యవసాయం

22 Dec, 2014 22:37 IST|Sakshi
యవసాయం

పంతంగి రాంబాబు
 
ఏ ఆలోచనైతే మన ముందున్న సమస్యలను సృష్టించిందో అదే ఆలోచనతో ఈ సమస్యలను పరిష్కరించలేం.
 - ఆల్బర్ట్ ఐన్‌స్టీన్
 
రైతులకు జీవన భద్రత లేకుండా చేసి నిలువునా అన్నదాతల ఉసురు తీస్తున్న ‘ఆలోచనా తీరు’ను సమూలంగా మార్చుకోకుండా వ్యవసాయ సంక్షోభాన్ని కూకటి వేళ్లతో పెకలించడం అసాధ్యమని చాటి చెబుతున్నారు కొత్త తరం యువ రైతులు. వీళ్లంతా ఉన్నత చదువులు చదువుకొని పెద్ద జీతాల ఉద్యోగాల్లో స్థిరపడిన వాళ్లు. అటువంటి ఉద్యోగాలు వదిలేసి వ్యవసాయంపై కొత్త ఆలోచనతో ముందడుగు వేస్తున్నారు. ఆలోచనల్లో స్పష్టత, ఆచరణలో క్రమశిక్షణ ఉంటే అప్పుల్లేని, ఆత్మహత్యల్లేని వ్యవసాయం సాధ్యమేనని చాటుతున్నారు.

నేడు ‘జాతీయ వ్యవసాయదారుల దినోత్సవం’. జమీందారీల పీడ విరగడ చేయడంతోపాటు అన్నదాతలకు వెన్నుదన్నుగా నిలిచిన అలనాటి నేత, దివంగత మాజీ ప్రధాని చరణ్‌సింగ్ జన్మదినమైన డిసెంబరు 23ను ఏటా ఈ దినోత్సవాన్ని ’(కిసాన్ దివస్) జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా... బతుకు భరోసానిచ్చే ఈ సరికొత్త తరం అన్నదాతల అమూల్యమైన స్వీయానుభవాల మూటలు వారి మాటల్లోనే తెలుసుకుందాం.
 
నేను రైతును..


 రైతులకు ఆదాయ భద్రత, వినియోగదారులకు విషం లేని సహజాహారం అందించడం... ఇవే మా లక్ష్యాలు. సీఏ చదువుకొని 18 వేల మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చాను. ఎంబీఏ చదివి క్రిసిల్‌లో ఐదేళ్లు పనిచేసిన నా చిన్ననాటి క్లాస్‌మేట్ ఆయుష్ శర్మతో కలిసి మా గురువు ఎస్.రాఘవన్ మాటసాయంతో వ్యవసాయంలోకి దిగాం. నాలుగేళ్లుగా పనిచేస్తున్నాం. ప్రకృతి వ్యవసాయం ద్వారా కూరగాయలు, పండ్లను పండించడం.. పండించిన పంటను నేరుగా వినియోగదారుడికి అమ్మటం ద్వారా రైతుకు స్థిరంగా ఏడాది పొడవునా మంచి ఆదాయాన్నందించడం.. ఇదీ మేం చేస్తున్నది. 2011లో కర్ణాటక రాయచూర్‌లో 140 ఎకరాలను, మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ వద్ద 110 ఎకరాలను సాగులోకి తెచ్చాం. కొందరు రైతులతో 15 ఏళ్ల ఒప్పందం మేరకు ప్రకృతి వ్యవసాయం చేయిస్తున్నాం. కూరగాయలు, పండ్లను హైదరాబాద్‌లో 2014 ఉగాది నుంచి ‘ఐ యామ్ ఫార్మర్’ పేరిట నాగోల్‌లో దుకాణం పెట్టి వినియోగదారులకు విక్రయిస్తున్నాం. 2020 నాటికి హైదరాబాద్ పరిసరాల్లోని 75 వేల మంది రైతులతో ప్రకృతి వ్యవసాయం చేయించాలన్నది లక్ష్యం. నగరానికి రసాయనిక అవశేషాల్లేని ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని వంద శాతం అందించడం కోసం ప్రభుత్వంతో కలసి పనిచేస్తున్నాం.
 - మొక్కపాటి సత్యరఘు (99085 85734)
 ‘ఐ యామ్ ఫార్మర్’, నాగోల్, హైదరాబాద్
 
 కలిసిపనిచేస్తే..

ఎంబీఏ చదివి 18 ఏళ్ల పాటు అనేక ఉద్యోగాలు చేసి.. రెండేళ్లుగా ప్రకృతి వ్యవసాయదారుడిగా స్థిరపడ్డాను. బాస్మతి ధాన్యం, పప్పుధాన్యాలు, పండ్లు, కూరగాయలను సాగు చేసి నేరుగా వినియోగదారులకు మామూలు ధరలకే అమ్ముతున్నా. ఎకరమున్నరలో రూ. లక్షకు పైగా నికరాదాయం సాధించాను. ఎకరంలో రూ.2 లక్షల నికరాదాయం పొందే అవకాశం ఉంది. పంటలతోపాటు కోళ్లు, గొర్రెలు, చేపల పెంపకాన్ని కూడా చేపడితే చిన్న రైతులు ఆదాయ భద్రతను పొందడం సాధ్యమేనని అనుభవపూర్వకంగా గ్రహించా. ఈ ఏడాది 10 మంది చిన్న రైతులను కూడగట్టుకొని 20 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరిస్తున్నా. 5 గ్రామాల్లో 5 వేల ఎకరాలకు ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరింపజేయాలన్నది నా లక్ష్యం. రైతులు ప్రణాళిక ప్రకారం, ఉమ్మడి బాధ్యతతో కలిసి పని చేస్తే సహకార పద్ధతిలో మంచి ఫలితాలు సాధించవచ్చు.
 - సూర్య రోషన్‌రాజు(99630 53337) కమ్మెట, చేవెళ్ల మండలం, రంగారెడ్డి జిల్లా
 
 ఉద్యోగాన్ని మించిన ఆదాయం..

 బీసీఏ చదువుకొని పదేళ్లుగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నా. ఉద్యోగం చేస్తూనే ఏడాదిన్నర నుంచి ఆరున్నరెకరాలను బండవాదారం వద్ద కౌలుకు తీసుకొని ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా. ప్రకృతి వ్యవసాయ పితామహుడు పాలేకర్ వద్ద శిక్షణ పొందా. ధాన్యంతో పాటు కూరగాయలు, పండ్లు పండిస్తూ నేరుగా వినియోగదారుల ఇళ్లకు తీసుకెళ్లి ఇస్తున్నా. మరో నలుగురు రైతులకు ప్రకృతి వ్యవసాయం నేర్పించి, వాళ్లు పండించే కూరగాయలు కూడా అమ్మిస్తున్నా. కాలేజీ కుర్రాళ్లతో ఖాళీ సమయాల్లో రోజూ కూరగాయలను డోర్ డెలివరీ చేయిస్తున్నా. ప్రస్తుతం ఆర్నెల్లు బ్రేక్ తీసుకొని పూర్తిస్థాయిలో వ్యవసాయంపైనే దృష్టి కేంద్రీకరిస్తున్నా. ప్రకృతి వ్యవసాయం, మార్కెటింగ్ ప్రణాళికాబద్ధంగా చేసుకుంటే ఉద్యోగాన్ని మించిన ఆదాయం వస్తుందన్న నమ్మకమూ కలిగింది.
 - జాన్ ఇజ్రాయిల్ (98668 02448) బండమాదారం, మేడ్చల్ మండలం, రంగారెడ్డి జిల్లా
 
 ఆహారమే ఔషధం!


 దేశ విదేశాల్లో 15 ఏళ్లపాటు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేశా. చార్టర్డ్ ఎకౌంటెంట్ గాంధీరాజు, ఫార్మసీ వ్యాపారి నర్సింహరాజుతో కలిసి మూడేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా. ముగ్గురం కలిసి కొంపల్లి సమీపంలో 50 ఎకరాల్లోని 15 ఏళ్ల మామిడి తోటను దీర్ఘకాలిక లీజుకు తీసుకున్నాం. అంతరపంటగా వరి కొంత మేరకు సాగు చేస్తున్నాం. పిట్టలవానిపాలెం మండలం అల్లూరులోనూ ఏడెకరాల్లో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో వరి సాగు చేస్తున్నాం. రసాయనాలు వాడకుండా పండించిన ఆహారం అమృత సమానమైనది. మెడికల్ షాపులకు మందులు కొనడానికొచ్చే వారికి ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఆహారంలో ఉండే ఔషధ విలువల ప్రభావం గురించి చెబుతున్నాం.    - గోపరాజు వర్మ (98663 26478), కొంపల్లి, రంగారెడ్డి జిల్లా
 

మరిన్ని వార్తలు