విహారానికీ బీమా..

11 Apr, 2014 22:38 IST|Sakshi
విహారానికీ బీమా..

వేసవి సెలవులు వచ్చేస్తున్నాయి.. హాయిగా ... సరదాగా చల్లని ప్రదేశాలకు అలా తిరిగి రావాలనుకునే వారు టూర్ ప్లాన్లు సిద్ధం చేసుకుంటున్నారు. విహారయాత్ర  అంటేనే రోజువారీ టెన్షన్లూ.. గొడవలు లేకుండా జాలీగా గడిపేందుకు ఉద్దేశించినది. ఎలాంటి తలనొప్పులు లేకుండా సరదాగా సాగిపోవాలి. ఇందుకోసం ఎన్నెన్నో ప్లాన్లు వేస్తాం. ఎక్కడికెళ్లాలి, అక్కడ ఏమేం ఉంటాయి, ఎక్కడెక్కడ తిరగొచ్చు, ఏం చేయొచ్చు, ఏమేం తీసుకెళ్లాలి, ఎలా వెళ్లాలి లాంటి అనేక విషయాల గురించి బోలెడంత కసరత్తు చేస్తాం. బడ్జెట్ గట్రా లాంటివన్నీ కూడా మన చేతుల్లో ఉన్న అంశాలు కాబట్టి మనం ఎంతైనా ప్లాన్ చేయొచ్చు.
 
కానీ, మన చేతుల్లో లేని వాటి కారణంగా కూడా ఒకోసారి ప్లాన్ అంతా అప్‌సెట్ కావచ్చు. దొంగతనం జరిగినా.. ఆరోగ్యం దెబ్బతిన్నా... ఊరు గాని ఊరులో ఏం చేయాలో అర్థం కాదు. విహారయాత్రలనే కాకుండా తీర్థయాత్రలు, సాధారణ ప్రయాణాల్లో కూడా ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి. మొన్నటి అమర్‌నాథ్ యాత్ర కావొచ్చు .. నిన్నటి మలేసియా విమాన దుర్ఘటనలాంటివి ఇందుకు నిదర్శనాలు.

శుభమా అంటూ సరదాగా తిరిగొద్దామని బైల్దేరే ముందు ఇలాంటి సమస్యల గురించి ఆలోచించడానికి, కనీసం ప్రస్తావించుకోవడానికి కూడా ఎవరూ ఇష్టపడరు. కానీ, విహారయాత్ర నిజంగానే క్షేమంగా పూర్తి చేసుకుని తిరిగి రావాలంటే.. ఎలాంటి సమస్య ఎదురైనా బైటపడ గలిగేట్లు ముందు జాగ్రత్త తీసుకుంటే మంచిది. ఇందుకోసమే ప్రయాణ బీమా పాలసీలు ఉపయోగపడతాయి. కేవలం వందల రూపాయల ప్రీమియాలతో కొండంత భరోసానిస్తాయి ఈ పాలసీలు.
 
సాధారణంగా.. ఎమర్జెన్సీ వైద్య ఖర్చులు, వైద్యానికి వేరే చోటికి తరలింపు, ప్రమాదవశాత్తు మరణం, శాశ్వత అంగవైకల్యం, లగేజ్ పోగొట్టుకోవడం, దొంగతనాల బారిన పడటం, ఫ్లయిట్ జాప్యం, ఆర్థికంగా అత్యవసర పరిస్థితులకు ట్రావెల్ ఇన్సూరెన్స్ కవరేజీ వర్తిస్తుంది.
 
అత్యవసర వైద్య ఖర్చులు..
 
ప్రయాణంలో అనారోగ్యం పాలైనా .. గాయాల పాలైనా చికిత్స ఖర్చులకు టావెల్ బీమా పనిచేస్తుంది. అవుట్‌పేషంట్‌గా ట్రీట్‌మెంట్ తీసుకున్నా లేదా ఇన్‌పేషంట్‌గా చేరినా, పాలసీలో పేర్కొన్న పరీక్షలు చేయించుకున్నా బీమా కంపెనీయే ఖర్చులు చెల్లిస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో మనం ఉన్న చోట్ల సరైన వైద్య సదుపాయాలు లేకపోతే.. వేరే దగ్గరికి తరలించేందుకు అయ్యే ఖర్చును కూడా చెల్లిస్తుంది. ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో చిక్కుబడిపోయినప్పుడు ఇలాంటిది ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతే కాదు, కంపాషనేట్ విజిట్.. అంటే.. పాలసీదారు వారం రోజులపైగా ఆస్పత్రిలోనే ఉండాల్సి వ చ్చినప్పుడు వారిని చూసుకునేందుకు వెళ్లే కుటుంబ సభ్యుల (ఒకరు) ప్రయాణ ఖర్చులను (రాను, పోను) కూడా బీమా కంపెనీ చెల్లిస్తుంది.
 
ఫ్లయిట్ జాప్యం..


కొన్ని సందర్భాల్లో అనివార్య కారణాల వల్ల ఫ్లయిట్ జాప్యం కావడం, ఫలితంగా మనం వేసుకున్న ప్లాన్ అంతా గందరగోళం అయ్యే పరిస్థితి తలెత్తవచ్చు. ఇలాంటి సందర్భాలకు కూడా బీమా కవరేజీ వర్తిస్తుంది. విమానం బైల్దేరడంలో పన్నెండు గంటలకు మించి జాప్యం జరిగితే .. బీమా కంపెనీ పరిహారం చెల్లిస్తుంది. అలాగే చెక్డ్ ఇన్ బ్యాగేజ్ దొరక్కుండా పోయినా లేదా మన బ్యాగేజ్ మనకు అందుబాటులోకి రావడంలో తీవ్ర జాప్యం వల్ల మెడికేషన్‌కి, దుస్తులకు ఇబ్బందిపడినా ఆ మేరకు పరిహారం లభిస్తుంది.  అంతే కాదు.. విమానం హైజాక్ అయినప్పుడు కూడా పాలసీ అక్కరకొస్తుంది. హైజాక్ ఎన్ని రోజులు కొనసాగితే అన్ని నాళ్లకు రోజుకు ఇంత చొప్పున అలవెన్స్ ఇస్తుంది బీమా కంపెనీ.
 
ఆర్థిక అత్యవసర పరిస్థితి ..
 
ముందే చెప్పుకున్నట్లు ఊరు గాని ఊరులో పర్సునెవరైనా కొట్టేస్తే డబ్బుకు నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ సందర్భాల్లో పాలసీల్లో పేర్కొన్న పరిమితికి లోబడి బీమా కంపెనీ అత్యవసర ఆర్థిక సహాయాన్ని అందజేస్తుంది. ఒకవేళ ఊహించని విధంగా మన తప్పిదం వల్ల ఇతరులెవరైనా గాయపడినా, మరణించినా.. ఆస్తులు ధ్వంసమైనా కూడా థర్డ్ పార్టీకి పరిహారం కూడా చెల్లిస్తుంది.
 
ప్రీమియంలు.. కంపెనీలు..


అత్యంత తక్కువ ప్రీమియంలకే అత్యధిక స్థాయిలో కవరేజీ ఇస్తున్నాయి బీమా కంపెనీలు. కొన్ని సంస్థలు ఆన్‌లైన్లో దేశీ ప్రయాణాలకు రూ. 173 నుంచి రూ. 865 స్థాయిలో పాలసీలు అందిస్తున్నాయి. మెడికల్ రీయింబర్స్‌మెంట్‌కి సంబంధించి ఇవి రూ. 20,000 నుంచి రూ. 1 లక్ష దాకా కవరేజీ కల్పిస్తున్నాయి. టాటా ఏఐజీ, నేషనల్ ఇన్సూరెన్స్, బజాజ్ అలయెంజ్, ఐసీఐసీఐ లాంబార్డ్, రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్, హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో తదితర సంస్థలు ఈ తరహా పాలసీలు అందిస్తున్నాయి.
 
 షరా..

 పాలసీ తీసుకునే ముందు ఒకసారి వివిధ సంస్థలవి పోల్చి చూసుకోవాలి. తక్కువ ప్రీమియానికి ఎక్కువ కవరేజీ ఏది ఇస్తోందో తెలుసుకోవాలి. అలాగే, ఏయే అంశాలకు కూడా కవరేజీ వర్తిస్తుంది, వేటికి మినహాయింపులు ఉన్నాయన్నది కూడా తెలుసుకోవాలి. ఈ చిన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలు. జర్నీ హ్యాపీనే..
 
 దేశీ ప్రయాణాల్లో బీమా కవరేజీలు ఇలా..

మరిన్ని వార్తలు