ఆభరణాల తనిఖీ ఆగమశాస్త్ర బద్ధమేనా?

30 Jun, 2018 21:00 IST|Sakshi

తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఇటీవల టీటీడీ బోర్డు నిర్వాకంపై, చంద్రబాబు ప్రభుత్వ ధార్మిక వ్యతిరేక పాలనపై, తిరుమల ఆలయంలో అవినీతిపై చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన విషయం అందరికీ తెలిసిందే. కృష్ణదేవరాయల కాలం నాటి స్వామివారికి అర్పించిన అమూల్య ఆభరణాలు మాయమైపోయాయని, అత్యంత విలువైన ఆభరణాలను అంతర్జాతీయ వేలం పాటల్లో అమ్మకానికి పెడుతున్నారని సాక్షాత్తూ ఆలయ ప్రధాన అర్చకులే ఆరోపించడం తీవ్రమైన విషయం.

దానికి తక్షణ చర్యగా ఆయనను ప్రధాన అర్చకత్వ బాధ్యతలనుంచి తొలగించి ఆలయ మండలి సభ్యత్వంనుంచి కూడా తీసివేసిన టీడీపీ ప్రభుత్వం, టీటీడీ బోర్డు ఇప్పుడు ఈ తీవ్ర ఆరోపణలపై విచారణను పక్కనబెట్టడానికి ఆగమ శాస్త్రాన్ని సాకుగా తీసుకోవడం దారుణం. శ్రీవేంకటేశ్వరుడి అమూల్య మైన ఆభరణాలను సామాన్య ప్రజానీకానికి చూపిం చడానికి ఆగమ శాస్త్రం అంగీకరించదని టీటీడీ అధికారులూ, సంబంధిత ప్రభుత్వాధికారులు, మంత్రులు కలిసి కట్టుగా చెబుతున్నారు. బోర్డు సభ్యులు ఆభరణాలను నిశితంగా పరిశీలించారని, ఆభరణాలు ఏవీ పోలేదని, అన్నీ ఉన్నాయని నిర్ధారించేశారు. కాబట్టే శ్రీవారి ఆభరణాల చౌర్యంపై ఏ విచారణా అవసరం లేదని చెబుతున్నారు.

ఇంతకన్నా ముఖ్యవిషయం ఏమిటంటే టీటీడీ సభ్యుల అర్హతలు ఏమిటన్నదే. తిరుమల తిరుపతి దేవస్థాన మండలి సభ్యులుగా తమ పార్టీకి సహాయ సహకారాలు అందించిన వారిని ముఖ్యమంత్రి చంద్రబాబు నియమిస్తున్నారు. వీరిలో కొంతమంది నల్లధనం దాచుకుని, పట్టుబడ్డవారు, కొంతమంది కల్లు, సారాయి దుకాణాలను పెట్టుకున్నవారు, కొంతమంది లారీ వ్యాపారాలు చేసేవారు. ఇలాంటి తరహా సభ్యులు వేంకటేశ్వరస్వామి ఆభరణాలను పరిశీలించడానికి ఆగమశాస్త్రం ఒప్పుకుంటుందా? ఈ వ్యాపారులేమైనా విశిష్టమైన దైవభక్తులా? ప్రజలను తప్పుదారి పట్టించకుండా, అన్ని అనుమానాలను నివారించడం కోసం హైకోర్టు న్యాయమూర్తులచే కాకుండా, సీబీఐ ద్వారానే విచారణ చేయడం సముచితంగా ఉంటుంది.



త్రిపురనేని హనుమాన్‌ చౌదరి
కార్ఖానా, సికింద్రాబాద్‌
మొబైల్‌ : 98490 67359 

మరిన్ని వార్తలు