తారాగ్రహం

1 Dec, 2019 04:01 IST|Sakshi

ప్రియాంకారెడ్డి దారుణ మృతి దేశమంతా ప్రతిస్పందనలను వినిపిస్తూనే ఉంది. నిందితులను అప్పజెప్తే ప్రజాకోర్టులో శిక్షిస్తామని ప్రజలు పోలీస్‌ స్టేషన్‌ను ముట్టడిస్తున్నారు. సమాజంలోని అన్ని వర్గాల నుంచే కాకుండా టాలీవుడ్, బాలీవుడ్‌ నుంచి కూడా తారలు తమ ఆగ్రహాన్ని  తెలియజేస్తున్నారు. ఇక్కడ కొందరి ట్వీట్స్‌ ఇస్తున్నాం.

ప్రియాంక ఘటన నన్ను బాధించింది. ఆమె ఎంత బాధను అనుభవించిందో అనే ఆలోచనే కష్టంగా ఉంది. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పోలీసులను సంప్రదించా ల్సిందిగా నా అక్కాచెల్లెళ్లను వేడుకుంటున్నాను.   
– నటుడు మంచు మనోజ్‌

ఇలాంటి ఆలోచన వస్తే భయం వేసేలా ఒక్క తీర్పు రావాలి. అప్పుడే నేరాలు చేయాలనుకునేవారిలో మార్పు వస్తుంది.

– నటుడు రామ్‌

ప్రియాంక హత్యను ఖండించడానికి దారుణం, కిరాతకం వంటి మాటలు సరిపోవు. ఆడపిల్లలను కాపాడుకోలేకపోతే మనకు భవిష్యత్తు ఉండదు.

– నటుడు ‘అల్లరి’ నరేశ్‌

ప్రియాంక ఘటన షాక్‌కు గురి చేసింది. చాలా కోపం వచ్చింది. ఈ ఘటన జరిగి ఉండాల్సింది కాదు.

– నటుడు సుశాంత్‌

ప్రియాంక ఘటన విని చాలా కలత చెందాను. మహిళలపై అఘాయిత్యాలకు ఫుల్‌స్టాప్‌ పడాలి. మన మహిళలు సురక్షితంగా ఉండే వాతావరణం రావాలి

– నటుడు అఖిల్‌

ఆపద సమయంలో పోలీసుల సహాయం తీసుకోవాలి. లైవ్‌ లొకేషన్‌ యాప్స్, అత్యవసర ఫోన్‌ కాల్‌ ఆప్షన్స్‌ తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. ప్రియాంక ఆత్మకు శాంతి కలగాలి.

– నటుడు సుధీర్‌బాబు

దోషులకు మరణశిక్ష విధించినప్పుడే ఇలాంటి భయంకర ఘటనలు ఆగుతాయి. నీకు (ప్రియాంక) ఇలా జరిగినందుకు సమాజం సిగ్గుపడాలి.
       
– నటుడు నిఖిల్‌

ప్రియాంక హత్య వినగానే బాధ, కోపం, నిస్సహాయత వంటి భావోద్వేగాలు కలిగాయి. మనందరి ఆగ్రహం ఆమెకు న్యాయం జరగడానికి తోడ్పడాలి. మహిళలు కూడా భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

– నటుడు అల్లు శిరీష్‌

ప్రియాంకకు జరిగినదానికి ఏ విధంగా న్యాయం చేయగలం? మహిళలకు ఈ ప్రపంచంలో రక్షణ ఎప్పుడు లభిస్తుందో?

– నభా నటేష్‌

ప్రియాంక ఘటనలో దోషులకు జీవిత ఖైదు సరిపోదు. రేపిస్టులను కఠినంగా శిక్షించినప్పుడు ఇలాంటివి ఆగుతాయి. లేకపోతే ఆగవేమో అనిపిస్తోంది. మహిళా చట్టాలు మరింత బలంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.  
      
– నటి, నిర్మాత చార్మీ

అసలు మహిళలకు రక్షణ ఉందా? అనిపిస్తోంది. మీరు (స్త్రీ) అపాయంలో ఉన్నప్పుడు సహాయం అడగటానికి వెనకాడకండి. అలాగే మరొకరు ఆపదలో ఉన్నారన్నప్పుడు సహాయం చేయకుండా ఉండకండి.
– నటి రష్మికా మందన్నా

ప్రియాంక ఘటన బాధించింది. ఇది మనకు తెలిసిన ఘటన. ఇలాంటి తెలియని çఘటనలు ఇంకా ఎన్ని ఉన్నాయో? దోషులకు శిక్ష పడాలి.
        
– నిధీ అగర్వాల్‌

చట్టాలు మారే లోపు ఇంకెంతమంది అమాయక మహిళలు చనిపోవాలి? దేశంలోని మహిళలకు సరైన న్యాయం ఎప్పుడు? స్త్రీలకు సురక్షిత వాతావరణం ఎప్పుడొస్తుంది? ప్రియాంక ఘటనలో మానవత్వం చనిపోయిందనిపిస్తోంది.
          
– నటుడు అనిల్‌ కపూర్‌

హైదరాబాద్‌లో ప్రియాంక, తమిళనాడులో రోజా, రాంచీలో లా స్టూడెంట్‌... ఇలా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉండటం విచారకరం. సమాజంలో నైతిక విలువలు తగ్గిపోతున్నాయి. నిర్భయ చట్టం వచ్చి ఏడేళ్లు పూర్తవుతున్నప్పటికీ ఇలాంటి భయంకర ఘటనలు ఆగడం లేదు. మన చట్టాలు ఇంకా కఠినంగా ఉండాలి.

– నటుడు అక్షయ్‌ కుమార్‌

ప్రియాంక ఘటన నన్ను బాధిస్తోంది. మానవ రూపంలో ఉన్న సైతాన్లు వాళ్లు. నిర్భయ, ప్రియాంక వంటి అమాయకులు మన మధ్యలోనే ఉన్న కొందరు సైతాన్ల వల్ల చనిపోతున్నారు. మరో అమాయకురాలు ఇలాంటి ఘటన బారిన పడకుండా మనం అందరం చేతులు కలపాలి. ఇలాంటి సంఘటనలను ఆపాలి.

– నటుడు సల్మాన్‌ ఖాన్‌

మహిళలపై ఆత్యాచారాలు జరగకుండా దేశం అంతా సంఘటితం కావాల్సిన తరుణం ఇది. అంత సులభంగా మహిళలపై అఘాయిత్యాలకు ఎలా పాల్పడుతున్నారు? ఆ రాక్షసులు చట్టానికి ఎందుకు భయపడటం లేదు? ప్రియాంకకు, ఆమె కుటుంబానికి న్యాయం జరిగేలా మనం పోరాడాలి.

– నటుడు వరుణ్‌ ధావన్‌

మరిన్ని వార్తలు