టవర్‌ గార్డెన్‌ భేష్‌!

29 Jan, 2019 06:32 IST|Sakshi
వర్టికల్‌ టవర్‌లో రవిచంద్ర, తెల్ల గలిజేరు

ఇంటి పంట

తక్కువ స్థలంలో ఎక్కువ ఆకుకూరలు, కూరగాయలనే కాదు కషాయాల కోసం అనేక రకాల ఔషధ మొక్కలను సైతం పెంచుకోవడానికి వీలు కల్పించే ఉపాయం ‘టవర్‌ గార్డెన్‌’. దీన్నే వర్టికల్‌ గార్డెన్, వర్టికల్‌ టవర్‌ అని కూడా పిలుచుకోవచ్చు. 2 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ టవర్‌ గార్డెన్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. దీనికి చుట్టూతా 60 ప్యాకెట్లు ఉంటాయి. వాటిల్లో 60 మొక్కలు పెంచుకోవచ్చు. బాల్కనీలలో, మేడ పైన, ఇంటి ముందు, ఇంటి వెనుక కొద్దిపాటి ఖాళీ ఉన్నా టవర్‌ గార్డెన్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే, ఇందులో మొక్కలు చక్కగా పెరిగి దిగుబడినివ్వాలంటే కనీసం 3 గంటలు ఎండ తగిలే చోటులో దీన్ని పెట్టుకోవాలి. టవర్‌ గార్డెన్లను పెట్టుకున్న ఇద్దరు హైదరాబాద్‌ వాసుల అనుభవాలు ఈ వారం ‘ఇంటిపంట’ పాఠకులకు ప్రత్యేకం..

ఒక్కో టవర్‌ చుట్టూ 60 మొక్కలు
మా మిద్దె తోటలో టవర్‌ గార్డెన్‌లో ఆకుకూరలు, ఔషధ మొక్కలు పెంచుకుంటున్నాం. ఆకుకూరలను తినడంతోపాటు ఔషధ మొక్కలతో కషాయాలను తాగడం వల్ల కుటుంబం అంతా ప్రయోజనం పొందగలుగుతున్నాం. మా మిద్దె తోటలో ఆరు టవర్‌ గార్డెన్లు ఉన్నాయి. ఒక్కో టవర్‌కు చుట్టూతా, పైన కలిపి 60 మొక్కలు పెట్టుకోవచ్చు. ఇంటిల్లిపాదికీ ఆకుకూరలు, కషాయాల కోసం గ్రీన్స్, మెడిసినల్‌ ప్లాంట్స్‌కు కొరత ఉండకుండా ఇవి ఉపయోగపడుతున్నాయి.

సదాపాకు కషాయం, గోంగూర కషాయం, పుదీనా కషాయం, మెంతికూర, కొత్తిమీర, పునర్నవ (గలిజేరు), తమలపాకు, తిప్పతీగ, గోధుమ ఆకులు, నల్లేరు, 5 రకాల తులసి (రామ తులసి, జింజిర్‌ తులసి, లవంగ తులసి, కర్పూర తులసి, మింట్‌ తులసి), కరివేపాకు, ఉత్తరేణితో పాటు జామ, మామిడి, వేప, రావి, గానుగ, పారిజాతం మొక్కలను కూడా పెంచుకొని వంటల్లోనూ, కషాయాలలోనూ వాడుకుంటూ ఆరోగ్యకరమైన జీవనం సాగిస్తున్నాం. వీటితో పాటు ఖాదర్‌ గారు చెప్పిన ఐదు రకాల సిరిధాన్యాలను తింటున్నాం. తిన్న అందరిలోనూ మార్పు స్పష్టంగా కనపడుతున్నది. స్థలాభావం ఉన్న ఆరోగ్య ప్రియులందరూ మిద్దె మీద టవర్‌ గార్డెన్‌లో ఆకుకూరలు, ఔషధ మొక్కలు పెంచుకునే అవకాశం ఉంది.
– బి. రవిచంద్రకుమార్‌(95812 42255), బ్యాంకు కాలనీ, హైదరాబాద్‌

వర్టికల్‌ టవర్‌లో పుష్కలంగా ఆకుకూరలు
నాలుగు నెలల క్రితం మా మేడ మీద ఒకటి, ఇంటి వెనుక ఖాళీలో మరొకటి వర్టికల్‌ టవర్స్‌ పెట్టాం. టవర్‌ చుట్టూ 10 ప్యాకెట్లలో తెల్లగలిజేరు, కొన్ని ఎర్ర గలిజేరు మొక్కలు పెట్టాను. తోటకూర, గోంగూర, పాలకూర, చెన్నంగి, పొన్నగంటి, మెంతికూరలు కొన్ని ప్యాకెట్లలో విత్తుకున్నాను. తెల్లగలిజేరు 2 నెలల పాటు వరుసగా పప్పులో వేసుకోవడానికి కొరత లేకుండా వచ్చింది. డా. ఖాదర్‌ గారు చెప్పినది విన్న తర్వాత గలిజేరు కషాయం కూడా కొన్నాళ్లు తాగాం. నాటు తోటకూర రెండే మొక్కలు ఉన్నా.. వారానికోసారి కూరకు సరిపడా వస్తున్నాయి. విత్తిన పది రోజుల్లోనే మెంతికూర వచ్చింది. 20 రోజులకు పాలకూర రావడం ప్రారంభమైంది, ఇప్పటిMీ  వారానికోసారి పుష్కలంగా వస్తోంది.  వర్టికల్‌ టవర్‌ పైభాగాన 3 వంగ మొక్కలు పెట్టాను. వారానికో కిలో చొప్పున కాయలు వచ్చాయి.

ఈ వర్టికల్‌ టవర్‌ మధ్యలో నిలువుగా ఉన్న గొట్టంలో వంటింటి వ్యర్థాలను వేస్తూ వర్మీ కంపోస్టును తయారు చేసుకుంటున్నాను. రెండు నెలలకు ఒక కిలో కంపోస్టు వచ్చింది కూడా. వంటింటి వ్యర్థాలను నేరుగా ఇందులో వేయకూడదు. తడి చెత్త, పొడి చెత్తను కలిపి వేస్తే మంచిది. లేదంటే.. కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల తొక్కలను వేరే పాత్రలో వేస్తూ 20 రోజుల తర్వాత సగం కుళ్లిన వ్యర్థాలను తీసి ఈ టవర్‌లో వేసి, కొన్ని వానపాములను వేస్తే చాలు.
 
– నోరి శైలజ (99483 36508), సన్‌సిటీ, కీర్తి రిచ్‌మండ్‌ విల్లాస్, లంగర్‌హౌజ్, హైదరాబాద్‌

మరిన్ని వార్తలు