రొమేనియా

13 Dec, 2014 22:45 IST|Sakshi
రొమేనియా

ప్రపంచవీక్షణం
 
నైసర్గిక స్వరూపం
 
ఖండం: యూరప్
వైశాల్యం: 2,38,391 చదరపు కిలోమీటర్లు
జనాభా: 2,33,72,101 (తాజా అంచనాల ప్రకారం)
రాజధాని: బుఖారెస్ట్
ప్రభుత్వం: యూనిటరీ సెమీ ప్రెసిడెన్షియల్ రిపబ్లిక్
కరెన్సీ: ల్యూ
అధికారిక భాష: రొమేనియన్, మతం: 80 శాతం క్రైస్తవులు
వాతావరణం: చలికాలంలో 2 డిగ్రీలు, వేసవిలో 21 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది.
పంటలు: చిరుధాన్యాలు, బంగాళదుంపలు, చెరకు, పళ్లు, కూరగాయలు, ద్రాక్ష, పశుపోషణ, చేపలవేట.
పరిశ్రమలు: వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ఇనుము, ఉక్కు పరిశ్రమలు, గనులు, రసాయనాలు, ఓడల నిర్మాణం, యంత్రపరికరాలు, చమురు సహజ వాయువులు, బొగ్గు, లిగ్నైట్, ముడి ఇనుము, ఉప్పు, రాగి, సీసం, బంగారం, వెండి.
సరిహద్దులు: రష్యా, హంగేరీ, యుగోస్లేవియా, బల్గేరియా, నల్లసముద్రం.
స్వాత ంత్య్ర దినం: 1878, మే 9 (దీనిపై భిన్నస్వరాలున్నాయి)
 
చరిత్ర - పరిపాలనా విధానాలు
 
చరిత్ర: రొమేనియన్లు ఒకప్పుడు బానిసలుగా ఉన్నా, వారి భాషను, సంస్కృతిని నేటికీ కాపాడుకుంటున్నారు. చుట్టూ ఉన్న దేశాల వాళ్ళు ఎంత ఒత్తిడి చేసినా వీరు తమ సత్తా చాటుకున్నారు. ముఖ్యంగా టర్కీ రాజులతో రొమేనియన్లు ఎక్కువగా  పోరాటాలు చేశారు. 14వ శతాబ్దం నుండి టర్కీయులు, రొమేనియన్లను ఎన్నో హింసలకు గురిచేశారు. 1877లో పాక్షిక స్వాతంత్య్రం లభించింది. మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీకి వ్యతిరేకంగా యుద్ధం చేశారు. దేశంలో డాన్యూబ్‌నది పరీవాహక ప్రాంతం మంచి సారవంతమైన భూమి. ఈ నది నల్లసముద్రంలో కలుస్తుంది. ఈ డెల్టా ప్రాంతంలో వ్యవసాయం ఎక్కువగా సాగు అవుతుంది. శతాబ్దాల నాటి సంస్కృతి ప్రస్తుతం మారామూర్స్, మోల్డావియా, వాల్లాబియా ప్రాంతాలలో ప్రస్ఫుటంగా కనబడుతుంది.

రొమేనియా దేశాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం 41 కౌంటీలుగా విభజించారు. ప్రతి కౌంటీ కూడా తిరిగి సిటీ, కమ్యూన్‌లుగా విభజింపబడి ఉంటాయి. ప్రతి స్థాయిలో ప్రభుత్వ అధికారులు పాలన కొనసాగిస్తారు. పెద్ద నగరాలను మున్సిపాలిటీలుగా పిలుస్తారు. రాజధాని బుఖారెస్ట్ నగరం ఆరు సెక్టార్‌లుగా విడిపోయి ఉంటుంది. దేశంలో 54 శాతం మంది ప్రజలు పట్టణాలలో నివసిస్తారు. దేశ రాజధానితో పాటు అతి పెద్ద నగరాలు దేశంలో 20కి పైగా ఉన్నాయి.
 
సంస్కృతి, సంప్రదాయాలు, ఆహారం
 
సంస్కృతి, సంప్రదాయాలు: దేశంలో స్వాతంత్య్రదినాన్ని చాలా ఘనంగా జరుపుకుంటారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో నృత్యాలు, ఆటపాటలు నిర్వహిస్తారు. ఈ సమయంలో ప్రజలు సంస్కృతిని ప్రతిబింబించే దుస్తులను ధరిస్తారు. క్రిస్‌మస్ రోజున పందులను బలి ఇవ్వడం వీరి సంప్రదాయం. అలాగే ఈస్టర్ రోజున గొర్రెలను బలి ఇస్తారు. ఈ రోజున అందంగా పెయింటింగ్ చేసి గుడ్లను ప్రతి కుటుంబం కొనుగోలు చేసి ఇంట్లో అలంకరణగా పెట్టుకుంటుంది. ప్రజలు సంప్రదాయరీతిలో తెల్లటి దుస్తులు, వాటిమీద రకరకాల అల్లికలు చేసిన వేస్ట్‌కోట్లలాంటివి ధరిస్తారు. తలకు చిత్రవిచిత్ర ఆకారాలలో ఉండే టోపీలు ధరిస్తారు. ప్లుగుసోరులుల్, సోర్కొవా, ఉర్సుల్, కాప్రా అనే నృత్యాలను ప్రదర్శిస్తారు.

ఆహారం: వీరి ఆహారం అంతా గ్రీకు, బల్గేరియా, టర్కిష్ ఆహార రీతులను తలపిస్తుంది. పుల్లగా ఉండే సూప్‌లను బాగా తాగుతారు. వీటిని కియోర్బా అంటారు. పందిమాంసం, చేపలు, ఎద్దుమాంసం, గొర్రె,, చేప వీరికి ముఖ్యమైన ఆహారం. మాంసంతో దాదాపు 40 రకాల వంటకాలు చేస్తారు. చేపలతో 8 రకాల వంటకాలు చేస్తారు. కూరగాయలతో 25 రకాల వంటకాలను చేస్తారు. బ్రెడ్డు, చీజ్ ఎక్కువగా తింటారు. బ్రెడ్డుతో రకరకాల వెరైటీలు తయారుచేస్తారు. క్రిస్మస్ సమయంలో వీరు మాంసం అధికంగా తింటారు. ఈ సీజన్‌లో ప్రతిరోజూ మత్తు పానీయాలు తప్పనిసరిగా సేవిస్తారు.
 
చూడదగిన ప్రదేశాలు
 

1. ప్యాలెస్ ఆఫ్ కల్చర్: రాజధాని నగరంలో నిర్మించబడిన ఒక గొప్ప కట్టడం ప్యాలెస్ ఆఫ్ కల్చర్. 3 లక్షల 90 వేల చదరపు అడుగుల స్థలంలో 290 గదులతో ఎంతో విశాలంగా, అద్భుతంగా నిర్మితమైంది. 1906వ సంవత్సరంలో ఈ భవనం నిర్మించబడింది. దాదాపు 20 సంవత్సరాల సమయంలో దీని నిర్మాణం పూర్తయింది. ఈ భవనంలోనే నాలుగు విశాలమైన అద్భుతమైన మ్యూజియంలు ఉన్నాయి. ప్రస్తుతం ఇది దేశ చారిత్రక కట్టడంగా వెలుగొందుతోంది.
 
 2. బుఖారెస్ట్: ఈ నగరం 1459లో నిర్మితమైంది అని చరిత్ర చెబుతోంది. ఇది డాంబోవిటా నది ఒడ్డున ఉంది. ఈ నగరంలో ముప్పై లక్షలకు పైగా జనాభా ఉంటుంది. దాదాపు 500 కి.మీ. పరిధిలో ఈ నగరం విస్తరించి ఉంది. నగరంలో రకరకాల మ్యూజియమ్‌లు, బొటానికల్ గార్డెన్‌లు, సరస్సులు ఉన్నాయి. ఈ నగరం ఆరు సెక్టార్‌లుగా విభజింపబడి ఉంది. ఈ నగరంలోనే ప్యాలెస్ ఆఫ్ జస్టిస్ భవనం ఉంది. ఫ్లోరెస్కా సిటీసెంటర్, షెన్రీకోండా అంతర్జాతీయ విమానాశ్రయం, విక్టరీ అవెన్యూ, నేషనల్ లైబ్రరీ, అర్కుల్ డి ట్రంఫ్, నేషనల్ మ్యూజియం, రొమేనియా అథేనియం, సియసి ప్యాలెస్, ప్యాలెస్ ఆఫ్ పార్లమెంట్. రాజధాని నగరం చాలా విశాలంగా ఉంటుంది. జనాభా కూడా ఎక్కువే. అయితే ఏ రోడ్డు చూసినా ఎంతో పరిశుభ్రంగా ఉంటుంది. చెత్తా చెదారం ఎక్కడా కనబడదు.
 
 3. ట్రాన్స్ పగరాసన్:  ఇది ఒక పర్వత భాగం. ఇది సిబియు, పిటేస్టి నగరాల మధ్యన ఉంటుంది. ఈ పర్వత భాగాన్ని ఓ వైపు నుండి బయలుదేరి మరోవైపు దిగడానికి నిర్మించిన రోడ్డు మార్గం తప్పనిసరిగా చూసితీరవలసిందే. దీని పొడవు 60 మైళ్ళు ఉంది. 1970-1974 మధ్యకాలంలో నిర్మించిన ఈ రోడ్డు మొదట మిలిటరీ అవసరాలకు ఉద్దేశించారు. కాని ఇప్పుడు అది యాత్రీకులకు ఒక గొప్ప అనుభూతిని కలిగించే మార్గంగా మారిపోయింది. ఈ రోడ్డు నిర్మాణానికి 13 వేల పౌండ్ల ైడైనమైట్ పదార్థాలను ఉపయోగించారు. విహంగవీక్షణం చేస్తే ఈ మార్గం ఓ పొడవాటి సర్పం మెలికలు తిరుగుతూ పాకుతూ ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ రోడ్డు మార్గంలో ప్రయాణించడం గొప్ప అనుభూతిని మిగిలిస్తుంది. ఈ రోడ్డు మార్గాన్ని అక్టోబర్ నుండి జూన్ నెలల మధ్యకాలంలో మూసివేస్తారు. ఆ సమయంలో విపరీతమైన మంచు కురుస్తుంది.
 
 4. నీమెట్ సిటాడెల్: ఇది దేశానికి ఉత్తర తూర్పు భాగంలో ఉంది. టర్గు నీమెట్ నగరానికి సమీపంలో ఉంది. 14వ శతాబ్దంలో నిర్మించిన ఈ కట్టడం నేటికీ చెక్కుచెదరకుండా ఉంది. దీని నిర్మాణశైలి అత్యంత పటిష్టంగా, శత్రు దుర్భేద్యంగా ఉంటుంది. నదీ గర్భంలో లభించే రాళ్ళు, ఇసుకతో దీనిని నిర్మించారు. ఇదొక పెద్ద కోట.

 భవనం మధ్యభాగంలో ఒక విశాల ప్రదేశం ఉంది. దీనికి చుట్టు అనేక నిర్మాణాలు ఉన్నాయి. ప్రతిభవనం కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ కోట తూర్పు భాగంలో ఆనాటి రాజుల భోజనశాలలు, భాండాగారాలు, జైలుగదులు కోశాగారం, ఆయుధాగారం, న్యాయశాల ఇలా ఎన్నో నిర్మాణాలు ఉన్నాయి. నిర్మాణశైలి ఎంతో పటిష్టంగా ఉండడం వల్ల నేటికీ అది ఒక గొప్ప చారిత్రక ప్రదేశంగా నిలిచి ఉంది. ఎతైన, గోడలు ఇప్పటికీ నిలిచి ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.
 
 5. బాలియా ఐస్ హోటల్: ఐస్‌తో నిర్మితమైన అద్భుతమైన హోటల్ ఇది. ఇది ఫరాగాస్ పర్వత ప్రాంతంలో ఉంది. దేశం మొత్తంలో యాత్రీకులకు అత్యంత ఆకర్షణీయమైన, సహజ సిద్ధమైన కట్టడంగా ఇది ప్రఖ్యాతి చెందింది. ఈ హోటల్‌ను చలికాలంలోనే తెరిచి ఉంచుతారు. ఈ హోటల్ కొంత సమయాన్ని గడపడం గొప్ప అనుభూతిని ఇస్తుంది. పెద్ద పెద్ద ఐస్ బ్లాకులను దీని నిర్మాణానికి ఉపయోగించారు. గోడలు, స్తంభాలు, ఇతరత్రా అన్నీ ఐస్‌తోనే నిర్మించారు. దీనిని చేరుకోవడానికి కేబుల్‌కారులో వెళ్లాల్సి ఉంటుంది.
 
 6. బుసెగి పర్వతాలు: కొండశిఖరం చూస్తే ఒక పెద్ద మనిషి తలలా కనిపించే ఈ బుసెగి పర్వత ప్రాంతాలను చూసితీరవలసిందే. బ్రాసోవ్ నగరానికి సమీపంలో దక్షిణ భాగంలో ఇవి ఉన్నాయి. ఒక పర్వత అగ్రభాగం సింహపు తలను పోలి ఉంటుంది. దీనినే స్ఫింక్స్ అంటారు. మరొకటి కూడా ఇలాగే ఉంటుంది. దానిని బబేలే అంటారు. ఈ పర్వత శిఖరాలలో కొన్ని 7519 అడుగుల ఎత్తు ఉంటాయి. వేలాది సంవత్సరాలుగా ఈ పర్వత అగ్రాలు వాతావరణ మార్పులకు లోనై  తలల మాదిరిగా రూపాంతరం చెందాయి. ఒక పర్వత శిఖరం పుట్టగొడుగులా కనబడుతుంది.  వేలాది సంవత్సరాల క్రితమే ఏర్పడిన ఈ పర్వత శిఖరాలు నేటికి మానవులకు ఒక ప్రశ్నగా మిగిలి ఉన్నాయి.

 రొమేనియా దేశంలో ఇంకా ఎన్నో ప్రాంతాలలో అద్భుతమైన స్థలాలు చూడాల్సినవి ఉన్నాయి. డాన్యూబ్‌నది నల్ల సముద్రంలో కలిసే ప్రాంతంలో ఏర్పడిన డెల్టా భాగం కూడా ఎంతో మనోహరంగా కనబడుతుంది.
 
 

మరిన్ని వార్తలు