భయపడి ఛస్తున్నారు

4 Jul, 2019 00:04 IST|Sakshi
‘టాయ్‌ స్టోరీ 2’ చిత్రం లోంచి డిస్నీ పిక్చర్స్‌ తొలగించిన క్యాస్టింగ్‌ కౌచ్‌ ‘బ్లూపర్‌’ ఇదే 

ఇరవై ఏళ్ల నాటి ‘టాయ్‌ స్టోరీ 2’ చిత్రాన్ని మళ్లీ హోమ్‌ వెర్షన్‌గా విడుదల చేస్తూ.. ‘మీటూ’ భయంతో అందులోని ఒక బ్లూపర్‌ని డిస్నీ పిక్చర్స్‌ తొలగించింది! హాలీవుడ్‌లో క్యాస్టింగ్‌ కౌచ్‌ ఉందని చెబుతున్నట్లుగా ఆ బ్లూపర్‌ ఉండడమే అందుకు కారణం.

థియేటర్‌లో ఆడుతున్న సినిమాకు ఇంట్లోని వాళ్లంతా ఒకేసారి కలిసి వెళ్లేందుకు వీలు కాకపోవచ్చు. ఆఫీస్‌లు ఉంటాయి.. అలసిపోయి వస్తారు. స్కూళ్లు ఉంటాయి.. స్కూల్‌బ్యాగ్‌ నిండా చేయవలసిన హోమ్‌ వర్క్‌ ఉంటుంది. కాలేజీలు ఉంటాయి.. ఆ వయసు పిల్లల ఆసక్తులు కలివిడికి భిన్నంగా ఉంటాయి. ఆఫీసులు, స్కూళ్లు, కాలేజీల కన్నా ఎక్కువ.. ఇల్లు! ఎప్పుడూ తెమలని పని ఉంటుంది. సెలవురోజు అందరూ కలిసి వెళ్లడం కుదరొచ్చు కానీ, రాకరాక వచ్చిన సెలవుని బయటికి వెళ్లి వృధా చేసుకోవడం ఎందుకన్న ఆలోచన కూడా ఉంటుంది. అందుకే సెలవు రోజున ఇల్లంతా టీవీలో మళ్లీ మళ్లీ వస్తుండే హిట్‌ సినిమాకు (మోస్ట్‌లీ సినిమా) అంటుకుని ఉంటుంది. సోఫాలోనో, కుర్చీల్లోనో ఒకళ్ల మీద ఒకళ్లు పడుతూ సినిమా చూస్తుంటారు. అలా చూస్తున్నప్పుడు ఎవరో కనిపెడతారు.. ‘అరె! ఈ సీన్‌ లేదేమిటి?’ అని! ఆ సీన్‌ ఎందుకులేదో కనిపెట్టినవారు మౌనంగా ఉంటారు. థియేటర్‌లో చూసిన సినిమాల్లోని కొన్ని సీన్‌లు టీవీలో అందరూ కలిసి చూస్తున్నప్పుడు కట్‌ అయి ఉండటానికి కారణం.. ఇళ్లలోకి అలాంటి సీన్‌లు వెళ్ల కూడదని చానల్‌ వాళ్లు అనుకోవడం. 

డిస్నీ పిక్చర్స్‌ కూడా తాజాగా ఇళ్లకు విడుదల చేసిన వెర్షన్‌లోని ‘టాయ్‌ స్టోరీ 2’ చిత్రంలో ఒక ‘బ్లూపర్‌’ని తొలగించింది! ఇరవై ఏళ్ల నాటి ఆ చిత్రంలోని చిన్న ముక్కను డిస్నీ ఇప్పుడు తీసేయడం ఏమిటి? పైగా అది బ్లూపర్‌. సినిమాకు ఏమాత్రం సంబంధం లేనిది. షూటింగ్‌ జరుగుతున్నప్పుడు నవ్వు తెప్పించే తప్పులు కొన్ని జరుగుతుంటాయి. అవే బ్లూపర్స్‌. వాటిని సినిమా చివర్లో క్లోజింగ్‌ క్రెడిట్స్‌తో కలిపి ప్రేక్షకులకు కొసరు సినిమాగా చూపిస్తుంటారు. క్లోజింగ్‌ క్రెడిట్స్‌ అంటే స్క్రీన్‌పై నెమ్మదిగా పైకి జరుగుతూ కనిపించే తారాగణం తరహా వివరాలు. ఆ వివరాల్లోంచి ఆ బ్లూపర్‌ను తొలగించింది డిస్నీ. టాయ్‌ స్టోరీ సిరీస్‌లో ఇప్పటి వరకు నాలుగు చిత్రాలు వచ్చాయి. టాయ్‌ స్టోరీ 4 గత నెలలో రిలీజ్‌ అయింది. మొదటి చిత్రం 1995లో వచ్చింది. రెండోది 1999లో. మూడోది 2010లో. ఈ సిరీస్‌ అన్నీ తయారవుతున్నది ‘పిక్సర్‌ యానిమేషన్‌ స్టూడియోస్‌’లో. డిస్నీ 2006లో పిక్సర్‌ని కొనేసింది. తర్వాత నుంచి టాయ్‌ స్టోరీస్‌ని రెండు సంస్థలూ కలిసే నిర్మిస్తున్నాయి. కంప్యూటర్‌ ఏనిమేటెడ్‌ అడ్వంచర్‌ కామెడీ ఫిల్మ్స్‌ ఇవన్నీ.  

‘పిక్సర్‌’ సంస్థకు ఓ అలవాటు ఉంది. ప్రతి సినిమాకూ కొన్ని బ్లూపర్స్‌ని జత చేస్తుంది. సరదాగా చూస్తారు కదా అని. అలాగే టాయ్‌ స్టోరీ 2 లోనూ ఒక బ్లూపర్‌ని చూపించింది. అయితే అది నిజమైన బ్లూపర్‌ కాదు. కల్పితం. పైగా ‘క్యాస్టింగ్‌ కౌచ్‌’ బ్లూపర్‌. అందులో ఒక ప్రొడ్యూసర్‌.. సినిమాల్లో నటించడానికి వచ్చిన బార్బీ డాల్స్‌లాంటి ఇద్దరు అమ్మాయిలతో.. ‘మీకు టాయ్‌ స్టోరీ 3లో చాన్స్‌ ఇప్పిస్తాను. యాక్టింగ్‌లో టిప్స్‌ కూడా. ఏ క్షణమైనా మీకు అందుబాటులో ఉంటాను సరేనా’ అంటాడు. అంటూ వారిలో ఒక అమ్మాయి చేతిని నిమురుతాడు. అతడి ఉద్దేశం అర్థమై ఆ ఇద్దరూ వెళ్లిపోతారు. ఈ ముక్కనే డిస్నీ ఇప్పుడు కట్‌ చేసింది. ఇంకా అలాంటి ముక్కలు సిరీస్‌లో ఎక్కడైనా ఉన్నాయేమోనని వెతికిస్తోంది. ఇంతగా డిస్నీ జాగ్రత్త పడడానికి కారణం.. అది ఫేక్‌ బ్లూపర్‌ అని కాదు. ‘మీటూ’ ఎఫెక్ట్‌! ఆ బ్లూపర్‌ని సెన్సార్‌ చెయ్యకుండా అలాగే ఉంచేస్తే హాలీవుడ్‌లో ‘క్యాస్టింగ్‌ కౌచ్‌’ (ఇవ్వడం కోసం పొందడం) ఉన్నమాట వాస్తమేనని అంగీకరించినట్లు అవుతుందని డిస్నీ భావించి ఈ నిర్ణయం తీసుకుంది. ఉండటం వేరు. ఉందని అంగీకరించడం వేరు.

రెండేళ్లుగా ‘మీటూ’ ఉద్యమం హాలీవుడ్‌ను వణికిస్తోంది. పెద్ద పెద్ద వాళ్ల స్థానాలు మారిపోయాయి. ఎవరి కారణంగానైతే హాలీవుడ్‌లో ‘మీటూ’ రగులుకుందో ఆ మూవీ మొఘల్‌ హార్వీ వైన్‌స్టీన్‌పై వందకు పైగా కేసులు ఉన్నాయి. కోట్లాది రూపాయలు ధారపోసి ఒక్కో కేసు నుంచి బెయిల్‌ తెచ్చుకుంటున్నారు ఆయన. చేయాల్సిన ప్రాజెక్టులు ఎన్నో ఉండగా చేసేసి ప్రాజెక్టుల్లోకి వెళ్లి చిక్కుకోవడం ఎందుకు అని డిస్నీ కూడా అనుకున్నట్లే ఉంది. అలా కాకున్నా ఆ పర్టిక్యులర్‌ బ్లూపర్‌ని తీసి పడేయడం అన్నది డిస్నీకి తప్పని నిర్ణయం. టాయ్‌ స్టోరీ 2 ని డైరెక్ట్‌ చేసింది జాన్‌ లస్సెటర్‌. ‘పిక్సర్‌ ఏనిమేషన్‌ స్టూడియోస్‌’కి కో–ఫౌండర్‌ కూడా. పిక్సర్‌ని డిస్నీ కలుపుకున్నాక గత ఏడాది చివరి వరకు వాల్ట్‌ డిస్నీ కంపెనీ యానిమేషన్‌ చీఫ్‌గా ఉన్నారు. ఇంకా ఉండేవారే. తన దగ్గర పని చేసే అమ్మాయిలతో ఆయన మిస్‌ బిహేవ్‌ చేశారని ఆరోపణలు వచ్చాయి. పదవి నుంచి తప్పుకోవలసి వచ్చింది. ‘‘నా మనసులో చెడేమీ లేకపోవచ్చు. కానీ అవతలి వాళ్లకు చెడు కనిపించినప్పుడు వాళ్లకు నేను క్షమాపణ చెప్పవలసిందే’ అని నోట్‌ పెట్టి మౌనంగా వెళ్లిపోయారు లస్సెటర్‌.
 
ఈ మధ్య విడుదలైన టాయ్‌ స్టోరీ 4 కూడా వివాదాలకు అతీతంగా ఏమీ లేదు. ఆ సినిమాకు రైటర్‌గా పని చేస్తూ చేస్తూ ‘తాత్విక విభేదాలను’ కారణంగా చూపి మధ్యలోనే క్విట్‌ అయ్యారు రిషీదా జోన్స్‌. అసలు కారణం మాత్రం ఆడవాళ్లకు అవకాశాలు ఇవ్వడంపై వివక్ష. టాయ్‌ స్టోరీ సిరీస్‌.. ‘పిక్సర్‌’కి, ‘డిస్నీ’కి మంచి పేరు తెస్తున్నాయి. పేరు మాత్రమే కాదు. కలెక్షన్‌లూ వస్తున్నాయి. రివ్యూలు సరేసరే. ‘సరిలేరు మీకెవ్వరూ’ అన్నదే ఎప్పుడూ విమర్శకుల మాట. ‘టాయ్‌ స్టోరీ’ సిరీస్‌ అన్నిటిలో.. మనుషులు ఉన్నప్పుడు బొమ్మలన్నీ జీవం లేనట్లుగా నటిస్తుంటాయి. ఆ టాయ్స్‌లా మగవాళ్లు ‘మీటూ’ ఉందని నటించే అవసరం రాకూడదనుకుంటే ఆడవాళ్లను బొమ్మల్లా ట్రీట్‌ చేయడం మానాలి.

మరిన్ని వార్తలు