డేంజర్ అలారం

17 Mar, 2016 22:33 IST|Sakshi
డేంజర్ అలారం

నేడు వరల్డ్  స్లీప్ డే
 
మైగ్రేన్ తలనొప్పులు  ఎసిడిటీ  గ్యాస్ట్రిక్ ట్రబుల్ డయాబెటిస్  స్థూలకాయం  కేన్సర్  డిప్రెషన్.
కంటినిండా నిద్రను మించిన స్వర్గం లేదు.
నిద్ర కరువవడాన్ని మించిన నరకం లేదు.
పసిపిల్లలు సహజ ప్రశాంతంగా నిద్రపోతారు.
వరిని నిద్రపుచ్చడానికి ఒక్క జోలపాట చాలు.
పెరిగి పెద్దయ్యాక బతుకు భారమవడం మొదలవుతుంది.
ఆశలు, ఆరాటాలు అంతు లేనంతగా పెరుగుతాయి.
ఆశాభంగాలు, అభద్రతలు అడుగడుగునా ఎదురవుతాయి.
ఎంత సంపాదించినా నిద్రాదరిద్రం మాత్రం తీరదు.
దాని దెబ్బకు ఒంట్లోకి తీపిజబ్బు చేరి బతుకునే చేదెక్కిస్తుంది.
ఏకాగ్రత కుదరక చిరాకులు, పరాకులు
మనశ్శాంతిని దూరం చేస్తాయి.
నరాల్లో నెత్తురు పోటెత్తి కోపతాపాలు ప్రతాపాన్ని చూపిస్తాయి.
‘కునుకు పడితె మనసు కాస్త కుదుట పడతది’ అని మనసుకవి అన్నాడు గానీ,
 

మనసు కుదురుగా లేని చాలామందికి కునుకే కనకమైపోయింది. రకరకాల ఒత్తిళ్లు, మానసిక అశాంతితో బతుకే పీడకలలా మారి, నిరంతర నిద్రాభంగం రోజువారీ అనుభవంగా మారుతోంది. ఎంత కలిమిగల ఆసాములైనా నిద్రలేమిని అధిగమించడంలో వెనుకబడి, దిగులు పెంచుకుని గుబులు చెందుతున్నారు. నానా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీసే నిద్రలేమిని వైద్య నిపుణులు ఒక రుగ్మతగా గుర్తించారు. వైద్య పరిభాషలో దీనిని ‘ఇన్‌సోమ్నియా’ అంటారు. ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టడంలో ఇబ్బందులు కలగడం, నిద్రలో ఉండగా అకస్మాత్తుగా మెలకువ వస్తుండటం, అలా మెలకువ వచ్చాక తిరిగి నిద్రపట్టకపోవడం, మరీ వేకువ జామునే మెలకువ వచ్చేస్తుండటం, మేలుకున్న తర్వాత అలసటగా అనిపించడం వంటి లక్షణాలు యమయాతన పెడతాయి.
 
రకరకాల నిద్రలేమి
ఎలాంటి ఆరోగ్య సమస్యలతో నిమిత్తం లేకుండానే కొందరికి సక్రమంగా నిద్రపట్టదు. ఇలాంటి పరిస్థితిని ప్రైమరీ ఇన్‌సోమ్నియా అంటారు. ఉబ్బసం, డిప్రెషన్, ఆర్థరైటిస్, కేన్సర్, శరీరాన్ని బాధపెట్టే రకరకాల నొప్పులు, మితిమీరిన తాగుడు వంటి కారణాలు కొందరికి నిద్రలేమిని కలిగిస్తాయి. ఇలాంటి పరిస్థితిని సెకండరీ ఇన్‌సోమ్నియా అంటారు. నిద్రలేమి కొందరిలో తాత్కాలికంగా కనిపిస్తే, ఇంకొందరిని దీర్ఘకాలికంగా పట్టి పీడిస్తుంది. కొద్ది రోజులు లేదా కొద్ది వారాలు మాత్రమే ఉండే నిద్రలేమిని ‘అక్యూట్ ఇన్‌సోమ్నియా’ అంటారు. ఇంకొందరిలో ఈ పరిస్థితి నెలల తరబడి కొనసాగుతుంది. దీనిని ‘క్రానిక్ ఇన్‌సోమ్నియా’ అంటారు. తాత్కాలిక నిద్రలేమిని కొంత ప్రయత్నం ద్వారా, వ్యాయామం, ఆహ్లాదకరమైన సంగీతం వినడం వంటి తేలిక పాటి సహజ పద్ధతుల ద్వారా అధిగమించవచ్చు. క్రానిక్ ఇన్‌సోమ్నియా పీడిస్తుంటే మాత్రం తప్పనిసరిగా వైద్య సహాయం పొందాల్సిందే.
 
నిద్రను దూరం చేసేవి ఇవే!
ఉద్యోగం పోగొట్టుకోవడం, పరీక్షలు తప్పడం, ఆత్మీయుల మరణం, విడాకులు వంటి కారణాల వల్ల ఎదురయ్యే తీవ్రమైన మానసిక ఒత్తిడి, దీర్ఘకాలంగా పీడించే మొండి వ్యాధులు, ప్రశాంతత లేని పరిసరాలు, ఉష్ణోగ్రతల్లో తీవ్రమైన హెచ్చుతగ్గులు కునుకు కరువయ్యేలా చేస్తాయి. డిప్రెషన్, హైబీపీ, ఆస్తమా వంటి వ్యాధులకు వాడే కొన్ని రకాల మందులు నిద్రలేమికి దారితీస్తాయి.పనివేళల్లో తరచు మార్పుల వల్ల రోజూ ఒకే వేళకు నిద్రకు ఉపక్రమించలేని పరిస్థితులు, సుదూర విమాన ప్రయాణాల వల్ల ఏర్పడే జెట్‌లాగ్ వంటి కారణాలు కూడా నిద్రకు దూరం చేస్తాయి.
 
కునుకు కులాసా లేకుంటే...
ముందురోజు రాత్రి నిద్ర పట్టకుంటే మర్నాటి పొద్దున్నే ఆ ప్రభావం కనిపిస్తుంది. ఏకాగ్రత దెబ్బతింటుంది. రంగులకు అనుగుణంగా సత్వరమే స్పందించే శక్తి సన్నగిల్లుతుంది. ఇలాంటి పరిస్థితికి గురైన వారు రోడ్డు సిగ్నల్స్‌కు అనుగుణంగా వెంటనే స్పందించలేక ప్రమాదాలకు గురయ్యే అవకాశాలూ ఉంటాయి. చిన్న చిన్న కారణాలకే మూడ్స్ మారిపోతుంటాయి. ప్రతి చిన్న విషయానికీ కోపం అదుపు తప్పిపోతుంది. ఇలాంటి వాళ్లు వాహనం నడుపుతూ ఉంటే, అడ్డుగా ఎవరైనా వచ్చినా, పొరపాటున మరో వాహనం తాకినా అక్కడికక్కడే తగాదాకు దిగుతారు. ఇంట్లో భార్యాభర్తల్లో ఏ ఒక్కరికి ఇలాంటి సమస్య ఉన్నా, ఇక ఆ ఇల్లు రణరంగమే అవుతుంది. దీర్ఘకాలికంగా ఇదే పరిస్థితి కొనసాగితే, ఇద్దరూ విడాకుల వరకు వెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదు. నెలల తరబడి నిద్రలేమి వెంటాడుతుంటే మైగ్రేన్ తలనొప్పులు, ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ ట్రబుల్, డయాబెటిస్, స్థూలకాయం, రొమ్ము కేన్సర్, డిప్రెషన్, వంటి రుగ్మతలన్నీ ఒకదాని వెంట మరొకటి దాడిచేస్తాయి. వాటి ఫలితంగా అకాల వార్ధక్యం మీద పడుతుంది. అకాల వార్ధక్యం మీద పడటమంటే మృత్యువుకు చేరువ కావడమే!

వయసు పెరుగుతున్న కొద్దీ ఈ నిద్ర వ్యవధి కాస్త అటు ఇటుగా ఉండవచ్చు. పడుకున్న అరగంటలో నిద్ర పట్టడంతో పాటు గాఢమైన నిద్రపడుతూ ఉంటే దాన్ని నాణ్యమైన నిద్రగా భావించండి. మధ్య మధ్య ఏదో కారణాల వల్ల నిద్రలేస్తుండే వారు పగటి నిద్రతో దాన్ని భర్తీ చేసుకుంటున్నామని భావించవద్దు. ఎందుకంటే నాణ్యమైన నిద్రతోనే నిద్రలేమి భర్తీ అవుతుంది. ఏదో ఒకటి లేదా రెండు గంటలు అదనంగా పడుకున్నంత మాత్రాన అది భర్తీ కాదు. అందుకే కంటి నిండా నిద్రపోడానికి స్వాభావికంగానే ప్రయత్నించండి. ఒకవేళ నిద్రపట్టకపోతే, ముందుగా స్వాభావికమైన అంశాలతో నిద్రకోసం ప్రయత్నించండి. అప్పటికీ నిద్రలేమి బాధిస్తుంటే ఒకసారి డాక్టర్‌ను సంప్రదించండి.
 
ప్రశాంతంగా నిద్రపోవాలంటే
నిద్ర పట్టినా పట్టకపోయినా రోజూ క్రమం తప్పకుండా ఒకే వేళకు నిద్రకు ఉపక్రమించాలి.కెఫీన్, నికోటిన్, ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలి. ముఖ్యంగా నిద్రపోయే ముందు వీటిని తీసుకుంటే, ప్రశాంతమైన నిద్రకు దూరమయ్యే పరిస్థితి వాటిల్లుతుంది.రోజూ క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయాలి. అలాగని నిద్రకు ఉపక్రమించే ముందు వ్యాయామం చేయడం తగదు. నిద్రకు, వ్యాయామానికి మధ్య కనీసం మూడు నాలుగు గంటల వ్యవధి ఉండాలి. పడక గదిలో వాతావరణం మరీ చల్లగా లేదా మరీ వేడిగా లేకుండా చూసుకోవాలి.రణగొణ ధ్వనులు నిద్రకు అంతరాయం కలిగిస్తున్నట్లయితే, ఇయర్ ప్లగ్స్ లేదా ‘వైట్ నాయిస్’ పరికరాన్ని వాడవచ్చు. నిద్రకు ముందు పుస్తకాలు చదవడం, ఆహ్లాదకరమైన సంగీతం వినడం లేదా స్నానం చేయడం వంటివి చేయవచ్చు.తగిన నిద్ర వల్ల ఒంటి బరువు అదుపులో ఉంటుంది. శరీర కదలికలు చురుగ్గా ఉంటాయి. భావోద్వేగాలు అదుపులో ఉంటాయి. మొత్తానికి జీవితం ఆరోగ్యప్రదంగా ఉంటుంది. అందువల్ల ఆందోళనలన్నీ వదిలేసి ఆదమరచి ప్రశాంతంగా నిద్రపోండి.
 
ఏ వయస్సు వారు  ఎంత నిద్ర
అప్పుడే పుట్టిన పిల్లల నుంచి రెండు నెలల వరకు 12-18 గం॥
మూడు నెలల నుంచి ఏడాది వయసు వరకు   14-15 గం॥
ఏడాది నుంచి మూడేళ్ల వరకు    12-14 గం॥
మూడు నుంచి ఐదేళ్ల వరకు    11-13 గం॥
ఐదు నుంచి పన్నెండేళ్ల వరకు    10-11 గం॥
పన్నెండు నుంచి పద్ధెనిమిదేళ్ల వరకు    8 - 10 గం॥
పద్ధెనిమిది ఏళ్లు ఆ పైబడిన వారు    7.30-9 గం॥
 
 

>
మరిన్ని వార్తలు