నిజమైన దిక్పాలకులు

25 Sep, 2014 23:26 IST|Sakshi
నిజమైన దిక్పాలకులు

బౌద్ధవాణి

మగధకు చెందిన ఒక ప్రముఖ వ్యాపారి కొడుకు సింగాలకుడు. రోజూ క్రమం తప్పకుండా నగరం వెలుపలగల కోనేటిలో మునిగి తడిబట్టలతో ఒడ్డుకు వచ్చి, దిక్కు దిక్కుకు తిరిగి సాష్టాంగ ప్రణామాలు చేస్తాడు. ఒక రోజున నమస్కరించి కళ్ళు తెరిచే సరికి ఎదురుగా చిరునవ్వుతో బుద్ధుడు కన్పించాడు. భక్తితో బుద్ధునికి నమస్కరించాడు సింగాలకుడు.
 ‘‘సింగాలకా! ఎవరికి నమస్కరిస్తున్నావు?’’ అని అడిగాడు బుద్ధుడు.‘‘భగవాన్! రోజూ ఆరు దిక్కులకు నమస్కరిస్తున్నాను’’ అన్నాడు సింగాలకుడు.
 ‘‘మంచిది సింగాలకా! దిక్కులకు ఎందుకు నమస్కరించాలో తెలుసా?’’
 ‘‘ఆరు దిక్కులకూ ఆరుగురు దిక్పాలకులుంటారో గదా! వారికే నమస్కరిస్తున్నా!’’ అని ఏయే దిక్కుకు ఎవరెవరు అధిపతులో చెప్పాడు సింగాలకుడు.
 బుద్ధుడు నవ్వి...‘‘సింగాలకా! నీవు చెప్పిన వారికంటే గొప్ప దిక్పాలకులున్నారు. తూర్పు దిక్కుకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, దక్షిణ దిక్కుకు మనకు విద్యాబుద్ధులు నేర్పే గురువు, పశ్చిమానికి  భార్యా-బిడ్డలు,  ఉత్తర దిశకు మిత్రులు అధిపతులు. ఉద్యోగులు శ్రామికులు అధోదిశకు, పండితులు ఊర్ధ్వదిశకు ప్రతీకలు కాబట్టి వారికి నమస్కరించు. వీళ్లే నిజమైన దిక్పాలకులు’’ అని చెప్పాడు బుద్ధ భగవాన్. ‘‘అలాగే భగవాన్’’ అని వినయంగా పలికాడు సింగాలకుడు.
 

- బొర్రా గోవర్ధన్
 

మరిన్ని వార్తలు