బాబుకు తరచూ విరేచనాలు... తగ్గేదెలా? 

29 Mar, 2019 02:09 IST|Sakshi

పీడియాట్రిక్‌ కౌన్సెలింగ్‌

మా బాబుకు రెండేళ్లు. రెండు నెలల క్రితం వాడికి చాలా ఎక్కువగా విరేచనాలు అయ్యాయి. అప్పుడు హాస్పిటల్‌లో కూడా అడ్మిట్‌ చేయాల్సి వచ్చింది. అప్పట్నుంచీ తరచూ విరేచనాలు అవుతున్నాయి. మందులు వాడినప్పుడు కొద్దిగా తగ్గి, వెంటనే మళ్లీ పెరుగుతున్నాయి. ఎందుకిలా జరుగుతోంది? 

మీరు వివరించిన లక్షణాలను బట్టి మీ అబ్బాయికి దీర్ఘకాలిక (క్రానిక్‌) డయేరియా ఉన్నట్లు చెప్పవచ్చు. ఇలా విరేచనాలు రెండు వారాలకంటే ఎక్కువగా కొనసాగితే వాటిని దీర్ఘకాలిక డయేరియాగా పరిగణించవచ్చు. దీర్ఘకాలిక డయేరియాకు మన పరిసరాలను బట్టి ఇన్ఫెక్షన్స్‌ ప్రధాన కారణం. వైరల్, బ్యాక్టీరియల్, పోస్ట్‌ ఇన్ఫెక్షియస్, ట్రాపికల్‌ స్ప్రూ వంటివి ఇన్ఫెక్షన్స్‌ కారణమవుతాయి. ఈ అంశాలతోపాటు ఎంజైమ్స్, ఆహారం అరుగుదలలో మార్పులు... అందులోనూ మరీ ముఖ్యంగా చక్కెర పదార్థాలు, ప్రోటీన్ల అరుగుదలలో మార్పులు కూడా ఇందుకు కారణాలు  కావచ్చు. వాటితో పాటు ఇమ్యూనలాజికల్, అలర్జిక్‌ వంటి అంశాలు కూడా విరేచనాలకు కారణమవుతాయి. అలాగే పేగుల స్వరూపంలో లోపాలు (స్ట్రక్చరల్‌ డిఫెక్ట్స్‌) కూడా కారణం కావచ్చు. పేగుల కదలిక (మొటిలిటీ)లో మార్పులు కూడా విరేచనాలకు దోహదం చేస్తాయి. వీటికి తోడు ఎండోక్రైన్‌ కారణాలనూ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి అనేక కారణాల వల్ల పిల్లలకు దీర్ఘకాలిక విరేచనాలు రావడం జరుగుతుంటుంది. పిల్లల్లో వాళ్ల బరువు / ఎదుగుదల నార్మల్‌గా ఉంటే చాలావరకు తీవ్రమైన (సీరియస్‌) అంశాలు అందుకు కారణం కాకపోవచ్చు. 


అంటే... ఐబీడీ, ఎంజైముల్లో లోపాలు, అనటామికల్‌ లోపాలు, ఇమ్యూనలాజికల్‌ సమస్యల వంటివి అందుకు కారణం అయ్యే అవకాశం పెద్దగా లేదు. ఇక పిల్లలకు దీర్ఘకాలిక విరేచనాలు అవుతున్న సందర్భంలో కంప్లీట్‌ స్టూల్‌ ఎగ్జామినేషన్‌ (క్రానిక్‌ డయేరియా వర్కప్‌), కొన్ని స్పెషల్‌ బ్లడ్‌ ఇన్వెస్టిగేషన్స్, ఎంజైమ్‌ పరీక్షలు, అవసరాన్ని బట్టి ఇంటస్టైనల్‌ బయాప్సీ, మైక్రో బయలాజికల్‌ పరీక్షలు, ఇంటస్టినల్‌ మార్ఫాలజీ పరీక్షలు, ఇమ్యూనలాజికల్‌ పరీక్షలు చేయించడం వల్ల నిర్దిష్టంగా కారణాన్ని తెలుసునే అవకావం ఉంటుంది. మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీ బాబుకు ‘పోస్ట్‌ ఎంటరైటిస్‌’ అనే కండిషన్‌ ఉన్నట్లుగా తెలుస్తోంది. అంటే... ఒక ఇన్ఫెక్షన్‌ వచ్చి తగ్గాక లోపల జరిగిన నష్టం (డ్యామేజీ) వల్ల కొన్ని ఆహారాల పట్ల అతడి కడుపు సెన్సిటివిటీని వృద్ధి చేసుకొని ఉండవచ్చు. దీనివల్ల పదే పదే మోషన్స్‌ అవుతుండవచ్చు.

అయితే మీ బాబు వయసున్న పిల్లల్లో కొన్నిసార్లు రోజుకు 3 నుంచి 6 సార్లు విరేచనాలు కావడం నార్మల్‌గా కూడా జరగవచ్చు. దీన్ని ‘టాడ్లర్స్‌ డయేరియా’ అంటారు. మీ బాబు తీసుకున్న ఆహారం అతడి ఆహారకోశంలో ఉండాల్సిన టైమ్‌ కంటే తక్కువగా ఉండటం (డిక్రీజ్డ్‌ గట్‌ ట్రాన్‌జిట్‌ టైమ్‌) కూడా ఒక కారణం కావచ్చు. పై కండిషన్స్‌ వాటంతట అవే తగ్గిపోతాయి. తీసుకునే ఆహారంలో కొద్దిగా ఫైబర్‌ తగ్గించడం, చక్కెర పదార్థాలను పూర్తిగా మానేయడం ద్వారా గట్‌ఫ్లోరా పూర్తిగా రీప్లేస్‌ చేయడం వల్ల ఈ కండిషన్స్‌ నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇలాంటి పిల్లలకు సరైన ఆహారం ఇవ్వడం, జింక్, ఫోలిక్‌ యాసిడ్‌ సప్లిమెంట్లు, విటమిన్‌–ఏ ఇవ్వడం, ఇన్ఫెక్షన్‌ ఉంటే దానికి తగిన చికిత్స చేయడం వల్ల పై కండిషన్‌లను పూర్తిగా నయం చేయవచ్చు. అప్పటికీ డయేరియా లక్షణాలు తగ్గకుండా ఉంటే ఇతర కారణాలను కనుగొని, వాటికి తగు చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఒకసారి మీ పీడియాట్రీషియన్‌ను సంప్రదించి తగు చికిత్స తీసుకోండి.

మాటిమాటికీ జ్వరం... నయమయ్యేదెలా? 

మా బాబుకు పది నెలలు. వాడికి ఈమధ్య మాటిమాటికీ జ్వరం వస్తోంది. డాక్టర్‌కు చూపిస్తే యూరినరీ ఇన్ఫెక్షన్‌ కారణంగా ఇలా తరచూ జ్వరం వస్తోందంటున్నారు. మాకు ఆందోళనగా ఉంది. తగిన పరిష్కారం చెప్పండి. 

మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీ బాబుకు ‘యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్‌’గా చెప్పవచ్చు. యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్స్‌ నెలల పిల్లల్లోనూ చాలా సాధారణంగా కనిపిస్తుంటాయి. ఏడాది లోపు వయసుండే చిన్నపిల్లల్లో యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్లు మగపిల్లల్లోనే ఎక్కువ. అయితే పిల్లల్లో వయసు పెరిగే కొద్దీ ఈ పరిస్థితి తారుమారై... మగపిల్లల కంటే ఆడపిల్లల్లోనే ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. చిన్నపిల్లల్లో యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్లకు అనేక కారణాలుంటాయి. వయసు, జెండర్,  వ్యాధి నిరోధక శక్తి, మూత్ర కోశ అంతర్గత అవయవ నిర్మాణంలో ఏవైనా తేడాలు, విసర్జన తర్వాత ఎంతో కొంత మూత్రం లోపలే మిగిలిపోవడం (వాయిడింగ్‌ డిస్‌ఫంక్షన్‌), మలబద్దకం, వ్యక్తిగత పరిశుభ్రత సరిగా పాటించకపోవడం వంటివి  యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్లు వచ్చేందుకు కొన్ని కారణాలుగా చెప్పవచ్చు. లక్షణాల ఆధారంగా కొన్నిసార్లు యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్లను నిర్ధారణ చేయడం కాస్త  కష్టమే. ఎందుకంటే ఈ లక్షణాలు నిర్దిష్టంగా ఉండవు. రకరకాలుగా కనిపిస్తూ ఉంటాయి. అంటే... కొన్ని లక్షణాలు సెప్సిస్, గ్యాస్ట్రోఎంటిరైటిస్‌లా కూడా ఉంటాయి.

యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్‌ ఉన్న పిల్లల్లో జ్వరం, త్వరగా చిరాకు పడటం, ఆహారం సరిగా తీసుకోకపోవడం, వాంతులు, నీళ్లవిరేచనాలు, మూత్రవిసర్జనను నియంత్రించుకోలేకపోవడం, మూత్రవిసర్జన సమయంలో నొప్పి, పొత్తికడుపులో నొప్పి, చుక్కలు చుక్కలుగా మూత్రం పడటం వంటి లక్షణాల ఉంటాయి. వాటి సహాయంతో దీన్ని గుర్తించవచ్చు. పిల్లల్లో... మరీ ముఖ్యంగా నెలల పిల్లల్లో యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్‌ను డయాగ్నోజ్‌ చేసినప్పుడు వారిలో మూత్ర కోశ వ్యవస్థ (జెనిటోయూరినరీ సిస్టమ్‌)కు సంబంధించి  ఏదైనా లోపాలు (అబ్‌నార్మాలిటీస్‌) ఉన్నాయేమో పరీక్షించడం తప్పనిసరిగా అవసరం. ఉదాహరణకు ఇలాంటి పిల్లల్లో ఫైమోసిస్, విసైకో యూరేటరీ రిఫ్లక్స్‌ (వీయూఆర్‌), కిడ్నీ అబ్‌నార్మాలిటీస్‌ వంటి సమస్యలు ఉన్నప్పుడు వాళ్లకు యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్స్‌ వచ్చే అవకాశాలు ఎక్కువ. కాబట్టి పిల్లల్లో పదేపదే యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్స్‌ కనిపిస్తే తప్పనిసరిగా కంప్లీట్‌ యూరినరీ ఎగ్జామినేషన్‌ విత్‌ కల్చర్‌ పరీక్ష, అల్ట్రాసౌండ్‌ స్కానింగ్, ఎమ్‌సీయూజీ, మూత్రపిండాల పనితీరు తెలుసుకోడానికి  న్యూక్లియర్‌ స్కాన్‌ వంటి పరీక్షలతో పాటు రీనల్‌ ఫంక్షన్‌ పరీక్షలు తప్పక చేయించాలి.

 పిల్లలకు ఏవైనా అవయవ నిర్మాణపరమైన లోపాలు (అనటామికల్‌ అబ్‌నార్మాలిటీస్‌) ఉన్నట్లు బయటపడితే...  వాటికి అవసరమైన సమయంలో సరైన శస్త్రచికిత్స చేయించాల్సి ఉంటుంది. ఇక ఇన్ఫెక్షన్‌ను తగ్గించడానికి తప్పనిసరిగా యాంటీబయాటిక్స్‌తో చికిత్స చేయడం చాలా ముఖ్యం. అలాగే చిన్నపిల్లలకు యూరినరీ ఇన్ఫెక్షన్స్‌ పదే పదే వస్తున్నప్పుడు... కిడ్నీకి ఇన్ఫెక్షన్‌ (పైలో నెఫ్రైటిస్‌) సోకకుండా నివారించడానికి మూడు నుంచి ఆరు నెలల పాటు తప్పనిసరిగా ప్రొఫిలాక్టిక్‌ యూరినరీ యాంటీబయాటిక్స్‌ వాడాల్సి ఉంటుంది. కొద్దిగా పెద్ద పిల్లల విషయానికి వస్తే వారిలో మలబద్దకం లేకుండా చూడటం, తరచూ మూత్రవిసర్జన చేసేలా చూడటంతో పాటు మంచినీళ్లు, ద్రవపదార్థాలు ఎక్కువగా తాగేలా వారికి అలవాటు చేయడం అవసరం. మీరు పైన పేర్కొన్న విషయాలపై అవగాహన పెంచుకొని, మీ పిల్లల వైద్య నిపుణుడి ఆధ్వర్యంలో తగిన చికిత్స తీసుకోండి.

డా. రమేశ్‌బాబు దాసరి
సీనియర్‌ పీడియాట్రీషియన్,
రోహన్‌ హాస్పిటల్స్, 
విజయనగర్‌ కాలనీ,
హైదరాబాద్‌

మరిన్ని వార్తలు