లోకాసనం

20 Jun, 2016 23:18 IST|Sakshi
లోకాసనం

నేడు  అంతర్జాతీయ యోగా  దినోత్సవం

 

ఇవాళ లోకం ఆసనం వేయబోతోంది. ఇంటర్‌నేషనల్ యోగా డే కదా. ఇంతటి మహోన్నతమైన యోగఫలాన్ని లోకమంతా ఆస్వాదిస్తుంటే మరి మీ లోకం ఏం చేస్తోంది? అదేనండీ మీ ఫ్యామిలీ... అవును. ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికీ పనికొచ్చే ఆసనాలు ఇవిగో.  రండి. లోకాసనం వేద్దాం. ఆనందంగా ఆరోగ్యంగా ఉందాం.

 

‘అంతర్జాతీయ యోగా దినం’ అంటూ ఒకటి ఉండాలని 2014 సెప్టెంబర్‌లో ఐక్యరాజ్య సమితి (ఐ.రా.స) సర్వప్రతినిధి సభలో ప్రసంగిస్తున్నప్పుడు భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రతిపాదించారు. ఆ ఏడాది డిసెంబర్‌లో ఐ.రా.స. దానికి ఆమోదం తెలుపుతూ, జూన్ 21వ తేదీని ‘అంతర్జాతీయ యోగా దినం’గా   ప్రకటించింది.

 

ప్రాచీనమైన యోగ విద్యకు భారతదేశం పుట్టినిల్లు. ఈ విద్య ఎప్పుడు పుట్టిందనేందుకు కచ్చితమైన ఆధారాలేవీ లేవు గాని, సింధూలోయ నాగరికత నాటికే ఉనికిలో ఉండేదని చరిత్రకారుల అంచనా. క్రీస్తుపూర్వం 500-200 సంవత్సరాల మధ్య కాలంలో హిందువులతో పాటు జైనులు, బౌద్ధులు కూడా యోగసాధన చేసేవారు. ప్రాచీన సాహిత్యాన్ని పరిశీలిస్తే, రుగ్వేదంలో తొలిసారిగా ‘యోగ’ గురించిన ప్రస్తావన ఉంది. ఆ తర్వాత భగవద్గీతలోను, మహాభారతంలోని శాంతిపర్వంలోను ‘యోగ’ ప్రస్తావన కనిపిస్తుంది. క్రీస్తుశకం నాలుగో శతాబ్దికి చెందిన పతంజలి మహర్షి యోగసూత్రాలు రచించిన తర్వాత ఈ విద్య విశేషంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ప్రాచీన కాలంలో మోక్షగాములైన ముముక్షువులే ఎక్కువగా యోగసాధన చేసేవారు. వారు కూడా భక్తి, ధ్యాన యోగాల్లోనే నిమగ్నమయ్యేవారు. శారీరక దారుఢ్యానికి, శారీరక, మానసిక రుగ్మతల నుంచి విముక్తి కోసం కూడా యోగసాధన సామాన్యులకు సైతం ఉపయోగపడుతుందని చరకుడు తొలిసారిగా తన ‘చరక సంహిత’లో చాటాడు.

 
మనసును నియంత్రించుకోవడమే

మనసు కళ్లెంలేని గుర్రంలాంటిది. అదుపు చేసే సాధనమేదీ లేకపోతే దిశారహితంగా ఆలోచనలు పరుగులు తీస్తూనే ఉంటాయి. పతంజలి మహర్షి నిర్వచనం ప్రకారం ‘యోగః చిత్తవృత్తి నిరోధః’ అంటే మనసును నియంత్రణలోనికి తెచ్చుకునే నైపుణ్యమే యోగ విద్య. ఈ నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికే ఆయన యోగ సూత్రాలను రచించాడు. ఈ సూత్రాలలో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి మార్గాలను బోధించాడు. ఆధునిక కాలంలో యోగవిద్య ఎన్నెన్ని కొత్త కొత్త పోకడలు పోతున్నా, పతంజలి రచించిన యోగ సూత్రాలే వాటన్నిటికీ మూలాధారం.

 
మన యోగులు

పతంజలి మొదలుకొని భారతదేశంలో చాలామంది యోగ గురువులు ఈ విద్యను వ్యాప్తిలోకి తెచ్చారు. స్వామీ వివేకానంద అమెరికా పర్యటన దరిమిలా, ఈ విద్యకు పాశ్చాత్య దేశాల్లోనూ విశేష ప్రాచుర్యం లభించింది. మహావతార్ బాబా శిష్యపరంపరకు చెందిన పరమహంస యోగానంద కూడా పాశ్చాత్య దేశాల్లో యోగవిద్యకు ప్రాచుర్యం కల్పించడంలో కీలక పాత్ర పోషించారు. ఇక ఆధునిక కాలంలో తిరుమలై కృష్ణమాచార్య యోగవిద్యకు పునరుత్తేజం కల్పించి, ‘ఆధునిక యోగ పితామహుడు’గా ఖ్యాతి పొందారు. మైసూరు మహారాజు ఆశ్రయం పొందిన తిరుమలై కృష్ణమాచార్య ఆరోగ్య వృద్ధి కోసం యోగసాధన ఆవశ్యకతను సామాన్యులకు వివరిస్తూ, హఠయోగ సాధన పద్ధతులను బోధిస్తూ దేశవ్యాప్తంగా పర్యటనలు చేసి, ఈ విద్యను జనసామాన్యానికి చేరువ చేశారు. కృష్ణమాచార్య శిష్యుడైన బి.కె.ఎస్.అయ్యంగార్ పతంజలి యోగసూత్రాలను సులభతరమైన రీతిలో జనానికి బోధించారు. ఆయన రచించిన ‘లైట్ ఆన్ యోగా’ పుస్తకం 19 భాషల్లో అనువాదమై, 30 లక్షలకు పైగా కాపీలు అమ్ముడుపోయింది.

 

హై బీపీ: శైథిలాసనం

బోర్లా పడుకుని గడ్డాన్ని నేలకు ఆనించి చేతులను శరీరానికి రెండు పక్కల చాచి నేలపై (అరచేతులు ఆకాశాన్ని చూడాలి) ఉంచాలి. తలను ఎడమవైపుకు తిప్పి కుడి చెవి నేలకు ఆనించి, ఎడమ చేతిని ముఖానికి ఎదురుగా తీసుకువచ్చి... అరచేతిని, మోచేతిని నేలకు ఆనించాలి.ఎడమకాలిని మడిచి, ఆ పాదాన్ని కుడి మోకాలిని తాకుతూ ఉంచాలి. ఈ స్థితిలో సాధారణంగా శ్వాస తీసుకోవాలి.వెనక్కు రావడం: ఎడమ కాలిని నిటారుగా చాచి, తలను పైకి లేపి నిటారుగా తిప్పి, మెల్లగా వెల్లకిలా తిరగాలి.

 

డయాబెటిస్ అర్ధ మత్స్యేంద్రాసనం
నేల మీద కూర్చుని కాళ్లను చాపి, చేతులను తాకించాలి. వెన్ను నిటారుగా ఉండాలి. ఎడమకాలిని మడిచి కుడి తొడ కిందగా ఉంచాలి.  కుడికాలిని ఎడమమోకాలి పక్క నుంచి తీసుకుని పాదం నేలకు తాకేటట్లు ఉంచాలి.   ఎడమ చేతితో కుడికాలి చీలమండను పట్టుకోవాలి. కుడి చేతిని శరీరం వెనక్కు తీసుకోవాలి. మెడను తిప్పి భుజం మీద నుంచి నేరుగా చూడాలి. వెనక్కు రావడం: కుడిచేతిని ముందుకు తీసుకువచ్చి ఎడమ చేతిని యథాస్థితికి తీసుకురావాలి. కుడికాలిని నిటారుగా చాపి రిలాక్స్ కావాలి. ఇలాగే ఎడమ కాలితో కూడా సాధన చేయాలి.

 

మైగ్రేన్: శశాంకాసనం
వజ్రాసనంలో కూర్చోవాలి (మోకాళ్లను వంచి పాదాల మీద కూర్చోవాలి. వెన్ను, భుజాలు నిటారుగా ఉండాలి).చేతులను వెనక్కు తీసుకుని లాక్ చేసినట్లు పట్టుకోవాలి.(వెన్ను వంచకుండా నడుము వంచుతూ గడ్డాన్ని నేలకు తాకించాలి (సాధన తొలి దశలో గడ్డం ఆనదు. తల, నుదురు ఆనిస్తూ, గడ్డం ఆనే వరకు సాధన చేయాలి).లాక్ చేసిన చేతులను నిటారుగా పైకి లేపాలి, తర్వాత చేతులు ముందుకు తెచ్చి మోచేతులు, అరచేతులను నేల మీద ఆనించాలి.వెనక్కు రావడం: ఆసనం పొజిషన్‌లోకి శ్వాస వదులుతూ వెళ్లాలి. వెనక్కు వచ్చేటప్పుడు శ్వాస తీసుకుంటూ రావాలి.

 

వెన్నునొప్పి భుజంగాసనం
బోర్లాపడుకుని అరచేతులను నేలకు ఆన్చి రెండు మోచేతులను వంచుతూ ఛాతీకి దగ్గరగా తీసుకురావాలి.తల, మెడ, ఛాతీ పెకైత్తాలి. ఈ స్థితిలో నాభి నేలను తాకుతూ ఉండాలి, మెడ వీలయినంతగా సాగినట్లుండాలి. నిండుగా గాలిపీల్చుకుని శ్వాసను బంధించి ఉండగలిగినంత సేపు ఉండాలి.వెనక్కు రావడం: శ్వాస వదులుతూ నెమ్మదిగా తలను దించుతూ గడ్డాన్ని నేలకు తాకించి విశ్రాంతి స్థితిలోకి రావాలి.

 

నెక్ పెయిన్: గోముఖాసనం
కాళ్లను ముందుకు చాచి కూర్చోవాలి. కుడిమోకాలిని వంచి కుడికాలి మడమను ఎడమ పిరుదుకు ఆనించాలి.ఇప్పుడు ఎడమ మోకాలిని వంచి ఎడమ పాదాన్ని కుడి పిరుదు కింద ఉంచాలి. చేతులను కుడిమోకాలి మీద ఉంచాలి.కుడి చేతిని పెకైత్తి మోచేతిని వంచి అరచేతిని వీపు వెనుక బోర్లించి ఉంచాలి. ఎడమ చేతిని వెనక్కు తీసుకుని కుడిచేతి వేళ్లతో కలిపి పట్టుకోవాలి. ఈ స్థితిలో శ్వాసను సాధారణంగా తీసుకోవాలి. ఇలా ఉండగలిగినంత సేపు ఉన్న తర్వాత మెల్లగా యథాస్థితికి రావాలి.వెనక్కు రావడం: ముందుగా ఎడమచేతిని వదిలించుకుని ఆ తర్వాత కుడిచేతిని మామూలు స్థితికి తీసుకురావాలి. ఆ తర్వాత కాళ్లను వదులు చేయాలి. అలాగే ఎడమ చేతిని పెకైత్తి వీపు మీదకు వంచి ఎడమచేతిని పట్టుకుని కూడా చేయాలి.

 

యోగ చేసే ముందు...
ఎప్పుడూ ఖాళీ కడుపుతోనే యోగా చేయాలి. మహా అయితే, అతి స్వల్పంగా ఆహారం తిని ఉన్నా ఫరవాలేదు కానీ, కడుపు నిండుగా ఉండకూడదు.మంచి చాప, లేదా జంపఖానా వేసుకొని దానిపై యోగాసనాలు సాధన చేయాలి.యోగాసనాలు వేసే ముందు ప్రశాంత చిత్తం కోసం ముందుగా ప్రార్థన చేయడం రివాజు.

 

 చేసిన తరువాత...
చివరలో ధ్యానం చేస్తూ, యోగ శిక్షణను ముగించాలి.దేహాన్ని బిగుతుగా ఉంచుకోకూడదు. వీలైనంత వదులుగా ఉంచుకోవాలి. ఎవరికి వారు తమ వ్యక్తిగత శారీరక సామర్థ్యానికి తగ్గట్లే యోగా చేయాలి. దాన్ని మించకూడదు.యోగసాధన పూర్తయ్యాక 20 నుంచి 30 నిమిషాల తరువాతనే స్నానం చేయాలి.అలాగే, యోగా చేశాక దాదాపు 20 - 30 నిమిషాల విరామం తరువాతే ఏదైనా ఆహారం తీసుకోవాలి.

 

జాగ్రత్తలు
యోగాసనాలు వేస్తున్నప్పుడు వదులుగా, సౌకర్యంగా ఉండే నూలు దుస్తులు ధరించాలి.బాగా అలసటగా ఉన్నప్పుడూ, అనారోగ్యంతో ఉన్నప్పుడూ ఆసనాలు వేయకూడదు. దేహాన్నీ, మనస్సునూ ప్రశాంతంగా ఉంచుకొని, నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో ఆసనాలు వేయాలి.గర్భవతిగా ఉన్నప్పుడూ, ఋతుస్రావ సమయంలో, మరేదైనా ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పుడూ యోగాసనాలు వేసే విషయంలో నిపుణుల సలహా తీసుకోవాలి. ఎప్పుడూ ముక్కు రంధ్రాల ద్వారానే శ్వాసక్రియ జరపాలి. ఎప్పుడూ సొంతంగా కాకుండా, నిపుణుల ఆధ్వర్యంలో ఆసనాలు వేయడం నేర్చుకొని, సాధన చేయాలి.

 

లాభాలు
యోగా వల్ల శారీరక దార్ఢ్యం పెరుగుతుంది. కండరాలు, ఎముకల పనితీరు మెరుగవుతుంది. గుండె కండరాల ఆరోగ్యం మెరుగుపడుతుంది.మధుమేహం, శ్వాసకోశ సంబంధ సమస్యలు, అధిక రక్తపోటు, అలాగే ఆధునిక జీవనశైలి వల్ల వచ్చే అనేక ఇబ్బందులకు యోగా మంచి పరిష్కారం. ఒంటికే కాదు... మనసుకూ మంచిది యోగా. మానసికంగా నిరాశా నిస్పృహలు, అలసట, మానసిక ఆందోళన, ఒత్తిడి లాంటి వాటన్నిటికీ ఇది పరమౌషధం.ఆడవారిలో ఋతుక్రమం ఆగిపోయే వయస్సులో వచ్చే ఇబ్బందుల్ని నియంత్రిస్తుంది.

 

2015 నుంచి ప్రపంచమంతటా యోగా దినోత్సవాన్ని జరుపుకోవడంమొదలైంది. ఇప్పుడిది రెండో సంవత్సరం. ఈసారి దాదాపు 192 దేశాల్లో ప్రజలు ప్రాణాయామం చేస్తూ, శ్వాసపై ధ్యాస పెడుతున్నారు. దేహాన్నీ, మనస్సునూ నియంత్రణలోకి తెస్తున్నారు. ఆరోగ్యానికీ, మానసిక శ్రేయస్సుకూ సమగ్రమైన విధానం ఈ ప్రాచీన భారతీయ యోగశాస్త్ర విజ్ఞానమేనని ఇప్పుడు  ప్రపంచమంతా అంగీకరిస్తోంది.

మరిన్ని వార్తలు