గుండె గుండెలో వై ఎస్ ఆర్

7 Jul, 2016 22:25 IST|Sakshi
గుండె గుండెలో వై ఎస్ ఆర్

యోధుడు
సంరక్షకుడు
రారాజు

 

నారు పోశాడు... నీరు పోశాడు. గుండె తడిమాడు. ప్రాణం పోశాడు. వికసిస్తున్న ఈ పూలన్నీ వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి తోటలోనివే.
 అందుకేనేమో ఇంకా వై.ఎస్.ఆర్. పరిమళం గుప్పుమని మన గుండెల్ని తాకుతూనే ఉంది. పువ్వు పువ్వులో వై.ఎస్.ఆర్.  గుండె గుండెలో వై.ఎస్.ఆర్.
 
ఒక మధ్యతరగతి ఇంట్లో ఒక్కరికి అనారోగ్యం చేసినా... ఆ కుటుంబం ఆర్థికంగా, మానసికంగా అల్లకల్లోలమైపోతుంది. ఆరోగ్యసేవలు ఖరీదై, వైద్యం కొండెక్కి కూర్చున్న వేళ ఇదో అనివార్యమైన దుఃఖం. ఈ సంగతి గ్రహించారు కాబట్టే, పేదవారి ఆరోగ్యసిరికి కొండంత అండయ్యారు వై.ఎస్.ఆర్! పేదవాడి గుండె చప్పుడు విని, ఆయన మనసులో మెదిలిన ఒక చిన్న ‘ఆరోగ్యశ్రీ’ ఆలోచన ఇవాళ లక్షలాది తెలుగు ఇళ్ళల్లో దీపాల్ని వెలిగించింది. ఆరోగ్య సమస్య ఏదైనా శ్రీరామరక్ష వై.ఎస్.ఆర్. ఆరోగ్యశ్రీ. అలాంటి లక్షలాది లబ్ధిదారుల నుంచి మచ్చుకు కొద్దిమంది పసివారి  అనుభవాలు... వారి మాటల్లోనే...
 
 
 
 1. ఆయనే లేకుంటే...!

 ‘‘అమ్మా నాయనలకి నేను రెండో బిడ్డని. పుట్టడంతోనే నాకు గుండెలో రంధ్రం ఉందని డాక్టర్లు సెప్పారంట. మా అమ్మ రేణుక ఒకటే ఏడుపు. మా నాయనకి అమ్మని పట్టతరం కాలేదు. ఆపరేసన్ సేయించాలంటే లచ్చల కర్చు. అంత దుడ్డు మా తాన ఏడ నుంచి వస్తది! కానీ, దేముడు లాంటి వై.ఎస్.ఆర్. తాత ఇచ్చిన ‘ఆరోగ్యశ్రీ’ కార్డు మా దగ్గర ఉంది. దాంతో 2011 జూన్ 21న నాకు హైదరాబాద్‌లో ఆపరేసన్ చేశారట! ఇప్పుడు నేనింత చలాకీగా ఉన్నానంటే, అంతా వైఎస్ తాత పెట్టిన ‘ఆరోగ్యశ్రీ’ పున్నెమే!’’
 - ఏకేశ్ (5), లక్ష్మీపురం, చిత్తూరు జిల్లా
 
 
2.ఐ మిస్ యూ... తాతయ్యా!
 ‘‘అప్పుడు నాకు పది నెలలంట! ఒంట్లో బాగుండట్లేదని హాస్పిటల్ తీసుకెళితే, గుండెలో కన్నం ఉందని డాక్టర్లు చెప్పారట! మా అమ్మా నాన్నలకి కాలూ చెయ్యీ ఆడలేదు. ఏం చేయాలా, నన్నెలా కాపాడుకోవాలా అని తెగ ఇదైపోయారట! ఇంతలో వై.ఎస్.ఆర్.గారు పెట్టిన ‘ఆరోగ్యశ్రీ’ పథకం గురించి మా నాన్నకు తెలిసింది. అంతే! ఆ పథకం సాయంతో మా నాన్న నాకు వెంటనే ఆపరేషన్ చేయించారు. నాకు ఇప్పుడు ఆరోగ్యం బాగుంది. ఆరోగ్యశ్రీ పథకాన్ని రాజశేఖరరెడ్డి తాతయ్య పెట్టారనీ, ఆ తాతయ్య వల్లే నాకు ఆపరేషన్ అయిందనీ మా నాన్న ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఆ పథకం మా ఇంట్లో దీపాన్ని నిలిపిందని మా అమ్మ ఎప్పుడూ అందరితోనూ అంటూ ఉంటుంది. అందుకే నాకు ప్రాణం పోసిన రాజశేఖరరెడ్డి తాతయ్యను స్వయంగా కలవాలని అనుకున్నా. కానీ అది సాధ్యం కాలేదు. అందుకే ఇప్పటికీ బాధపడుతుంటా. ఐ మిస్ యూ తాతయ్యా!’’
 - రావాడ ఉషశ్రీ (7), లక్కిడాం, విజయనగరం జిల్లా
 

3. నడవలేనివాణ్ని పరిగెడుతున్నా!
 ‘‘ఇవాళ నేను ఇంత ఆరోగ్యంగా కనిపిస్తున్నా కదా! కానీ, నేను పుట్టినప్పుడు ఎంతోకాలం బతకను అనుకున్నారట! ఎందుకంటే, నేను పుట్టగానే గుండె బద్దలయ్యేంత నిజం మా నాన్న వసంత్‌కు తెలిసింది. పుట్టుకతోనే నా గుండెలో రంధ్రం ఉందట! నేను సరిగ్గా నడవలేకపోయేవాణ్ణి! నాలుగు అడుగులు వేయగానే నీరసంతో పడిపోయేవాణ్ణి. అప్పుడు వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి తాతయ్య పెట్టిన ఆరోగ్యశ్రీ పథకం నాకు శ్రీరామరక్ష అయింది. హైదరాబాద్ పెద్ద ఆసుపత్రిలో రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా ఆపరేషన్ అయింది. మాలాంటి పేదల కోసం వైఎస్ తాతయ్య చేసిన ఆలోచన పుణ్యమా అని గుండె ఆపరేషన్ జరిగి, నేనిప్పుడు బాగా కోలుకున్నా. నడవడమే కాదు, ఆరోగ్యంగా పరిగెడుతున్నా. బడికి వెళ్ళి, 4వ తరగతి చదువుకుంటున్నా. అందుకే, వై.ఎస్.ఆర్. తాతయ్యకు మా అమ్మ, నాన్న, నేను, అన్నయ్య అందరం ఎంతో రుణపడి ఉన్నాం.’’  - వాంఖడే నిఖిల్ (7), దహెగామ్ గ్రామం, ఆదిలాబాద్
 
 
4. మా పేదోల్లకి పెద్ద దేముడు!
 ‘‘మేము శానా బీదోళ్ళం. మా అమ్మా నాయన పని సేత్తేనే రోజు గడుస్తది. లేదంటే పస్తులే! నాకు 6 నెలలప్పుడు గుండె జబ్బు సేసిందట. గిద్దలూరు, నంద్యాల పట్నాల్లో వైద్యం చేయించారు. ఫలితం లేదు. ఆపరేషన్ సేత్తేనే నేను బతుకుతానన్నారట! దానికి సుమారు 3 లచ్చలవుతుందన్నారు. కానీ, గుడిసెలో బతికేటోల్లం మాకాడ అంత డబ్బేడ నించి వస్తది! అప్పుడు నంద్యాలలో ఒక డాట్టర్ గారు సలహా ఇత్తే, మా నాయన ఖాజావలీ హైదరాబాద్ తీసికెల్లి నన్ను ఆస్పత్రిలో చేర్పించారు. రాజశేఖరరెడ్డి గారి ఆరోగ్యశ్రీ పున్నెమా అని, నాకు ఆపరేసన్ అయింది. నేను బతికా. మా అమ్మా నాయన ఇయాల్టికీ అప్పటి సంగతులు మరిసిపోలేదు. ఆపరేసన్‌కు రెండున్నర లచ్చలైతే, మేము ఒక్క రూపాయి ఇయ్యలేదట. మొత్తం ఆల్లే సూసుకున్నారట! లేదంటే, మా ఇల్లు, పొలం అమ్ముకున్నా అంత డబ్బు వచ్చేది కాదు. నాకు మళ్ళీ జన్మనిచ్చిన ఆ దేముడు మా ఇంట్లో అందరి గుండెల్లో ఉన్నాడు.’’
 - షేక్ సమీర, గిద్దలూరు, ప్రకాశం జిల్లా
 
 
5.  నన్ను బతికించిన తాతయ్య!

 ‘‘మా బాపు మహమ్మద్ సమాద్ ఓ మెకానిక్. మా అమ్మ సుల్తానాను పెళ్ళి చేసుకున్న ఏడాదికల్లా నేను పుట్టా. కానీ పుట్టంగనే నా గుండెలో రంధ్రం ఉందని, ఆపరేషన్ చెయ్యాలనీ, రెండు లక్షలవుతుందనీ అన్నారట. ఒక్క దినం పని లేకున్నా బతుకు గడవదు. వైద్యం కోసం పైసలు యాడ నుంచి తేవాల! దిగులుతో అమ్మ అనారోగ్యం పాలై కన్నుమూసింది. దాంతో బాపు నన్నైనా బతికించుకోవాలనుకున్నారు. అప్పుడే ‘ఆరోగ్యశ్రీ’ గురించి ఎవరో చెప్పారట! హైదరాబాద్‌లోని నారాయణ హృదయాలయంకి వెళ్తే నాకు ఆపరేషన్ చేసి, కొత్త జిందగీ ఇచ్చారు. డిశ్చార్జి చేసి బస్సు చార్జీలకి ఆరు వందలు, మందులిచ్చి మరీ పంపించారు. పూర్తిగా నయమయ్యేవరకు ఉచిత వైద్యపరీక్షలు నిర్వహించి మందులిచ్చారు. అమ్మ మరణంతో కుంగిపోయిన బాపు ఇప్పుడు నేనే లోకంగా బతుకుతున్నాడు. నాకు ఆపరేషన్ జరగకపోతే ఏం జరిగేదోనని ఆలోచిస్తేనే భయమేస్తోంది. అందుకే, ఐ లవ్ వై.ఎస్.ఆర్. తాత!’’
 - సదాఫ్ మోహిన్ (7), లక్సెట్టిపేట, ఆదిలాబాద్
 
 
6. గుండె’ గాయాన్ని మాన్పారు!

 ‘‘నాలుగేల్లూ నోట్లోకెల్లాలంటే, కూలి సేసుకోక తప్పని కుటుంబం మాది. మా అమ్మ ప్రమీలకూ, నాన్న కామరాజుకీ నేను లేక లేక పుట్టానంట! కానీ సిన్నప్పుడే నాకు పాణం బాగలేదని డాక్టర్ దగ్గరకట్టుకెళితే, గుండెలో రంధ్రం ఉంది అన్నారట. తినడానికే డబ్బు లేనోళ్ళం, ఆపరేసన్ ఎట్ట సేయిత్తామని అమ్మానాన్న బెంగపడ్డారు. కానీ, దేముడు లాంటి వై.ఎస్. పెట్టిన ఆరోగ్యశ్రీ మా పాలిట వరమైంది. తిరుపతి ‘స్విమ్స్’ ఆసుపత్రిలో నాకు ఉచితంగా ఆపరేసన్ సేశారు. లచ్చ అయింది. నాకు జనమ నిచ్చింది దేముడైతే, మళ్ళీ జనమ నిచ్చింది వై.ఎస్.ఆర్ తాతే! అందుకే, ఆ తాతను ఎప్పుడూ మరిసిపోను.’’
 - బొడ్డు ఇందు (7), అనుప్పల్లి, చిత్తూరు జిల్లా
 

7. అమ్మ చెప్తా ఉంటది...  అంతా ఆయన చలవంట !
‘‘మా అమ్మానాన్న (తొట్టి ఖాజాబీ, చిన్న సిద్దువలీ) బేల్దారి పని చేస్తుంటారు. నేనప్పుడు పసిపిల్లాణ్ణట! నాకు గుండెలో కన్నం ఉండేదంట! సిన్న ఆస్పత్రుల్లో సూపించారంట. కానీ, బైపాస్ చేయాలని డాక్టర్లు చెప్పారట. కానీ, అందుకు రెండున్నర లచ్చలవుతుంది. మరి, మాకేమో అంత డబ్బు లేదు. అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి సారు పెట్టిన ‘ఆరోగ్యశ్రీ’ ఉపయోగమైంది. హైదరాబాద్‌లోని స్టార్ హాస్పిటల్‌లో ఉచితంగా ఆపరేషన్ చేశారు. నాకు బాగైంది. ఇవాల నేను బతికున్నానంటే, అది ఆ పెద్దాయన చలవేనని మాయమ్మ ఇప్పటికీ చెప్తా ఉంటది!’’  - తొట్టి ఖాదర్‌వలీ (5), ముండ్లపాడు, ప్రకాశం జిల్లా
 
 
8. మా ఇంటి దీపాన్ని నిలిపింది రాజన్నే!

 ‘‘మేం ఎంత నిరుపేదలమంటే, మా అమ్మానాన్నలు (కంభం రమేశ్, సుజాత దంపతులు) చేపలు పట్టి తెచ్చి, వాటిని అమ్మితే కానీ మాకూ రోజూ ఇంత కూడు ఉండదు. నాకు సరిగ్గా ఏణ్ణర్ధం వయసప్పుడు 2007లో ఒకరోజు నాకు బాగా జ్వరం వచ్చిందట. ఒళ్ళు పేలిపోతోంది. కోదాడలో ఓ ఆస్పత్రిలో చూపించారు. నాకు గుండె జబ్బు, వెంటనే పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లి ఆపరేషన్ చేయించాలనీ సూచించారు. వెంటనే విజయవాడలోని రమేష్ కార్డియాక్ సెంటర్‌కు తీసుకెళ్లారు. ఆపరేషన్ చెయ్యాలనీ, ఏడాదిన్నర వయస్సు కాబట్టి హైదరాబాద్‌కు తీసుకెళ్లాలనీ చెప్పారు. దిక్కుతోచని అమ్మానాన్నకు ఆరోగ్యశ్రీ పథకం  గురించి తెలిసింది. వెంటనే నన్ను సికింద్రాబాద్‌లోని పెద్ద హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఉచితంగా ఆపరేషన్ చేశారు. నాకు మళ్ళీ ప్రాణం వచ్చింది. నాకు ప్రాణం పోసిన వై.ఎస్. తాతయ్యకు థ్యాంక్స్ చెప్పుకోలేకపోయానని బాధగా ఉంది.’’
 - కంభం ఉదయ్‌కిరణ్ (11), కోదాడ, నల్గొండ
 

 
 

మరిన్ని వార్తలు