ఎజెక్షన్‌  ఫ్రాక్షన్‌ అంటే ఏమిటి? 

13 Mar, 2019 01:20 IST|Sakshi

కార్డియాలజీ కౌన్సెలింగ్‌

ఈమధ్య నేను ఒకసారి గుండె పరీక్షలు చేయించుకున్నాను. నా ఎజెక్షన్‌ ఫ్రాక్షన్‌ పర్సెంటేజీ తక్కువగా ఉందని డాక్టర్‌ చెప్పారు. అయితే నేను పూర్తిగా నార్మల్‌గానే ఉన్నట్లు నాకు అనిపిస్తోంది. అంటే... నాలో ఎలాంటి లక్షణాలూ కనిపించడం లేదు. ఇప్పుడు డాక్టర్‌ చెబుతున్నదాన్ని బట్టి నేనేమైనా చికిత్స తీసుకోవాలా? అసలు ఎజెక్షన్‌ ఫ్రాక్షన్‌ అంటే ఏమిటి? 

మన గుండె నిమిషానికి డెబ్బయిరెండుసార్లు కొట్టుకుంటుందన్న విషయం తెలిసిందే కదా. ఇలా కొట్టుకునే ప్రతిసారీ దాని సంకోచ వ్యాకోచాల వల్లనే మన రక్తనాళాల ద్వారా ప్రతి అవయవానికీ రక్తసరఫరా జరుగుతూ ఉంటుంది. అలా రక్తాన్ని సరఫరా చేసే సమయంలో గుండె సామర్థ్యాన్ని తెలియజేసే ఒక రకం కొలమానమే ‘ఎజెక్షన్‌ ప్రాక్షన్‌’. వైద్యపరిభాషలో దీన్నే సంక్షిప్తంగా ‘ఈఎఫ్‌’ అని సూచిస్తుంటారు. గుండె తాను వ్యాకోచించిన సమయంలో తనకు అందిన రక్తంలో ఎంత మొత్తాన్ని తన సంకోచ సమయంలో బయటకు పంపుతుందో... ఆ మొత్తాన్ని ఎజెక్షన్‌ ఫ్రాక్షన్‌ అంటారు. దీన్ని శాతంలో చెబుతారు. వైద్య చికిత్సలో ‘ఈఎఫ్‌’ను తెలుసుకోవడం అన్నది చాలా ప్రాధాన్యం గల అంశమే. అయితే కొన్ని సందర్భాల్లో ఈఎఫ్‌ తెలుసుకోవడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు.

ఈఎఫ్‌ తక్కువగా ఉన్న ప్రతివారిలోనూ హార్ట్‌ ఫెయిల్యూర్‌ రావాలన్న నియమమేమీ లేదు. అయితే ఈఎఫ్‌ తక్కువగా ఉన్నవారిలో పాదాల వాపు, ఆయాసం, ముఖం ఉబ్బడం, మెడనరాలు ఉబ్బడం వంటి కొన్ని లక్షణాలు కనిపిస్తే మాత్రం దాన్ని హార్ట్‌ ఫెయిల్యూర్‌ అవుతున్న సూచనగా పరిగణించాలి. ఇది సంకోచ లోపం లేదా వ్యాకోచ లోపం... ఈ రెండింటిలో దేనివల్లనైనా రావచ్చు. కొందరు పేషెంట్లలో ఈఎఫ్‌లో లోపం ఉండి కూడా లక్షణాలు కనపడకుండా పేషెంట్‌ హాయిగా ఉంటారు. మరికొందరిలో ఈఎఫ్‌ తక్కువగా ఉండి, హార్ట్‌ ఫెయిల్యూర్‌ ఉందని తెలిశాక మందులు వాడుతున్నప్పటికీ వారులో ఒక్కోసారి ప్రాణహాని జరిగే అవకాశం ఉంది. అయితే ఈఎఫ్‌ తక్కువగా ఉందని తెలిసినప్పుడు గుండె సామర్థ్యం పెంచడానికి చికిత్స అందించాల్సి ఉంటుంది. 

ఈఎఫ్‌ తగ్గుతుంటే అందించాల్సిన చికిత్స... 
►ఈఎఫ్‌ విలువ తగ్గుతూ ఉన్నప్పుడు వెంటనే దగ్గర్లోని గుండె నిపుణుడిని వీలైనంత త్వరగా సంప్రదించాలి. 
►ఈ సమస్యను ఇటీవల అందుబాటులోకి వచ్చిన ఏసీఈ ఇన్హిబిటార్స్‌ అనే మందులతో సమర్థంగా చికిత్స చేయవచ్చు. 
►ఈఎఫ్‌ విలువ తక్కువగా ఉన్నప్పటికీ అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నిత్యం క్రమం తప్పకుండా గుండె నిపుణులతో ఫాలోఅప్‌లో ఉంటూ, తగిన చికిత్స తీసుకుంటే... ఈ రోగులు కూడా చాలాకాలం హాయిగా బతికేందుకు అవకాశాలున్నాయి. 

గుండెపోటుకీ... ఛాతీనొప్పికీ తేడా గుర్తించడం ఎలా? 

నా వయసు 47 ఏళ్లు. నాకు తరచూ గ్యాస్‌తో ఛాతీమీద మంట వస్తుంటుంది. ప్రతిసారీ ఇది గ్యాస్‌ నొప్పే కదా అని, అలాంటప్పుడు ఒక యాంటీసిడ్‌ తీసుకొని ఉండిపోతుంటాను. ఇటీవల నాలో ఒక అనుమానం మొదలైంది. ఒకవేళ నాకు గుండెనొప్పి వచ్చినా... దాన్ని కూడా గ్యాస్‌తో వచ్చిన సమస్యగానే భావించి అప్పుడు కూడా ఇలా తేలిగ్గా తీసుకుంటానేమోనని సందేహం వస్తోంది. అదెంతో హానికరం కదా. గుండెనొప్పికీ, గ్యాస్‌తో వచ్చే ఛాతీనొప్పికి ఉన్న తేడాలు చెప్పండి. ఇది నాతో పాలు చాలా మందికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. 

సాధారణంగా చాలామంది గుండెపోటును గ్యాస్‌ సమస్యగానో, కడుపులో/ఛాతీలో మంటగానో, వెన్నునొప్పిగానో, మెడనొప్పిగానో తేలిగ్గా తీసుకుంటుంటారు. వాస్తవానికి మీరు అజీర్తి లేదా గ్యాస్‌ సంబంధిత సమస్యతో బాధపడుతూ... కడుపులోనో లేదా గుండెలోనో మంటగా ఉంటే... ఒక్క యాంటాసిడ్‌ మాత్రతో తగ్గిపోతాయి. మెడ, వెన్ను లేదా ఆ పరిసరాల్లోని ఇతర ప్రాంతాల్లో నొప్పి ఉంటే పెయిన్‌కిల్లర్‌ మాత్ర తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. ఇలా జరిగితే పరవాలేదు. కానీ ఇలా ఒకటి రెండు టాబ్లెట్లు తీసుకున్న తర్వాత కూడా ఉపశమనంగా లేదని మీరు భావిస్తే మాత్రం దాన్ని కచ్చితంగా గుండెనొప్పిగా అనుమానించాల్సిందే. గుండెపోటు వచ్చినప్పుడు ఛాతీ మధ్యలో నొప్పితో పాటు తీవ్రమైన అసౌకర్యం ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఛాతీ మెలిపెడుతున్నట్లుగానూ, ఛాతీపైన బరువు పెట్టినట్లుగా, ఒత్తిడి పడ్డట్లుగా ఉంటుంది.

నొప్పి ఎక్కడినుంచి వస్తోందో బాధితులు గుర్తించలేరు. ఛాతీమొత్తం వ్యాపించినట్లుగా అనిపిస్తుంది. ఈ నొప్పి చాలాసార్లు కండరాలకు సంబంధించిన నొప్పిలా, జీర్ణసంబంధ నొప్పి కూడా ఇలాగే అనిపిస్తూ తికమకపెడుతుంటుంది. రెండింటికీ తేడా ఏమిటంటే... గుండెనొప్పి ఒకసారి వస్తే అది కొనసాగుతూ ఉంటుంది. అందే కండరాలు లేదా జీర్ణకోశ నొప్పులైతే వస్తూపోతూ ఉంటాయి. అందువల్ల గుండెపోటును గ్యాస్‌ సమస్యగా తికమకపడకుండా దాని లక్షణాలు జాగ్రత్తగా పరిశీలించాలి. ఒక్కోసారి నొప్పి ఛాతీలో కాకుండా చంకల నుంచి మెడ, దవడలు, పొట్ట, దంతాల నుంచి కూడా మొదలుకావచ్చు. అసిడిటీ సమస్యలుండే వారిలో ఛాతీలో మంటగా కూడా ఉంటుంది. మనకు వచ్చే నొప్పి అసిడిటీ పెరగడం వల్ల వచ్చిన నొప్పి కాదని తేలితే... అది తప్పక గుండెనొప్పేనని అనుమానించాలి. 

ఒత్తిడి తగ్గించుకొని గుండెను రక్షించుకోవడమెలా? 

నా వయసు 45 ఏళ్లు. ఇటీవల విపరీతమైన ఒత్తిడిలో పనిచేస్తున్నాను. మా జాబ్‌లో టార్గెట్స్‌ రీచ్‌ కావాల్సిన అవసరం కూడా ఉంటోంది. గుండెజబ్బుల నివారణకు ఒత్తిడి తగ్గించుకోవాలన్న సూచన నేను తరచూ చదువుతున్నాను. కానీ మా వృత్తిలో అది సాధ్యం కాదు. మాలాంటి వారికి ఏదైనా ప్రత్యేక నివారణ సూచనలు ఉన్నాయా? దయచేసి చెప్పండి. 
 
మీ వయసు 45 ఏళ్లు అంటున్నారు. మీ వయసులో తీవ్రమైన ఒత్తిడిలో పనిచేయడం అన్నది గుండెజబ్బు రావడానికి దోహదం చేసే అనేక ప్రధానమైన కారణాలలో ఒకటి. మీ ఉద్యోగరీత్యా నెరవేర్చాల్సిన బాధ్యతలు పూర్తి చేస్తూనే... గుండె జబ్బును నివారించడానికి రోజూ నడక, యోగా లాంటివి చేస్తూ ఆహార నియమాలు పాటిస్తూ ఉంటే గుండె జబ్బులు వచ్చే అవకాశాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. మీరు ఉద్యోగం మార్చుకోవడం వీలు పడదు కాబట్టి, దానిలోని ఒత్తిడికి రియాక్ట్‌ అయ్యే విధానాన్ని తగ్గించుకోండి. ధ్యానం (మెడిటేషన్‌) ప్రక్రియ ఒత్తిడిని సమర్థంగా తగ్గిస్తుందని చాలా అధ్యయనాలు పేర్కొంటున్నాయి.

అందుకే ధ్యానం లాంటి రిలాక్సేషన్‌ టెక్నిక్స్‌ అవలంబించండి. ఇక ఆహారం విషయానికి వస్తే తాజా శాకాహారాలు ఎక్కువగా ఉండే సమతుల ఆహారం తీసుకుంటూ ఉండండి. మీరు మాంసాహార ప్రియులైతే కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తగ్గించి, ప్రోటీన్ల కోసం చికెన్, చేపల వంటి మాంసాహారాలపైనే ఆధారపడండి. వేటమాంసం, రెడ్‌ మీట్‌ జోలికి పోవద్దు. ఆహారంలో నూనె, ఉప్పు తగ్గించండి. ఇక మీ జీవనశైలి నైపుణ్యాలలో భాగంగా... మీరు ప్రతిదానికి టెన్షన్‌ పడకుండా చూసుకోవడం జరిగితే... అది మీ వృత్తిలో ఎదగడానికి సహాయపడటంతో పాటు గుండె జబ్బు నివారణకూ దోహదపడుతుంది. 

డాక్టర్‌ సి. రఘు, చీఫ్‌ కార్డియాలజిస్ట్, ఏస్టర్‌ ప్రైమ్‌ హాస్పిటల్,
 అమీర్‌పేట, హైదరాబాద్‌

 

మరిన్ని వార్తలు