ముఖమంతా మొటిమలు... తగ్గినచోట మచ్చలు..?

13 Aug, 2013 04:55 IST|Sakshi
ముఖమంతా మొటిమలు... తగ్గినచోట మచ్చలు..?

నా వయసు 19. గత సంవత్సరకాలంగా ముఖం మీద మొటిమలతో బాధపడుతున్నాను. చూడటానికి ఇబ్బందిగా ఉంది. అవి తగ్గినచోట చిన్న చిన్న గుంతలు, మచ్చలు ఏర్పడ్డాయి. ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. ఇవి పూర్తిగా నయమవడానికి ఆయుర్వేద మందులు తెలియజేయప్రార్థన.
 - రమాదేవి, డోర్నకల్

 
 స్త్రీ, పురుషులిద్దరిలోనూ యుక్తవయసులో వచ్చే సాధారణ సమస్య ఇది. దీనిని ఆయుర్వేదంలో ‘తారుణ్యపిడిక లేక యవ్వన పిడిక’ అనే పేరుతో వర్ణించారు.
 
మీరేమీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు వీటిని బలవంతంగా చిదపటానికి ప్రయత్నించవద్దు. నీళ్లు ఎక్కువగా తాగండి. కొవ్వు పదార్థాలు తినడం తగ్గించాలి. విటమిన్ ఏ, సీ, డీ, బీ కాంప్లెక్సులు లభించే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. ఉదాహరణకు మునగాకు, మునగకాడలు, ఆకుకూరలు, నువ్వులు, ఎండుఫలాలు, శాకాహారం మొదలైనవి. కాలానుగుణంగా లభించే తాజాఫలాలు (జామ, దానిమ్మ, బత్తాయి మొదలైనవి) బాగా తినండి. ముఖ శుభ్రతకు సబ్బులకు బదులు సున్నిపిండి లేదా శనగపిండి వాడండి. రోజూ రెండుపూటలా ప్రాణాయామం చెయ్యండి. తగినంత శారీరక వ్యాయామం కూడా అవసరం.
 
 ఔషధం :  గంధకరసాయన (మాత్రలు) : ఉదయం - 2, రాత్రి - 2 (పరగడుపున)   
ఆరోగ్యవర్ధని (మాత్రలు) : ఉదయం - 1 రాత్రి - 1 (తిన్న తర్వాత)  మహామంజిష్ఠాదికాఢ, శారిబాద్యాసవ ద్రావకాలను రెండేసి చెంచాలు ఒక కప్పులో కలుపుకొని నాలుగు చెంచాల నీళ్లు కలిపి రెండుపూటలా తాగండి.
 
 కుంకుమాదిలేపం (పైపూతకు) : రాత్రివేళ పైపూతగా పూసుకోవాలి.
 
 సూచన: పింపుల్స్ పగిలి దురదగా అనిపిస్తే, అక్కడ గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసి, అనంతరం తులసి ఆకురసంలో కొంచెం పసుపు కలిపి, పైపూతగా పెట్టుకోండి.
 
 
 నా వయసు 23 ఏళ్లు. మూత్రవిసర్జన చేసినప్పుడు చాలా సన్నటిధారతో ఆలస్యంగా వస్తోంది. అంగం మీద చర్మం వెనకకు రావడం లేదు. దయచేసి ఆయుర్వేద మందులు సూచించండి.
 - శ్యాంబాబు, సిద్ధిపేట

 
 ఈ సమస్యని ఆయుర్వేదంలో ‘నిరుత్థ ప్రకశ’ (ఫైమోసిస్)గా అభివర్ణించారు. ఇది మందుల వల్ల తగ్గేది కాదు. మీరు సర్జన్ (శస్త్రకర్మనిపుణుడి)ని సంప్రదించండి. వారు ‘సున్తీ’ ఆపరేషన్ చేస్తారు. ఈ సమస్య శాశ్వతంగా నయమైపోతుంది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
 
 డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి
 అడిషనల్ డెరైక్టర్, ఆయుష్ (రిటైర్డ్),
 సౌభాగ్య ఆయుర్వేద క్లినిక్, హుమయున్ నగర్, హైదరాబాద్

 

మరిన్ని వార్తలు