ఇచ్చేగుణం 

4 May, 2019 00:21 IST|Sakshi

టైమ్‌ ప్లీజ్‌..!

ఇచ్చేవాళ్లు ఉన్నారు. ఇచ్చే టైమే లేదు! ఈ ‘లేకపోవడం’ ఎలాంటిదంటే..  చేతికి వాచీ ఉన్నా, టైమ్‌ చూసుకునే టైమ్‌  లేకపోవడం లాంటిది! స్ట్రేంజ్‌ కదా.


ప్రాణులేనా, కొన్ని మాటలూ ‘ఎండేంజర్డ్‌’ లిస్ట్‌లో చేరిపోతున్నాయి. అంతరించిపోవడం! ‘టైమ్‌ ఎంత?’ అనే మాట ఇప్పుడెక్కడైనా వినిపిస్తోందా! పూర్వం అడిగేవాళ్లు.. చేతికి వాచీ ఉన్నవాళ్లను చూసుకుని. హక్కుగా ఫీలై.. ‘టైమెంత?’ అని అడిగేవాళ్లు. ధర్మంగా ఫీలై టైమెంతో చెప్పేవాళ్లు. ఇప్పుడు ఆ అవసరం తగ్గిపోయింది. అడిగే అవసరం, చెప్పే అవసరం. చేతిలోకి సెల్‌ఫోన్‌ వచ్చాక, చేతికి వాచీ అవసరం లేకపోయింది. ఎక్కడో కొందరికి వాచీ లేకపోతే పల్స్‌ పడిపోయినట్లుంటుంది. వాళ్లు మాత్రం వాచీతో కనిపిస్తారు. వాచీ ఉంది కదా, ఓసారి టైమ్‌ అడిగితే ఏం పోతుందని ఎవరూ అడగరు వాళ్లను. ఖరీదైన వాచీగా అనిపిస్తే మాత్రం ధర ఎంతని ఎవరైనా అడగొచ్చు. వాచీలో టైమ్‌ ఎంతని, వాచీ ధర ఎంతని అడిగితే చెప్పడంలో చేతికున్న వాచీ పోయేదేమీ ఉండదు. బాగా బిజీగా ఉండే మనిషైతే కొన్ని సెకన్‌ల టైమ్‌ మాత్రం పోతుంది సమాధానం చెప్పడానికి. కానీ టైమ్‌కి ఇచ్చినంత టైమ్‌ మనిషికి ఇవ్వడం లేదు మనిషి. అంత టైమ్‌ లేనివాళ్లు  ‘పోయింది’ అని కాకుండా, ‘ఇచ్చాను’ అనుకుంటే.. పోయినదాని గురించి బాధ ఉండదు. ఇవ్వడంలోని ఫీల్‌గుడ్‌ ఫ్యాక్టర్‌ అది. మానవులలో పుట్టుకతో ఉండే జన్యువు.. ‘ఇచ్చేగుణం’!

మరైతే లోకంలో ఎందుకింత పేదరికం? లోకం ఎందుకింత ప్రేమ రహితం? ఇచ్చేవాళ్లు ఉన్నారు.ఇచ్చే టైమే లేదు! ఈ లేకపోవడం ఎలాంటిదంటే, చేతికి వాచీ ఉన్నా, టైమ్‌ చూసుకునే టైమ్‌ లేకపోవడం లాంటిది! మనుషులిప్పుడు ఇలాగే ఉన్నారు. పర్సు నిండుగా ఉంటుంది. ఇవ్వాలన్న నిండైన మనసు ఉంటుంది. ఇచ్చే టైమే ఉండదు. ఇవ్వలేదన్న ఫీలింగ్‌ అలా ఉండిపోతుంది. వంట రుచిగా చేసి పెట్టినందుకో, టైమ్‌కి చేసి పెట్టినందుకో కాంప్లిమెంట్‌ ఇవ్వాలని ఉంటుంది. ఇచ్చే టైమే ఉండదు. ఇవ్వలేదన్న ఫీలింగ్‌ అలా ఉండిపోతుంది. ఫీలింగును మనసులోనే ఉండనివ్వకూడదు. డబ్బో, కాంప్లిమెంటో ఇవ్వాలనుకున్నది ఇచ్చేసుకుని, ఫీలింగుని బయటికి తెచ్చేసుకోవాలి. ఫ్రెష్‌ అయిపోతాం.  ఉంచుకోమని సర్‌ప్రైజింగ్‌గా కొంత అమౌంట్‌ చేతికివ్వడం, ఊహించని  విధంగా కానుకను తెచ్చి ‘ఇది నీకే’ అని ఇవ్వడం, బర్త్‌డేకి పూలగుత్తి ఇవ్వడం, ఎదురుపడితే చిరునవ్వును ఇవ్వడం, ప్రయత్నానికో ప్రశంసను ఇవ్వడం.. ఎంత సంతోషం! తీసుకున్నవాళ్ల సంతోషాన్ని వదిలేయండి. ఇచ్చిన సంతోషం మనల్ని వదిలిపెట్టదు. అంటుకున్న పరిమళంలా వెంటే వచ్చేస్తుంది! 

ఇచ్చేయడం, ఇవ్వడం ఒకటి కాదు. ఇచ్చేయడం అంటే తీసుకున్నందుకు తిరిగి ఇచ్చేయడం. అది కృతజ్ఞత. బాకీ చెల్లించడం. కానీ ఇవ్వడం వేరు. ఇచ్చేది తీసుకునేవాళ్లు కదా చెయ్యి చాస్తారు.. కానీ తీసుకోమని చెయ్యిచాచడం.. ఇవ్వడం! ఇచ్చే చెయ్యి కింద ఉండి, తీసుకునే చెయ్యి పైన ఉండడం.. ఇవ్వడం! ‘దయచేసి తీసుకోండి’ అని దోసిలి పట్టడం.. ఇవ్వడం! పాత చైనా మాట ఒకటి ఉంది. ‘ఒక గంట సంతోషంగా ఉండాలంటే చిన్న కునుకు తియ్యి. ఒక రోజంతా సంతోషంగా ఉండాలంటే చేపల వేటకు వెళ్లు. ఒక ఏడాది సంతోషంగా ఉండాలంటే వారసత్వపు ఆస్తి ఏదైనా పొందు. జీవితమంతా సంతోషంగా ఉండాలంటే మాత్రం ఎవరికైనా ఏదైనా ఇవ్వు’ అని. అయితే అదంతా మన సంతోషం కోసం. అవతల వాళ్ల సంతోషం కోసమైతే మనం ఇవ్వలసింది వేరే ఉంది. టైమ్‌! కష్టం సుఖం వినేందుకు టైమ్‌. మంచీ చెడూ చెప్పేందుకు టైమ్‌. ‘అవునా!’ అనేందుకు ఎంత టైమ్‌ పడుతుంది? ‘నేనున్నా’ అనేందుకు ఎంత టైమ్‌ పడుతుంది?!     
 (నేడు వరల్డ్‌ గివ్‌ డే)
మాధవ్‌ శింగరాజు

భర్త నుంచి భార్య కోరుకునే ప్రేమకు ఇంకో పేరు ‘టైమ్‌’! 
ఆ టైమ్‌ను భర్త ఆమెకు ఇవ్వగలిగితే ప్రేమను ఇచ్చినట్లే.  
 

మరిన్ని వార్తలు