రంగస్థలానికి ‘మొదలి’ వీడ్కోలు

17 Jan, 2019 01:06 IST|Sakshi

నాటకాన్ని శ్వాసిస్తూ, నాటకం ఔన్నత్యాన్ని స్వప్నిస్తూ ఆ రంగానికి ఏడుపదుల కాలాన్ని అంకి తం చేసిన మహనీయుడు ఆచార్య మొదలి నాగ భూషణశర్మ. కాలేజి రోజుల్లో కన్యాశుల్కంలో మధు రవాణి వేషంతో నటుడిగా నాటక కళాసేవ ఆరం భించి, నాటక దర్శకుడిగా, రచయితగా, అధ్యాపకు డిగా, పరిశోధకుడిగా నాటకానికి బహుముఖీన సేవ లందించారు. తెలుగు నాటకాలే కాదు, విదేశాల్లోని ఉత్తమ నాటకాలను అద్భుత ప్రయోగాలతో ప్రద ర్శించి, తెలుగు ప్రజలకు నాటకవిందు చేశారు. నాటక, గాయక ప్రముఖులపై పుస్తకాలను తీసుకొ చ్చారు. తోలుబొమ్మలాటను జపనీయుల కళ్లకు కట్టారు. తెలుగు డ్రామా అండ్‌ థియేటర్‌ చరిత్రను ఇంగ్లిష్, తెలుగులో రాయాలనే తపనతో కృషిచేస్తున్న తరుణంలో ఆయన కన్నుమూయటం తెలుగు నాటకానికి తీరనిలోటు.

ఆచార్య మొదలి నాగభూషణశర్మ (84) పూర్వీ కులది గుంటూరు జిల్లాలోని బ్రాహ్మణకోడూరు. తండ్రి సుబ్రహ్మణ్యశర్మ ఉద్యోగరీత్యా ఇదే జిల్లాలోని రేపల్లె దగ్గరగల ధూళిపూడిలో స్థిరపడ్డారు. అక్కడే 1935 జూలై 24న నాగభూషణశర్మ జన్మించారు. పాఠశాల దశనుంచే ఆయనకు రంగస్థలంపై అను బం«ధం ఏర్పడింది. విజయవాడ, బందరులో కాలేజి చదివే రోజుల్లో ఆ బంధం మరింత పెరిగింది. ‘మధుర వాణి’గా 50 ప్రదర్శనల్లో నటించారు. ‘భారతి’లో ప్రచురితమైన తొలి నాటకం ‘అన్వేషణ’ రాసిందీ ఆ రోజుల్లోనే. హైదరాబాద్‌లో ఎంఏ, పీహెచ్‌డీ తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇంగ్లిష్‌ అధ్యాపకుడిగా చేరారు. కొంతకాలం తర్వాత అమెరికాలోని ఇల్లినాయ్‌ యూనివర్సిటీలో ఎంఎఫ్‌ఏ (థియేటర్‌) చేశారు. తిరిగి రాగానే ఉస్మానియా యూనివర్సిటీలో ప్రారంభించిన థియేటర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ శాఖకు తొలి అధిపతిగా మొదలిని నియమించారు.

చాట్ల శ్రీరాములు, రాజా రామదాస్‌ వంటి నిష్ణాతులను అధ్యాపకులుగా చేర్చుకుని, నాటకకళ వికాసానికి నాగభూషణ శర్మ శ్రద్ధపెట్టారు. పలు నాటకాలనే కాదు, ఆచార్య ఆత్రేయ నాటకోత్సవాన్ని విజయవంతంగా ప్రదర్శించారు. నాటకరంగ ప్రము ఖులు డీఎస్‌ఎన్‌ మూర్తి, తనికెళ్ల భరణి, తల్లావ ఝుల సుందరం, భిక్షు, భాస్కర్, హవల్కర్, విద్యా సాగర్, జీఎస్‌ ప్రసాద్‌రెడ్డి వంటి ప్రముఖులు ఉస్మా నియా థియేటర్‌ ఆర్ట్స్‌ శాఖ నుంచి పట్టాలు తీసు కున్నవారే. 1988లో సెంట్రల్‌ యూనివర్సిటీలో సరో జినీనాయుడు ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పెర్ఫార్మింగ్‌ ఆర్ట్స్‌ ప్రారంభమైనపుడు శర్మ తొలి డీన్‌గా నియమితుల య్యారు. ఆ స్కూలును కళల వికాసానికి అనువైన దిగా రూపుదిద్దారు శర్మ.

మరోవైపు నాటకరచన, దర్శకత్వం బాధ్యత లను అపూర్వంగా నిర్వహించారు. తెలుగులో 60, 28 ఇంగ్లిష్‌ నాటకాలకు దర్శకత్వం వహించారు. విదేశీ భాషలకు చెందిన అనేక కళాఖండాలను తెలు గులోకి అనువదించి, ప్రదర్శింపజేశారు. వీటిలో ‘రాజా ఈడిపస్‌’, ‘ది విజిట్‌’, ‘మ్యాడ్‌ విమెన్‌ ఆఫ్‌ చల్లియట్‌’, ‘హయవదన’, ‘మృచ్ఛకటిక’ వంటి నాటకాలు ప్రముఖమైనవి. వీటిలోని ప్రయోగాలు అనితరసాధ్యం. హైదరాబాద్‌లోని రసరంజని సంస్థకు అనేక నాటకాలను ప్రదర్శించారు. వీటిలో టంగుటూరి ప్రకాశం పంతులు ఆత్మకథను ‘ప్రజా నాయకుడు ప్రకాశం’ నాటకంగా, తన దర్శకత్వంలో రాష్ట్రమంతా ప్రదర్శించారు. హెన్నిక్‌ ఇబ్సెన్‌ నాటకం ‘డాల్స్‌ హౌస్‌’ తెలుగులో ‘బొమ్మరిల్లు’గా, బెర్టాల్ట్‌ బ్రెచెట్‌ ఇంగ్లిష్‌ నాటకం ‘తెల్లసున్నా’గా శామ్యూల్‌ బకెట్‌ రచన ‘దేవుడయ్యి వస్తాడట’ పేరుతోనూ తన దర్శకత్వంలోనే ప్రదర్శనలకు సిద్ధంగా ఉంచారు.

సాహిత్యం, కళలు, జానపదం, నాటకం, అను వాదాలు, విమర్శలు... ఇలా అన్ని ప్రక్రియల్లోనూ 14 పుస్తకాలు రాశారు. 1975లో రాష్ట్ర సంగీత నాటక అకాడమీ జానపద కళోత్సవాల కోసమని నటరాజ రామకృష్ణతో కలిసి 300 గ్రామాలు తిరిగి 750 మంది కళాకారులను ఆ ఉత్సవంలో పాల్గొనేలా చేశారు. 64 కళారూపాలను ‘ఫోక్‌ పెర్ఫార్మింగ్‌ ఆర్ట్స్‌ ఆఫ్‌ ఆంధ్ర ప్రదేశ్‌’ పుస్తకంగా తీసుకొచ్చారు. తోలుబొమ్మలాట బృందాన్ని జపాన్‌ తీసుకెళ్లి 15 పట్టణాల్లో ప్రదర్శిం పజేశారు. నాటకరంగ సేవలకుగాను నాగభూషణ శర్మ కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారాన్ని, రాష్ట్ర ప్రభుత్వ ఎన్టీఆర్‌ రంగస్థల పురస్కారాన్ని, గతేడాది ‘కళారత్న’ గౌరవాన్ని స్వీకరించారు. ఈనెల 6న తెనాలిలో అజో–విభొ– కందాళం ఫౌండేషన్‌ వారి ప్రతిభా వైజయంతి జీవితకాల సాధన పుర స్కారాన్ని అందుకున్నారు.
(తెనాలిలో మంగళవారం రాత్రి కన్నుమూసిన ‘మొదలి’కి నివాళి)
బి.ఎల్‌.నారాయణ, సాక్షి, తెనాలి
మొబైల్‌ : 95509 30789

మరిన్ని వార్తలు