ముద్దుల మావయ్య హిందీలో నేనే తీశాను

14 Dec, 2019 01:10 IST|Sakshi

అతిథి

బాలీవుడ్‌లో భారీ చిత్రాల నిర్మాతగా ఒక కాలంలో ఊపు ఊపిన వ్యక్తి కేసీ బొకాడియా. అమితాబ్‌తో హిందీలో ‘ముద్దుల మావయ్య’ను ‘ఆజ్‌ కా అర్జున్‌’గా రీమేక్‌ చేశారు. రజనీకాంత్, మిథున్‌ చక్రవర్తి బొకాడియా సినిమా అంటే డేట్స్‌ ఇవ్వడానికి రెడీగా ఉండేవారు. ఇప్పుడాయన హిందీలో తాను తీసిన ‘తేరీ మెహర్బానియా’ చిత్రం స్ఫూర్తితో తెలుగులో ‘నమస్తే నేస్తం’ అనే సినిమా తెరకెక్కించారు. ఈ సినిమా ద్వారా తెలుగులోకి తొలిసారి దర్శక–నిర్మాతగా పరిచయమవుతున్నారు. త్వరలో ఈ సినిమా రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా తన ప్రయాణం గురించి ‘సాక్షి’తో ముచ్చటించారు.

హిందీలో మన్మోహన్‌ దేశాయ్‌ అనే దర్శకుడు ఉన్నారు. ఆయన ఫార్ములా ఏంటంటే.. సినిమాలో ఇద్దరు హీరోలుంటారు. వాళ్లు చిన్నప్పుడు విడిపోతారు. ఇంటర్వెల్‌కి కలుస్తారు. ఈ ఇద్దరూ సెకండ్‌ హాఫ్‌లో విలన్లను ఎలా మట్టుపెట్టారన్నది కథాంశం. ఇదే పాయింట్‌తో రెండు కుక్కలను హీరోలుగా పెట్టి ‘నమస్తే నేస్తం’ సినిమా తీశాను.  

కుక్కపిల్లలతో నేస్తం
విడిపోయిన రెండు కుక్కపిల్లల్లో ఒకటి పోలీసుల దగ్గర, మరోటి దొంగల దగ్గర పెరుగుతాయి. శ్రీరామ్‌ పోలీస్‌ పాత్ర చేశారు. అతను హత్యకు గురవుతాడు. విడిపోయిన కుక్కపిల్లలు ఎలా కలుసుకున్నాయి, ఎలాంటి సాహసాలు చేశాయి? బాస్‌ని చంపిన వాళ్ల మీద ఎలా పగ తీర్చుకున్నాయి? అనేది కథ. బ్రహ్మానందం ఈ కుక్కపిల్లలకు శిక్షణ ఇచ్చే పాత్రలో కనిపిస్తారు.  

అప్పుడే కాదు.. నేనిప్పుడూ అంతే
పెద్ద హీరోలతో సినిమా చేద్దామనుకున్నాను. బడ్జెట్‌ పెరిగిపోయింది. పైగా హీరోలందరూ ఎవరి బ్యానర్‌ వారు పెట్టుకొని సొంతంగా సినిమాలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ‘నాకో సినిమా చేయండి’ అంటూ అందరి డోర్‌ కొట్టలేను. నేను బాగా సినిమాలు తీస్తున్న సమయంలో అలా అడిగింది లేదు. ఇప్పుడూ అంతే..  

ఫాస్టెస్ట్‌ ప్రొడ్యూసర్‌
మా నాన్నగారు ఒక్క సినిమా కూడా చూసింది లేదు. అలాంటిది నేను హిందీ పరిశ్రమలోకి వచ్చి 50 సినిమాలకు పైగా నిరి్మంచాను. అతి తక్కువ సమయంలో 50 సినిమాలు తీసిన నిర్మాతను కాబట్టి నన్ను ‘ఫాస్టెస్ట్‌ ప్రొడ్యూసర్‌’ అంటారు. దర్శకుడిగా తొలి సినిమాను అమితాబ్‌ బచ్చన్‌ (‘ఆజ్‌ కా అర్జున్‌’)తో తీశాను. రజనీకాంత్‌తో ఐదు సినిమాలు చేశాను.  

రజనీతో ప్రయాణం

చెన్నైలో రజనీకాంత్‌ ఇల్లు, మా ఇల్లు దగ్గర దగ్గరే ఉండేవి. రజనీతో నేను ‘ఫూల్‌ బనే అంగారే, త్యాగీ, ఇన్‌సానియత్‌ కా క్యా హోగా, ఇన్‌సాఫ్‌ క్యా కరేగా?, అస్‌లీ– నక్లీ’ సినిమాలు చేశాను. ‘ఈ సినిమా కథేంటి‘ అని రజనీ అడిగిన సందర్భం లేదు. ‘బొకాడియా సినిమా.. చేస్తున్నా’ అనేవారు. మా ఇద్దరి అనుబంధం అలాంటిది.  
రజనీ ఫిలాసఫీలు భలే ఉంటాయి  ఓసారి.. డబ్బంటే ఏంటి? కాగితం అంతే. ఆ కాగితానికి కరెన్సీ అనే విలువ ఇవ్వకపోతే బీరువాలో న్యూస్‌పేపర్‌ పెట్టుకుని కూడా కోట్లు ఉన్నట్టు దీమాగా ఉండొచ్చు అన్నారు.  

బచ్చన్‌కి కోటి రూపాయల పారితోషికం

అమితాబ్‌ బచ్చన్‌తో సినిమా తీయండని మా ప్రొడక్షన్‌ మ్యానేజర్‌ అంటే, బచ్చన్‌ని కలసి విషయం చెప్పాను. అప్పటికి దర్శకుడు, కథ ఏదీ లేదు. ‘కథ, దర్శకుడు’ లేకుండా అంగీకరిస్తున్న సినిమా ఇదే బొకాడియా’ అన్నారు బచ్చన్‌. రెండు నెల్లలో పాయింట్‌ ఓకే అయింది. ఒక దర్శకుడిని అనుకున్నాం కానీ కుదర్లేదు. మీరెందు కు డైరెక్షన్‌ చేయకూడదు అని నా స్టాఫ్‌ అన్నారు. నాకు దర్శకత్వం మీద అవగాహన లేదు. కానీ కథ మీద కంట్రోల్‌ ఉంది. రేపు ముహూర్తం అనగా తమిళ దర్శకుడు మణివణ్ణన్‌తో అరగంట మాట్లాడాను. ఆ అవగాహనతో నేనే డైరెక్షన్‌ చేయాలనుకున్నాను. మరుసటి రోజు ముహూర్తంలో నేను పెట్టిన షాట్‌ చూసి అమితాబ్‌ అభినందించారు. అదే ‘ఆజ్‌ కా అర్జున్‌’ సినిమా. మేం 70 లక్షలు తీసుకుంటున్నాం, ఇప్పుడు 80 లక్షలు అని పారితోషికం గురించి బచ్చన్‌ మేనేజర్‌ అన్నారు. ‘ఏంటీ? బచ్చన్‌ కోటి రూపాయిలు కూడా తీసుకోవడం లేదా? కోటి  తీసుకోండి’ అన్నాను. మార్వాడీ అతను బేరం చేయకుండా అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తున్నాడేంటి? అన్నట్టు చూశారు.
 
నా స్వభావమే అంత
‘పోలీస్‌ ఔర్‌ ముజ్రిమ్‌’ అనే సినిమాను వినోద్‌ ఖన్నా, మీనాక్షీ శేషాద్రితో ప్లాన్‌ చేశాను. ముహూర్తం కుడా పెట్టాం. ముందు రోజు సాయంత్రం రాజ్‌కుమార్‌గారు ఓ పాత్రకు బావుంటార నుకున్నాం. ఆయనకు ఫోన్‌ చేసి ఓ మంచి పాయింట్‌ ఉంది.. చేయాలన్నాను. వెంటనే ఒప్పుకుని మరుసటి రోజు ఓపెనింగ్‌కు వచ్చారు.  

►ఆయన సినిమా అంగీకరించాలంటే మనిషి కూడా నచ్చాలి. ఒక దర్శకుడు ఆయనకు కథ చెప్పడానికి వెళ్లాడు. రాజ్‌కుమార్‌ కథంతా విని, బావుంది కానీ నీ తలకు పెట్టుకున్న సంపెంగ నూనె ఇబ్బందిపెడుతోంది. 6 నెలలు ఇబ్బంది పడుతూ పని చేయలేను. అందుకే సినిమా చేయలేను అని చెప్పారు. అలాంటి ఆయన ‘పోలీస్‌ ఔర్‌ ముజ్రిమ్‌’లో కీలక పాత్ర చేశారు.  నేను చాలామంది హీరోలకు సినిమా చేయాలనుకుంటున్న విషయాన్ని ఫోన్‌లో చెబితే, ముందు ‘యస్‌’ చెప్పి, తర్వాత కథ వినేవారు.

నా అభిమాన నటుడు ఇబ్బందిపెట్టాడు
చిన్నప్పుడు మనందరం మనకు నచ్చిన స్టార్స్‌లా హెయిర్‌ కట్‌ చేయించుకుంటాం కదా. నేనూ అలానే ఓ స్టార్‌ హీరోకి ఫ్యాన్‌గా ఉండేవాణ్ణి. దర్శకుడిని అయ్యాక ఆయనతో సినిమా చేసే అవకాశం లభించింది. కానీ ఆ ప్రముఖ నటుడు నా సినిమా సెట్లో ఇబ్బంది పెట్టారు. ఆరోగ్యం బాలేదని చెప్పి రూమ్‌లో మందు కొడుతూ కూర్చున్నాడు. మీ అవసరం మాకు లేదు అని అతన్ని అక్కడి నుంచి వెనక్కి పంపించేశాను. నా స్వభావమే అంత.  

స్టార్స్‌ని పరిచయం చేశాను
‘దీవానా మే దీవానా’తో ప్రియాంక చోప్రాను హిందీలో పరిచయం చేశాను. జేకే బీహారి దర్శక త్వంలో తెరకెక్కిన ‘బీవీతో ఏసీ హై’ ద్వారా సల్మాన్‌ ఖాన్‌ నటుడిగా పరిచయం అయ్యారు. ఆ సినిమాకు నేనే సమర్పకుణ్ణి. ముందు వేరే హీరోలను అనుకున్నాం కానీ బాగోరనిపించింది. ఫైనల్‌గా సల్మాన్‌ని ఓకే చేశాం.

తెలుగు ఇండస్ట్రీ బెస్ట్‌
ప్రస్తుతం బాలీవుడ్‌లో కంపెనీ కల్చర్‌ నడుస్తోంది. ఏ దర్శకుడైనా కథను యాక్టర్‌కి చెప్పాలి కదా? కథ ఉంది అంటే మన కంపెనీలో చెప్పండి అంటున్నారు. ఈ విధానం నాకు నచ్చలేదు. దర్శకుడు, హీరో నేరుగా కూర్చుని కథ గురించి చర్చించుకోవాలి. కంపెనీతో నేను చెప్పి, వాళ్లు హీరోకి చెప్పి.. ఇదంతా నాకిష్టం లేదు. అందుకే సినిమాలు తీయడంలేదు. ప్రస్తుతం భారతదేశంలో తెలుగు ఇండస్ట్రీయే  బెస్ట్‌ ఇండస్ట్రీగా ఉంది. తెలుగులో మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నాను.  

►నిర్మాత గా సున్నా నుంచి మొదలై టాప్‌ పొజిషన్‌లోకి వచ్చాను. మధ్యలో కొంచెం విరామం వచ్చింది. ఇప్పుడు మళ్లీ ప్రయాణం ప్రారంభిస్తున్నాను. టాప్‌కి వెళ్లగలను అనే నమ్మకం నాకుంది. దర్శక–నిర్మాతగా చాలా వైభవాన్ని చూశాం. ఓ సినిమాకి దర్శకుడిగా నేను కోటి రూపాయిల పారితోíÙకం అందుకుంటే ఆ సినిమాకి రజనీకాంత్‌ 20 లక్షల రూపాయిలు పారితోíÙకం తీసుకున్నారు. అలాంటి వైభవాన్ని చూశాను.

మరిన్ని వార్తలు