లైసిమిక్ కండిషన్ అంటారు. ఈ కండిషన్‌కు లోనుకాకుండా చూసుకోవాలి. అసలుకే మోసం రాకుండా చూసుకోవాలి.

 

11 అన్ని అవయవాలకు అపాయాలు
డయాబెటిస్ ఉందంటే అన్ని అవయవాలూ దాని పాలబడే ప్రమాదం ఉంది. చక్కెర ఉందంటే కళ్లు, కిడ్నీలు, నరాలు, పాదాలు ఇలా అన్నింటికీ అనర్థాలు జరిగే అవకాశం ఉంది. అందుకే మెదడు మొదలుకొని పాదాల వరకూ అన్ని అవయవాల విషయంలో అప్రమత్తత అవసరం.

 

12 టీకా
డయాబెటిస్ ఉందంటే మీ డాక్టర్ చెప్పిన విధంగా ఫ్లూ టీకా తీసుకోండి. ఆ షాట్‌తో నిర్భయంగా ఉండవచ్చు. నిశ్చింతగా మెలగవచ్చు.

 

మరిన్ని వార్తలు