భయంకరం... అత్యుత్తమం

7 May, 2019 00:09 IST|Sakshi

చెట్టు నీడ 

లుఖ్మాన్‌ (అ.లై) ఒక గొప్ప దార్శనికుడు. ఒకసారి అతని యజమాని అతన్ని పిలిచి, ఒక మేకను జుబా చేసి అందులో నుండి శ్రేష్టమైన రెండు అవయవాలు తీసుకుని రమ్మని చెప్పాడు.యజమాని చెప్పిన విధంగానే లుఖ్మాన్‌ మేకను జుబా చేసి అందులో నుండి హృదయం, నాలుకను తెచ్చి యజమానికి ఇచ్చాడు.యజమాని మరో మేకను జుబా చేసి అందులో నుండి భయంకరమైన రెండు అవయవాలు తీసుకుని రమ్మని చెప్పాడు.  యజమాని చెప్పినట్టే మరో మేకను జుబా చేసి అందులో నుండి హృదయం, నాలుకను తెచ్చి యజమానికి ఇచ్చాడు లుఖ్మాన్‌.‘‘అరే! శ్రేష్టమైన అవయవాలు తెమ్మన్నా హృదయాన్నీ, నాలుకనే తెచ్చావు. అతి భయంకరమైన అవయవాలు తెమ్మన్నా మళ్లీ వాటినే తెచ్చావు ఏంటీ?’’ అని ఆశ్చర్యంగా అడిగాడతను. ‘‘అయ్యా! ‘మానవ శరీరంలో అతి ముఖ్యమైన అవయవాలు హృదయం, నాలుకే. ఈ రెండు తమ పనిని సక్రమంగా నిర్వహిస్తే మనిషి జీవితం సాఫీగా సుఖంగా సాగుతుంది. ఈ రెండు గతి తప్పాయా... ఇంతే సంగతులు. అందుకే నేను మీరు శ్రేష్టమైనవి తెమ్మన్నా, భయంకరమైన అవయవాలు తెమ్మన్నా అవే తెచ్చాను‘ అని బదులిచ్చాడు. నిజమే కదా! మనిషి ఆచరణల అంకురార్పణ హృదయంలోనే జరుగుతుంది. నిష్కల్మషమైన మదిలో మంచి ఆలోచనలు వస్తాయి.  ఈర‡్ష్య, ద్వేషం, పగ ప్రతీకారాలతో రగిలే మనసు వల్ల స్వయంగా మనిషికి ప్రశాంతత, సుఖసంతోషాలు కరువైతాయి. ఇలాంటి వారివల్ల సమాజానికి కూడా ఎలాంటి మేలు చేకూరదు.పైగా ప్రమాదమే ప్రమాదం.

ఇంకా నరం లేని నాలుక సమాజంలో అశాంతికి అల్లకల్లోలానికి అసలు కారణం అంటే అతిశయోక్తి కాదేమో. ప్రవక్త (స)‘ నాలుకతో జాగ్రత్తగా ఉండండి. అదే మిమ్మల్ని స్వర్గానికి లేదా నరకానికి తీసుకుని వెళ్ళుతుంది ‘ అని అన్నారు. అందుకే ప్రతి రంజాన్‌మాసంలో ఈ రెంటినీ పరిశుద్ధ పరుచుకునే శిక్షణ పొందే ఏర్పాటే రోజాలు... కేవలం ఉపవాసం చేయడం మాత్రమే కాదు... నాలుకతో చెడు మాట్లాడకూడదు. హృదయం నిండా సాటి మనిషి పట్ల ప్రేమను నింపుకోవాలి. అదే రంజాన్‌ ఉపవాసాల ల క్ష్యం. 
  – షేక్‌ అబ్దుల్‌ బాసిత్‌ 

మరిన్ని వార్తలు