పెదవి పై నలుపు రంగు వస్తుంటే?!

10 Oct, 2019 02:32 IST|Sakshi

బ్యూటిప్స్‌

కొందరికి హార్మోన్లలో మార్పుల వల్ల పై పెదవి మీద వెంట్రుకలు వస్తుంటాయి. లేదంటే పెదవి పై చర్మం నలుపుగా అవుతుంటుంది. ఈ సమస్యకు విరుగుడు ఉంది.

►థ్రెడింగ్, వ్యాక్సింగ్‌ వంటివి మేలైన పద్ధతులు. వీటితోపాటు.. చర్మం నలుపు తగ్గి, సాధారణ రంగులోకి రావాలంటే.. టొమాటో గుజ్జు రాసి, ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. టొమాటో సహజసిద్ధమైన బ్లీచ్‌లాగ పనిచేసి అవాంఛిత రోమాలను, నలుపును తగ్గిస్తుంది.

►టీ స్పూన్‌ తేనెలో అర టీ స్పూన్‌ నిమ్మరసం కలిపి రాయాలి. పదిహేను నిమిషాలు ఉంచి, వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

►పసుపు, పాలు కలిపి చిక్కటి మిశ్రమం తయారు చేసుకోవాలి. దీనిని పెదవిపై నలుపుగా ఉన్న ప్రాంతంలో రాయాలి. ఆరిన తర్వాత కడిగేయాలి.

►కార్న్‌ ఫ్లోర్, గుడ్డులోని తెల్లసొన, పంచదార కలిపి చిక్కటి మిశ్రమం తయారుచేయాలి. ఈ మిశ్రమాన్ని రాసి, ఆరిన తర్వాత కడిగేయాలి. వారంలో రెండు సార్లు ఈ విధంగా చేస్తూ ఉంటే పై పెదమి మీద వచ్చే నలుపు, అవాంఛిత రోమాల సమస్య తగ్గుతుంది.

ఇంటిప్స్‌
►కూరగాయలు తరిగే కటింగ్‌ బోర్డ్‌ సరిగ్గా శుభ్రపడకపోతే వాసన వస్తుంటుంది.  నిమ్మముక్కతో కటింగ్‌ బోర్డ్‌ను బాగా రుద్ది, అరగంటపాటు ఆరనివ్వాలి. తర్వాత కడిగేయాలి.

►వంటగదిని ఎంత శుభ్రం చేసినా దుర్వాసన వస్తూనే ఉందంటే సింకు దగ్గర పెట్టే చెత్తబుట్టను పట్టించుకోవడం లేదని అర్ధం. తగినన్ని నీళ్లలో బేకింగ్‌ సొడా కలిపి, ఆ మిశ్రమాన్ని చెత్తబుట్ట అడుగున పోయాలి. బ్రష్‌తో చెత్తబుట్ట లోపలి భాగాన్ని రుద్ది, గంటపాటు వదిలేయాలి. తర్వాత కడగాలి. మూడు టీ స్పూన్ల వెనీలా ఎసెన్స్‌ లీటర్‌ వేడి నీళ్లలో కలిపి చెత్తబుట్ట లోపలి భాగాన్ని శుభ్రపరచాలి. వారానికి ఒకసారైనా ఈ విధంగా చేస్తూ ఉంటే దుర్వాసన దూరం అవుతుంది.

►ఎంత శుభ్రపరిచినా సమస్యగా అనిపించేది రిఫ్రిజరేటర్‌. ఫ్రిజ్‌ షెల్ఫ్‌ల్లో పదార్థాలు పడిపోయి ఫంగస్‌ చేరుతుంటుంది. వారానికి ఒకసారైనా వెనిగర్‌ కలిపిన గోరువెచ్చని నీళ్లతో ఫ్రిజ్‌ లోపలి భాగాన్ని తుడవాలి. ఒక డబ్బాలో కొద్దిగా బేకింగ్‌ సోడా, బొగ్గు లేదా కాఫీ గింజలు వేసి ఫ్రిజ్‌ లోపల ఒక మూలన ఉంచాలి.

మరిన్ని వార్తలు