ఎలా కొలవాలి?

19 Mar, 2015 22:43 IST|Sakshi
ఎలా కొలవాలి?

2011 జులైలో ఐక్యరాజ్యసమితి ఒక చారిత్రాత్మక తీర్మానం చేసింది. అదేమిటంటే.. సభ్యదేశాలు తమ పౌరుల సంతోషాన్ని కొలిచే  ప్రక్రియ చేపట్టి అందుకు అనుగుణంగా తమ ప్రభుత్వాల విధానాలను రూపొందించుకోవాలని. అదే సందర్భంలో ‘హ్యాపీనెస్ అండ్ వెల్ బీయింగ్’ అనే అంశంపై  2012లో భూటాన్ ప్రధాన మంత్రి అధ్యక్షతన ఐక్యరాజ్యసమితి ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. అప్పుడే ‘వరల్డ్ హ్యాపీనెస్’  అనే దానిపై తొలిసారిగా నివేదిక వెలువడింది. తర్వాత కొద్దినెలలకు ఓఈసీడీ (గ్లోబలైజేషన్ నేపథ్యంలో ఆర్థిక, సాంఘిక, పర్యావరణ సవాళ్లను సమష్టిగా ఎదుర్కొనేందుకు ఏర్పడిన ఒక సంస్థ. ఇందులో 34 దేశాలకు సభ్యత్వం ఉంది) అనే ఫోరం సంతృప్తికరమైన జీవనాన్ని  కొలవడానికి  అంతర్జాతీయ ప్రమాణాలతో కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది.

నిత్య సంతోషం సాధ్యమా?

ఫలానా వ్యక్తి సంతోషంగా ఉన్నాడనేందుకు కొలమానమేమిటి? సంతోషమనేది రెండు విధాలు. ఒకటి భావోద్వేగానికి సంబంధించినదయితే, జీవితం మొత్తానికి లేదా జీవితాంతం సంతోషంగా ఉండడమనేది రెండోది. మీరు సంతోషంగా ఉన్నారా అనేదానికి సంబంధించి వేసే వివిధ ప్రశ్నలకు  ఒకవేళ  వ్యక్తుల సమాధానం రొటీన్‌గా ఉంటే హ్యాపీనెస్.. అంటే ఏమిటో పూర్తిగా అవగతం అవ్వదు. అలాగే దుర్భర దారిద్య్రంలో ఉన్నవాడు భావావేశంతో (ఆశ నెరవేరినప్పుడు కలిగే ఆనందం) ఇచ్చే సమాధానం అంతవరకే పరిమితం. మరి ఎల్లప్పుడూ  సంతోషంగా ఉండే స్థితిని పొందడానికి ఏం చేయాలి?

ప్రకృతి కూడా సంతోషంగా లేదు!

సంతోషానికి అనేక నిర్వచనాలు  ఉండవచ్చు. కానీ మన ఆలోచనలు, చేసే పనుల (మంచీ చెడు)ను బట్టి సంతోషమో, దుఃఖమో కలుగుతాయన్నది కూడా కరెక్టే.  కానీ ఈభూగోళంపై ఏ ప్రాణి సంతోషంగా లేదనీ, మనిషి సరేసరి.. పశుపక్ష్యాదులు, చివరికి  ప్రకృతి కూడా సంతోషంగా లేద న్నది వాస్తవం. నిజానికి ఇది మనిషి తనకుతాను వేసుకుంటున్న శిక్ష. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, మారిన జీవన విధానం, మానవ సంబంధాల పట్ల నిర్లిప్తత తదితర లోపాలే శాపాలుగా మారడంతో సంతోషానికి కొలమానాలు వెతకాల్సిన దుస్థితి ఏర్పడింది. అందుకే ప్రకృతిని సంతోషంగా ఉంచితే మనిషీ సంతోషంగా ఉంటాడు.
 - ఎం.జి.నజీర్
 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు