గిరికుల  పాఠశాల

2 Nov, 2018 00:02 IST|Sakshi
ఎల్లమ్మ తండాలో గిరిజన మహిళల నుండి మెళకువలు నేర్చుకుంటున్న ఫ్యాషన్‌ డిజైనింగ్‌ విద్యార్థులు  

ఫ్యాషన్‌

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని ఎల్లమ్మ తండా గిరిజన మహిళలు పాఠశాల స్థాయిలో కూడా చదువుకోనప్పటికీ ఫ్యాషన్‌ డిజైనింగ్‌లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు సృజనాత్మక సహకారం అందిస్తున్నారు! వీరు డిజైన్‌ చేస్తున్న లంబాడీల సంప్రదాయ దుస్తులు, బ్యాగులు, సెల్‌ఫోన్‌ ప్యాకెట్లు, చీరలు, జాకెట్లు.. అందమైన కుట్లు, అల్లికలతో  ఆకట్టుకుంటూ దేశ, దేశాలలో విక్రయం అవుతుండటం విశేషం.

ఒక్కరితో మొదలై
ఇరవై ఏళ్ల క్రితం (1998లో) అంగన్‌వాడీ కేంద్రం వద్ద ఆయాగా పని చేస్తుండేది కేతావత్‌ లక్ష్మి. ఖాళీ సమయంలో తమ గిరిజన సంప్రదాయ దుస్తులపై అందమైన ఎంబ్రాయిడరీ కుట్టు పనిని చేస్తూ ఉండేది. అంగన్‌ వాడీ తనిఖీ నిమిత్తం ఓ మాతాశిశు సంక్షేమ శాఖ అధికారి అక్కడికి వచ్చారు. లక్ష్మి చేస్తున్న అందమైన అల్లికలను పరిశీలించారు. అనంతరం ఆయన లక్ష్మితో మాట్లాడి ఆమె ప్రతిభ గురించి చేనేత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. చేనేత చేతివృత్తుల అధికారి సత్యవతి ఎల్లమ్మతండాకు వచ్చి, లక్ష్మి చేస్తున్న ఎంబ్రాయిడరీ వర్క్‌ను చూసి ఈ పనిని మరికొంత మంది కలిసి చేస్తే తమ సంస్థ నుండి ప్రత్యేక తర్ఫీదు ఇస్తామని చెప్పారు. అలా 2000 సంవత్సరంలో పది మంది జట్టుగా ఏర్పడిన గిరిజన మహిళలు సంప్రదాయ కుట్లు, అల్లికలు నేర్చుకున్నారు. వారందరికీ కేతావత్‌ లక్ష్మి కో–ఆర్డి్డనేటర్‌గా వ్యవహరించింది. ఇప్పుడు ఆ తండాలో 200 మందికి పైగా గిరిజన మహిళలు సంప్రదాయ అల్లికలు, కుట్లు నేర్చుకుని పనులను చురుగ్గా చేస్తున్నారు. 

వందకు చేరువై
ఏమాత్రం చదువురాని అంగన్‌వాడీ ఆయా లక్ష్మి ఎల్లమ్మ తండా మహిళలకే కాకుండా బోడకొండ, కొర్రంతండా, లోయపల్లి, అంభోత్‌ తండా గ్రామాల్లో దాదాపు వంద మంది మహిళలకు అల్లికలపై తర్ఫీదు ఇస్తోంది. ప్రభుత్వం ప్రత్యేక భవన సదుపాయం కల్పించింది. వీరి నైపుణ్యం గురించి తెలుసుకున్న రాష్ట్ర గోల్కొండ చేనేత సంస్థ  75 మంది మహిళలకు ప్రత్యేకంగా కుట్టు మిషన్లు అందిస్తోంది. 
ఇక్కడ తయారు చేసిన  వస్తువులకు హైదరాబాద్‌తో పాటు దేశంలోని ఇతర నగరాలలోనూ ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేసింది. అంతేకాకుండా, లక్ష్మి 2006లో ఇరాన్, 2012లో లండన్‌ దేశాలు వెళ్లి అక్కడ తమ బృందం తయారు చేసిన డిజైనింగ్‌ దుస్తులను విక్రయించింది. ఎల్లమ్మ తండా మహిళల హస్తకళా నైపుణ్యం నగరంలోని ఫ్యాషన్‌ డిజైనింగ్‌లో ఉన్నత విద్యార్థులను తండాకు రప్పించేలా చేసింది. హైదరాబాద్‌ నుంచి ప్రతియేటా ఐదారు బృందాలుగా ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సులు చేసే విద్యార్థులు ఎల్లమ్మతండా మహిళల వద్ద డిజైనింగ్‌ మెళకువలు నేర్చుకోవడానికి వస్తున్నారు! నగరంలో వివిధ ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కళాశాలల నుండి విద్యార్థులు తండాకు వచ్చి ఇక్కడి మహిళల సహకారం తీసుకోవడంతో ‘‘మా తండా వాసుల ఎంబ్రాయిడరీ కళ బయటి ప్రపంచానికి తెలియడం, ఆదరణ లభించడం మాకు ఆనందంగా, ఎంతో గర్వంగా ఉంది’ అంటున్నారు తండా మహిళలు. 

భరోసాతో భేషుగ్గా
తండాల మహిళలు చేస్తున్న అల్లికలు, చేతి కుట్ల గురించి  తెలుసుకున్న గోల్కొండ చేనేత సంస్థ రాష్ట్ర డైరెక్టర్‌ శైలజా రామయ్యర్‌ గిరిజన మహిళలతో మాట్లాడి ఢిల్లీ నుండి దారాలు, అల్లికలకు సంబంధించిన మెటీరియల్‌ను అందించారు. 2017 సెప్టెంబర్‌ 17న కేంద్ర చేనేత (చేతివృత్తుల) శాఖ ముఖ్య కార్యదర్శి అనంతకుమార్‌ సింగ్‌  కూడా ఎల్లమ్మతండాకు వచ్చి గిరిజనుల చేతి అల్లికల గురించి తెలుసుకున్నారు. వారికి తగినన్ని సదుపాయాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. 

స్వయంగా  తర్ఫీదు
ఇక్కడి గిరిజన మహిళలు అల్లికలు, డిజైనింగ్‌ పై మాకు ప్రత్యేకంగా తర్పీదు ఇస్తున్నారు. తరగతి గదుల్లో, కంఫ్యూటర్లో విని, చూసి నేర్చుకుంటున్నప్పటికీ, ఈ తండా మహిళలు నేర్పే విద్య మాకెంతో ప్రయోజనకరంగా ఉంది. 
– అమ్రిత,  ‘నిఫ్ట్‌’ విద్యార్థిని, హైటెక్‌ సిటీ  

మెళకువ  నేర్చుకుంటున్నాం
హైదరాబాద్‌ నుండి  ఎల్లమ్మతండాకు వచ్చి అల్లికలు, డిజైనింగ్‌ దుస్తులపై ఎలా చేయాలో తెలుసుకుంటున్నాం. రంగు, రంగుల దారాల మార్పులు చేయడం వంటి మెళకువలు వీళ్లు మాకు నేర్పిస్తున్నారు. మాకు ఇష్టమైన డిజైన్‌లో దుస్తులను అందంగా రూపొందించి చూపుతున్నారు. 
 – జాహీ, ఫైనల్‌ ఇయర్, ‘నిఫ్ట్‌’

ఇక్కడ  ప్రాక్టికల్‌గా చూస్తున్నాం
ఒక్కోసారి ప్రొఫెసర్లు చెప్పిన ఆర్ట్‌ఫామ్‌ అర్ధం కాకపోవచ్చు. ఎందుకంటే కొన్ని సంప్రదాయ కళలను నేరుగా చూస్తే వాటి మూలాలను కూడా మన డిజైన్‌లో పొందుపర్చవచ్చు. ఎల్లమ్మతండాలో మహిళల ద్వారా మేం ఆ కళను నేర్చుకుంటున్నాం. 
– శుభం చేరీషీయా, ‘నిఫ్ట్‌’

మరింత సహకారం అవసరం
మా తండాలో ప్రతి ఇంటిలో మహిళలు దుస్తులపై అందమైన అల్లికలు చేయడంలో నిష్ణాతులు. ఎవరికి వారే సాటి. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి మా కళకు మరింత ప్రోత్సాహం అందించాలి. తండాలో తయారు చేసిన దుస్తులు, వస్తువులకు ఇక్కడి నుండే మార్కెటింగ్‌ కల్పించి, బ్రాండ్‌గా గుర్తించాలి. దీని వల్ల తండా మహిళల ఉపాధి మెరుగుపడుతుంది. దీంతో మరింతమంది ఈ కళను అందుకోవడానికి ఉత్సాహం చూపుతారు.
– కేతావత్‌ లక్ష్మి, ఎల్లమ్మతండా
– యాట మహేష్,  సాక్షి, మంచాల 

మరిన్ని వార్తలు