డిజిటల్‌ డమరుకం

2 Jul, 2020 13:30 IST|Sakshi
మేధా రాజ్, ట్రంప్‌ ప్రత్యర్థి బైడెన్‌కు కొత్త ప్రచార వ్యూహకర్త

నేల మీద యుద్ధం చేసే పరిస్థితి లేదు.
నింగిలో కత్తులు విసురుకోవాల్సిందే.
అమెరికా ఎన్నికలకు కరోనా రాసిన శాసనం!
డొనాల్డ్‌ ట్రంప్‌ కత్తుల రత్తయ్య. 
జో బైడెన్‌.. మర్యాద రామన్న. 
గెలుపెవరిది? నిన్నటి వరకు ఒకే ప్రశ్న.
బైడెన్‌ని మేధా రాజ్‌ గెలిపించగలదా?
ఇప్పుడు ఇదొక్కటే ప్రశ్న. 
బైడెన్‌ టీమ్‌లోకి వచ్చిన డిజిటల్‌ డమరుకం.. మేధా.
ట్రంప్‌ తట్టుకుంటాడా? తట్టాబుట్టా సర్దుకుంటాడా?

నవంబర్‌ 3 న అమెరికా అధ్యక్ష ఎన్నికలు. 
‘‘ఇంక 130 రోజులే. ఒక్క నిముషాన్ని కూడా వృథా కానివ్వడానికి లేదు’’.
ట్రంప్‌ కాదు ఈ మాట అన్నది. జో బైడెన్‌ కూడా కాదు. పోటీ వీళ్లిద్దరి మధ్యే అయినప్పుడు వీళ్లిద్దరూ కాకుండా రోజుల్ని, నిముషాలను ఎవరు లెక్కించారు!
మేధా రాజ్‌ లెక్కించారు. జో బైడెన్‌కు ఎన్నికల డిజిటల్‌ ప్రచారానికి మంగళవారం ఆమె ‘చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌’ అవగానే మొదటి అన్న మాట.. నిముషాన్ని కూడా వృథా కానివ్వకూడదు అని!
ట్రంప్‌ రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి. జో బైడన్‌ డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి. గట్టి పోటీ ఉంది. ట్రంప్‌ నోటికి ఎంతొస్తే అంత. అది నచ్చుతుంది సగటు అమెరికన్‌ పురుషులకు. బైడెన్‌ మర్యాద రామన్న. ఈ మర్యాదన్న తరఫున డిజిటల్‌ ప్రచార సైన్యాన్ని ట్రంప్‌పైకి పంపించి అతడిని ఓడించాలి మేధా రాజ్‌! చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ అంటే అంతే మరి. విజయాన్ని తెచ్చి చేతుల్లో పెట్టాల్సిన పోస్ట్‌. మేధా ఇప్పుడు తన ఆధ్వర్యంలోని ప్రచార డిజిటల్‌ విభాగాలన్నిటినీ సమన్వయం చేసుకుంటూ ట్రంప్‌పై తిరుగుదాడి చెయ్యాలి. బైడెన్‌ అమెరికా అధ్యక్షుడు అయితే ప్రజలకు ఏం చేస్తాడో మేధా చెప్పే పని లేదు. ఉన్న కొద్ది వాయిస్‌తో బైడెనే చెప్పుకుంటాడు. ట్రంప్‌ మళ్లీ అమెరికా అధ్యక్షుడు అయితే అమెరికాను ఏం చేస్తాడో బిగ్గరగా చెప్పించడం మేధా పని. చార్జి తీసుకోగానే ఒక్క నిముషం కూడా వృథా కాకూడదు అని అన్నారంటే మేధా స్పష్టమైన ప్రచార  యుద్ధ వ్యూహంతో ఉన్నారనే.  
∙∙ 

డొనాల్డ్‌ ట్రంప్, జో బైడన్‌ : అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రత్యర్థులు

బైడెన్‌ క్యాంపెయిన్‌లోకి రావడానికి ముందు పీట్‌ బుటీగైగ్‌ క్యాంపులో ఉన్నారు మేధా. గత ఆగస్టు నుంచి ఈ మార్చి వరకు ఎనిమిది నెలలు ఆయన ప్రచార వ్యూహకర్తల్లో ముఖ్యులుగా ఉన్నారు. పీట్‌ అధ్యక్ష అభ్యర్థిగా పోటీ నుంచి తప్పుకుని తను కూడా బైడెన్‌కే మద్దతు ఇవ్వలసిన పరిస్థితి రావడంతో అక్కడున్న మేధాను ఇక్కడికి రప్పించుకున్నారు బైడెన్‌. రావలసిన సమయంలోనే వచ్చారు. గత ఆగస్టులో కరోనా అనే మాట లేదు. ఈ మార్చి నుంచి కరోనా అనే మాట తప్ప వేరేది లేదు. కరోనా లేకుండా ఉంటే నాయకులు నేరుగా ప్రజల్లోకే వెళ్లి బలాలు చూపించుకునేవారు. ఇప్పుడిక డిజిటలే డమరుకం. ట్రంప్‌ ఎప్పుడూ శివాలెత్తి ఉంటాడు. అతడి పైకెక్కి ప్రచార తాండవం చేయాలంటే ఇంకో ట్రంప్‌ అయి ఉండాలి. మేధా ఇప్పుడు చేయవలసింది కూడా అదే. ట్రంప్‌కు దీటుగా డిజిటల్‌లో యాంటీ–ట్రంప్‌ను సృష్టించి ఓటర్లను బైడెన్‌ వైపు తిప్పుకోవడం. మేధా.. బైడన్‌ టీమ్‌లోకి వచ్చేనాటికి బైడెన్‌ గెలిచే అవకాశాలు 8 శాతం ఉన్నాయి. ఆ శాతాన్ని ఇప్పుడు మేధా పెంచుకుంటూ పోవాలి. ప్రజల నుంచి ప్రచార నిధులు సమకూర్చుకుంటూ రావాలి. కష్టపడి పని చేసేవాళ్లకు కష్టమైన పనంటూ ఉండదు. ఎన్నికలు ఇంకా ఏడాది ఉండగనే పీట్‌ బృందంలోని మేధా.. ట్రంప్‌ ఎన్నికల భవిష్యత్‌ పన్నాగాలను పసిగట్టి, వాటిని తిప్పుకొట్టే వర్తమాన ప్రణాళికా రచనలో ఉన్నారు. డిగ్రీలో తను చదివింది ఇంటర్నేషనల్‌ పాలిటిక్స్‌. పీజీలో ఎంబీఎ. జార్జిటౌన్‌ యూనివర్సిటీలో పాలిటిక్స్, స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలో బిజినెస్‌. ఇప్పుడీ ‘పొలిటికల్‌ బిజినెస్‌’లో బైడెన్‌ కు ఆమె ప్రధాన ఆయుధం. 
∙∙ 
లాస్‌ ఏంజెలిస్‌లో ఉంటారు మేధా రాజ్‌. ఇక ముందు ‘వర్చువల్‌’గా అమెరికా అంతటా ఉండాలి. అమెరికన్‌ ఓటర్ల ‘మూడ్‌’ డేటాను అనలైజ్‌ చేస్తుండాలి. ట్రంప్‌తో ముఖాముఖి తలపడేనాటికి బైడెన్‌ ను తలపండిన లీడర్‌ను చేయాలి. వాదనకు ప్రతివాదనగా టిప్స్‌ ఇవ్వడం కూడా ఆమె పనే. అయితే అదేమీ ఆమెకు పెద్ద విషయం కాకపోవచ్చు. ఎం.బి.ఎ. అవగానే స్పెయిన్‌లోని ‘రియల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఎల్‌కానో’ లో రిసెర్చ్‌ ఎనలిస్టుగా చేశారు మేధా. అన్ని రంగాలలోనూ దేశాల స్థితిగతుల్ని మెరుగు పరిచేందుకు అవసరమయ్యే ఆలోచనల్ని మధించే సంస్థ అది. డెలాయిట్‌ కంపెనీలో కన్సల్టెంట్‌గా, ఫ్లిపబుల్‌ ఓఆర్జీలో వ్యూహకర్తల బృంద సభ్యురాలిగా, హయ్యర్‌ గ్రౌండ్‌ ల్యాబ్స్‌ ఇన్వెస్ట్‌మెంట్‌లో టీమ్‌ లీడర్‌గా పని చేశారు. ఇవన్నీ కూడా ఆమె కార్యాచరణ నైపుణ్యాలకు పదును పెట్టినవే. కొన్నాళ్లు లాస్‌ ఏంజెలిస్‌ మేయర్‌ ఎరిక్‌ గార్సెటీ కార్యాలయంలోని నగర పౌరుల సదుపాయాల పర్యవేక్షణ విభాగంలో పని చేశారు. 2018 లో కాలిఫోర్నియా గవర్నర్‌ అభ్యర్థి గవిన్‌ న్యూసమ్‌కి క్యాంపెయినర్‌గా ఆయన గెలుపునకు తోడ్పడ్డారు. 
∙∙ 

గెలవడం, గెలిపించడం మేధా అలవాటులా కనిపిస్తోంది! రేపు అమెరికా అధ్యక్షుడిగా బైడెన్‌ గెలిస్తే మేధా కూడా ఆయనతోపాటే వైట్‌ హౌస్‌లోకి అడుగుపెట్టే అవకాశాలు లేకపోలేదు! ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో బైడన్‌.. ట్రంప్‌ రద్దు చేసినవన్నీ పునరుద్ధరిస్తానని హామీ ఇచ్చారు. నాలుగేళ్ల క్రితం ట్రంప్‌ అధ్యక్షుడు అయ్యీ కాగానే మొదట ఆయన వైట్‌ హౌస్‌లోని ‘ఉమెన్‌ అండ్‌ గర్ల్స్‌ కౌన్సిల్‌’ను రద్దు చేశారు. మహిళలు, బాలికల సంక్షేమం కోసం అధ్యక్షుడికి సలహాలు ఇచ్చే కౌన్సిల్‌ అది. ‘రిడండెంట్‌’ అనేశారు ట్రంప్‌ ఆ కౌన్సిల్‌ని. ఇప్పటికే ఎక్కువ చేశాం అని! ఆ కౌన్సిల్‌ని ఏర్పాటు చేసింది ఒబామా. ఆయనకు వైస్‌ ప్రెసిడెంట్‌గా ఉండిన బైడెన్‌ ఇప్పుడు ప్రెసిడెంట్‌ అయితే వెంటనే ఆ కౌన్సిల్‌ పునరుద్ధరణ జరుగుతుంది. అందులో అత్యున్నత స్థాయిలో ఐదుగురు సిబ్బంది ఉండే ‘సపోర్ట్‌ స్టాఫ్‌’లో గానీ, సాధారణ స్థాయిలో పది మంది ఉండే ‘ఆఫీస్‌ స్టాఫ్‌’లో గానీ ఒకరిగా ఈ భారతీయ సంతతి యువతికి తగిన పదవే లభించవచ్చు. 

>
మరిన్ని వార్తలు