సుతిమెత్తని శ్రుతిధ్వనులు

9 Jul, 2018 00:54 IST|Sakshi

ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా ఇటీవల పుణేలో జరిగిన ‘డుమ్రూ’ ఫెస్టివల్‌.. పురుషాధిపత్యాన్ని ఛేదించి, పైచేయి సాధించిన ‘ఉమెన్‌ ఈవెంట్‌’గా ప్రతి హృదయంలో ప్రతిధ్వనించింది.

‘జస్ట్‌ బీట్‌ ఇట్‌..’ మైఖేల్‌ జాక్సన్‌ పాట! కొట్టావా లేదా అన్నదే ముఖ్యం. ఎట్లా కొట్టావన్నది కాదు. తప్పో, రైటో కాదు. అది నీ ఫైట్‌. జస్ట్‌ బీటిట్‌. ఓడామా గెలిచామా కాదు. నువ్వేంటో చూపిస్తున్నావ్‌.. ఇదీ ఈ పాట అర్థం. అమ్మాయిలు కూడా తామేంటో చూపిస్తున్నారు. లలిత వాద్యాలను ఒడిలోంచి తీసి, మెల్లగా పక్కన పెట్టి.. డ్రమ్స్‌ని ‘డిష్‌’ మనిపిస్తున్నారు. తబలా చెంపల్ని లయబద్ధంగా వాయించేస్తున్నారు. మృదంగంపై దరువేస్తున్నారు. మగాళ్లకంటూ ఇప్పుడేం సంగీతవాద్యాలు మిగిల్లేవు!

పురుషుల ఆధిపత్య రంగాలను వారు తమదైన వినూత్న శైలితో బద్దలు కొట్టారు. ఎన్నో ఏళ్ల నుంచి మగవారికే పరిమితమై ఉన్న వాద్యాలపై వారు బలమైన సంతకం చేశారు. పురుషాధిక్య  భావనలు తగ్గేందుకు ఈ అమ్మాయిలు తమ వంతు కృషి చేస్తున్నారు. మృదంగం, తబలా, జాజ్‌ తదితర వాయిద్యాల ప్రదర్శనలు ఎక్కువగా మగవారికే పరిమితం. 

కేవలం పియానో, వయొలిన్‌ వంటి వాద్యాలతోనో, సంగీత, నృత్య ప్రదర్శనలతోనో ఆగిపోకుండా దరువుల్ని కూడా అందుకున్నారు. జాతీయస్థాయిలోనే కాకుండా తమ తమ రాష్ట్రాల్లోనూ ఆయా వాయిద్యాల ప్రదర్శనల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం  చేస్తున్నారు. ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా ఇటీవల పుణేలో నిర్వహించిన ‘డుమ్రూ’ ఫెస్టివల్‌ ఇలా.. పురుషాధిపత్యాన్ని ఛేదించిన, పైచేయి సాధించిన ఈవెంట్‌గా నిలిచింది.  

మొదట 2011లో పుణేలో మొదలైన  ఈ వాద్య ఉత్సవాలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. అయితే నిర్వాహకులు ఓ ముఖ్యమైన అంశాన్ని ఆలస్యంగా గుర్తించారు. ఈ సంగీతోత్సవాల్లో మహిళా ప్రదర్శకులకు చోటు లేకపోవడం ఒక పెద్ద వెలితిగా వారికి కనిపించింది. దీనిని సవరించుకునేందుకు 2016లో మొదటిసారిగా కేవలం మహిళా వాద్యకారులతోనే కార్యక్రమాలు నిర్వహించారు.  ఏడాదిన్నర లోగానే మళ్లీ కేవలం అమ్మాయిల వాద్య కచేరీలు.. అందునా జాజ్, తబలా, మృదంగం వంటి సంగీత సాధనాలతో ప్రదర్శనలు నిర్వహించారు.

కొన్ని దశాబ్దాల కింద మహిళల ప్రదర్శనలకు మృదంగం తదితర వాద్యాలను మోగించేందుకు కూడా పురుష వాద్యకారులు ఇష్టపడని రోజుల నుంచి.. ఇప్పుడు తమకు తాముగా ఆ వాయిద్య ప్రదర్శనలిచ్చే స్థాయికి మహిళలు చేరుకున్నారని డుమ్రూ ఫెస్టివల్‌ వ్యవస్థాపక డైరెక్టర్‌ ఆదిత్య ప్రభు అంటారు. ‘‘ఈ సంగీత ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో హాజరవుతున్న వారికి  మహిళా వాద్యకళాకారుల ప్రదర్శనల ద్వారా అమ్మాయిలు ఏ విషయంలోనూ అబ్బాయిల కంటే తక్కువ కాదనే ఓ  సందేశాన్ని ఇవ్వదలిచాం’’ అన్నారు ఆదిత్య.

ఈ ఏడాది ‘ ఉమెన్‌ ఆఫ్‌ రిథమ్‌’ పేరిట నిర్వహించిన ఉత్సవంలో ఏడుగురు మహిళా వాద్యకళాకారులు ప్రదర్శనలిచ్చారు. పుణేలో దీనిని నిర్వహించినందువల్ల ముగ్గురు ఆ ప్రాంతానికి చెందినవారే ఉన్నారు. వీరిలో 15 ఏళ్ల జాజ్‌ డ్రమ్మర్‌ అనన్య పాటిల్‌ అందరికంటే పిన్న వయస్కురాలు. మిగతావాళ్లు సవానీ తల్వాల్కర్, మహిమా ఉపాధ్యాయ్, మిథాలీ కర్గాంవ్‌కర్, సిద్ధిషా, రేష్మా పండిట్, చారు హరిహరన్‌.  

– కె.రాహుల్‌

మరిన్ని వార్తలు