ఎప్పటికీ కొత్త పాట

29 Aug, 2017 01:01 IST|Sakshi
ఎప్పటికీ కొత్త పాట

కాలం గడిస్తే ఏ పాటైనా పాతబడుతుంది. మైఖేల్‌ జాక్సన్‌ పాట మాత్రం కొత్తబడుతుంది! శాంపిల్‌గా నెట్‌లోకి వెళ్లి, వేళ్లకు అందిన మూడు పాటల్ని కదిలించండి. థ్రిల్లర్, స్మూత్‌ క్రిమినల్, బ్లాక్‌ అండ్‌ వైట్‌.. ఏ మూడైనా! అప్పుడే రిలీజ్‌ అయినట్లుగా ఉంటాయి. కొత్త భావంతో, కొత్త స్వరంతో, కొత్త దృశ్యంతో. మానవాళికి ఈ భూగోళంపై ప్రేమను కలిగించే అత్యద్భుతాలపై జాక్సన్‌ పాట ఒకటి. ఇవాళ జాక్సన్‌ జయంతి. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు, విశేషాలు.

ఒరే పెద్ద ముక్కోడా!
జాక్సన్‌ వాళ్ల ఫ్యామిలీది ఇండియానా. (యు.ఎస్‌.). జాక్సన్‌ తండ్రి బాక్సర్‌. స్టీల్‌ వర్కర్‌. గిటారిస్ట్‌. అయితే ఇవన్నీ డబ్బులొచ్చే పనులు కాదు. కుటుంబం కోసం ఆయన క్రేన్‌ ఆపరేటర్‌గా పనిచేసేవాడు. జాక్సన్‌ తల్లి కేథరీన్‌ ఎస్తేర్‌ ఓ పచారీ సరకుల దుకాణంలో సహాయకురాలిగా పని చేసేవారు. జాక్సన్‌కి ముగ్గురు చెల్లెళ్లు. ఐదుగురు అన్నదమ్ములు. జాక్సన్‌ తండ్రి కఠినంగా ఉండేవాడు. పిల్లల్ని కొట్టేవాడు. జాక్సన్‌ని ‘ఒరే పెద్ద ముక్కోడా’ అని పిలిచేవాడు. కానీ తండ్రి క్రమశిక్షణే తన విజయానికి కారణం అని జాక్సన్‌ చాలాసార్లు చెప్పాడు.

జాక్సన్‌ అండ్‌ బ్రదర్స్‌
జాక్సన్‌ మ్యూజిక్‌ బ్యాండ్‌ పేరు ‘జాక్సన్‌ బ్రదర్స్‌’. 1965లో జాక్సన్‌ తండ్రే పిల్లల కోసం ఆ బ్యాండ్‌ని ప్రారంభించాడు. ఆ మరుసటి ఏడాదే జాక్సన్‌ అండ్‌ బ్రదర్స్‌.. బ్యాండ్‌ పేరుని ‘జాక్సన్‌–5’ అని మార్చుకున్నారు. ఫస్ట్‌ సాంగ్‌ ‘ఐ గాట్‌ యు’ తో వారికి గుర్తింపు వచ్చింది. తర్వాత ఈ అన్నదమ్ముల మ్యూజిక్‌ టూర్‌లు మొదలయ్యాయి. యు.ఎస్‌.లోని రాష్ట్రాలు తిరుగుతూ క్లబ్బుల్లో, కాక్‌టైల్‌ లాంజ్‌లలో కచేరీలు ఇచ్చారు.

థ్రిల్లర్‌ ఆరున్న కోట్ల కాపీలు!
1970ల నాటికి జాక్సన్‌–5 బ్యాండ్‌.. బిగ్‌ బాయ్, ది లవ్‌ యు సేవ్, ఐ విల్‌ బి దేర్, గాట్‌ టు బి దేర్, ఐ వాంట్‌ యు బ్యాగ్‌.. వంటి హిట్స్‌ ఇచ్చింది. 1983 జాక్సన్‌కి టర్నింగ్‌ పాయింట్‌. ‘థ్రిల్లర్‌’తో ఒక్కసారిగా పాపులర్‌ అయ్యాడు. ఆ ఆల్బమ్‌ 6 కోట్ల 50 లక్షల కాపీలు అమ్ముడయింది! తర్వాత బిల్లీ జీన్, ది మూన్‌ వాక్‌.. జాక్సన్‌ని ఫేమస్‌ చేశాయి. పెప్సీ–కోలాతో జాక్సన్‌కు 50 లక్షల డాలర్‌ల డీల్‌ కుదిరి, వారి కోసం ఓ కమర్షియల్‌ వీడియో తీస్తున్నప్పుడు జాక్సన్‌ ముఖానికి, మాడుకు గాయాలయ్యాయి. దాంతో అతడు తొలిసారి ప్లాస్టిక్‌ సర్జరీలు చేయించుకున్నాడు.

ఖరీదైన ఆల్బమ్‌.. స్క్రీమ్‌
జాక్సన్‌ తన జీవితకాలంలో చేసిన అత్యంత ఖరీదైన ఆల్బమ్‌ ‘స్క్రీమ్‌’. దానికి అయిన వ్యయం 70 లక్షల డాలర్లు. ఇప్పటి కరెన్సీ విలువ ప్రకారం సుమారు 45 కోట్ల రూపాయలు. ఎంత ఖర్చు పెట్టాడని కాదు కానీ, మైఖేల్‌ చేసిన చిన్నపాటైనా ప్రపంచాన్ని షేక్‌ చేసేది. ఫలితమే జాక్సన్‌కు వచ్చిన అరుదైన గుర్తింపు జాక్సన్‌ తన కెరీర్‌లో మొత్తం 23 గిన్నెస్‌ వరల్డ్‌ రికార్డులు, 40 బిల్‌బోర్డ్‌ అవార్డులు, 13 గ్రామీ అవార్డులు, 26 అమెరికన్‌ మ్యూజిక్‌ అవార్డులు గెలుచుకున్నాడు.

ప్రపంచ పాప్‌ చక్రవర్తి
మైకేల్‌ జాక్సన్‌ పాట ఆగి ఎనిమిదేళ్లు! కానీ జాక్సన్‌ ఆల్బమ్స్‌ అతడిని ఏనాటికైనా మరణించడానికి అనుమతిస్తాయా?! మనమూ అతడిపై ప్రేమను ఏ జన్మకైనా వదులుకుంటామా! జాక్సన్‌ గాయకుడు మాత్రమేనా! గేయ రచయిత, నటుడు, డాన్సర్, బిజినెస్‌మేన్, పరోపకారి, ఇంకా... కింగ్‌ ఆఫ్‌ పాప్‌. నేనెప్పటికీ పాడుతూనే ఉంటానన్నాడు... ‘ఫర్‌ యు అండ్‌ ఫర్‌ మీ... అండ్‌ ఎంటైర్‌ ది హ్యూమన్‌ రేస్‌’ అని పాడాడు.

పాట నన్ను నిలబెట్టింది
జాక్సన్‌ పాట ప్రపంచాన్ని ఉర్రూతలూగించింది. జాక్సన్‌నీ నిలబెట్టింది. ఆయన ఓ సందర్భంలో రాసుకున్న వాక్యాలు ఇవి. ‘‘నేను ఇష్టపడే నా ప్రత్యర్థులు, నేను ఆరాధించిన స్త్రీలు నా కోసం నిలబడ్డారు. మనసు గాయపడినప్పుడు నా రికార్డింగ్‌ స్టూడియో నాకు లేపనం అద్దింది. మ్యూజిక్‌ కట్టు కట్టింది. నిర్జీవన క్షణాల్లో నా కుటుంబం నాకు పునరుజ్జీవనం ప్రసాదించింది. నా పిల్లలు నన్ను ముద్దాడారు. బ్రూక్‌ షీల్డ్, డయానా రాస్, ఎలిజబెత్‌ టేలర్‌... నా తల నిమిరారు. అందుకే ఐ జస్ట్‌ కాంట్‌ స్టాప్‌ లవింగ్‌ ద వరల్డ్‌.

మరిన్ని వార్తలు