ఇష్టం లేని టాపిక్‌

10 Dec, 2017 00:26 IST|Sakshi

ఈ మధ్యనే తబుస్సమ్‌ ఫాతిమా హష్మీ బర్త్‌డే జరిగింది. ఈ మధ్యే అంటే నవంబర్‌ 4న. ఈ తబుస్సమ్‌ ఎవరంటే.. మన హీరోయిన్‌ టాబూ! బర్త్‌డే పార్టీకి వచ్చిన వారిలో కొందరు ‘పెళ్లెప్పుడు టాబూ’ అన్నట్లు చూశారు. ‘పెళ్లే ఇంత ఆలస్యమైతే.. పిల్లలెప్పుడు’ అని ఇంకొన్ని చూపులు ఆమెను అడిగాయి. ‘ఇంకా ఎంతమందిని ప్రేమిస్తావ్‌ తల్లీ’ అని మరికొన్ని చనువున్న చూపులు ప్రశ్నించాయి.

అన్నిటికీ టాబూ సమాధానం ఒక్కటే. చిరునవ్వు. టాబూకి 46 ఏళ్లు. ఇప్పటికైనా, అసలెప్పటికైనా ఒక తోడు లేకుండా ఎలా అని దగ్గరి బంధువులు ఆమెను డైరెక్టుగానే అడుగుతున్నారు. వీటన్నిటికీ రియాక్ట్‌ అవుతూ కూర్చుంటే, అగ్నికి ఆజ్యం పోసినట్లేనని టాబూ ఫీల్‌ అవుతోంది. ‘‘ఎన్నిసార్లని చిరునవ్వుతో నెట్టుకొస్తాం. వీళ్లు విసిరే చూపులకు, అడిగే ప్రశ్నలకు కొన్నిసార్లు చికాకు వేస్తుంది. కొన్నిసార్లు నిస్పృహ కలుగుతుంది. నన్ను నాలా ఎందుకు ఉండనివ్వరు.

ఒక మనిషి జీవితాన్ని ‘పెళ్లి, పిల్లలు’ అనే కొలమానాలతోనే ఈ సమాజం ఎందుకు జడ్జ్‌ చేస్తుందో అర్థం కాదు. నేనెవర్నీ పట్టించుకోను. నన్నూ ఎవరూ పట్టించుకోకపోతే నాకు కంఫర్ట్‌గా ఉంటుంది’’ అని టాబూ అంటోంది. అయినా సడెన్‌గా ఇప్పుడెందుకు టాబూ హర్ట్‌ అయ్యారు. అవదా మరి? అకేషన్‌ ఏదైనా.. లొకేషన్‌ ఏదైనా మీడియా కొన్నేళ్లుగా ఆమెకు సంధిస్తున్న మొదటి ప్రశ్న ఇదే.. పెళ్లెప్పుడని! ‘మక్బూల్‌’లో నిమ్మీగా, ‘చాందినీ బార్‌’లో డ్యాన్సర్‌గా, దృశ్యంలో టాప్‌ కాప్‌గా.. ఆమె కెరీర్‌లో ఇన్ని మంచి పాత్రలుంటే, నిజ జీవితంలో లేని ‘భార్య’ అనే పాత్ర గురించే అంతా అడగడం న్యాయమేనా? ‘ఆ టాపిక్‌ నాకు నచ్చదు దేవుడా’ అని టాబూ మొత్తుకుంటున్నా కూడా అడగడం కరెక్టేనా?

మరిన్ని వార్తలు