జీవిత సత్యం

18 Feb, 2018 01:38 IST|Sakshi

జెన్‌ లోకంలో ఓ గురువు ఉండేవారు. ఆయన మహాజ్ఞాని. ఆత్మజ్ఞానం గురించి క్షుణ్ణంగా తెలిసిన వారు. ఆయన పేరు షెన్‌ హాయ్‌. ఓ రాజు ఆయనను వెతుక్కుంటూ వచ్చి, ‘‘నాకు ఓ అంతిమ మాట రాసివ్వండి’’ అని అడిగాడు. ఆ మాట ఎలా ఉండాలంటే జీవిత సత్యాన్ని ప్రతిఫలించేట్టుగా ఉండాలన్నాడు. రాజు చెప్పిందంతా విన్న జ్ఞాని ఓ చిన్న కాగితంలో రాసిచ్చారు.... అదొక చిన్న కవిత. ‘‘తండ్రీ మరణిస్తాడు. కొడుకూ మరణిస్తాడు. ఆ తర్వాత మనవడూ మరణిస్తాడు’’ అది చదివి రాజు ‘‘ఏమిటండీ ఇది... ఇలా రాశారు... అని బాధను వ్యక్తం చేశాడు. అప్పుడు జ్ఞాని ఓ నవ్వు నవ్వారు. నువ్వు అడిగింది జీవిత సత్యాన్ని. ఇది ఎప్పటికీ చెరగిపోని జీవిత సత్యం.

మీ తాత ఎప్పుడో చనిపోయారు. నీ తండ్రీ కొన్నిరోజుల ముందు చనిపోయారు. నువ్వూ ఓ రోజు చనిపోబోతున్నావు. నీ కుమారుడూ ఓరోజు కచ్చితంగా చనిపోతాడు కదా, అందులో దోషం ఏముంది’’ అని అన్నారు. ‘‘పుట్టిన వారందరూ మరణిస్తారు అనేది అందరికీ తెలుసు. కానీ మీవంటి జ్ఞాని ప్రజలకు వరప్రసాదం లాంటి మాట చెప్పకుండా శాపం లాటి అపశకునపు మాటల్ని రాసివ్వడం బాధ కలిగిస్తోంది’’ అన్నాడు రాజు. ‘‘ఇది శాపమా... పెద్ద వరం... శుభశకునం... బాగా ఆలోచించి చూడు. ముందుగా తండ్రి మరణిస్తాడు. ఆ  తర్వాత బిడ్డలు చనిపోతారు. అనంతరం మనవళ్ళు మరణిస్తారు. ఇదేగా ఓ క్రమపద్ధతి. నీ పెద్దలు తమ అంత్యక్రియలను నువ్వు చెయ్యాలనేగా అనుకుంటారు.

నువ్వు మరణించి నీ కొడుకు నీకు అంతిమ సంస్కారాలు చేయడం సహజం. అలాకాకుండా నువ్వుండి నీ కొడుకు మరణించి నువ్వు అతని అంత్యక్రియలు చెయ్యవలసి వస్తే అది ఎలా ఉంటుందో ఆలోచించు. అలా జరిగితే అది శాపం. కానీ నువ్వు మరణించి నీ అంత్యక్రియలు నీ కొడుకు చెయ్యడం అనేది వరం. మరణం అనేది సహజం. అలా అది సహజ పద్ధతిలో జరిగితే అది దైవమిచ్చిన వరమేగా...’’ అన్నాడు జ్ఞాని. జ్ఞాని వివరంగా చెప్పిన మాటలన్నీ విన్న తర్వాత రాజు ఆ కవితను కళ్ళకు అద్దుకుని ఒకటికి రెండుసార్లు చదువుకుని ఆయనకు నమస్కరించి వీడ్కోలు తీసుకున్నాడు.

ప్రపంచంలో పెద్ద విచిత్రమేమిటి... కళ్ళ ఎదుటే ఎందరో మరణిస్తున్నా తాను మాత్రం దీర్ఘకాలం ఉంటానని  మనసు ఊహించడం! మరణానంతరం ఏం జరుగుతుందో అనే భయం అనవసర భ్రమ. మనం పుట్టడానికి మూడు రోజుల ముందు మనకోసం అమ్మ రొమ్ములో పాలు ఉత్పత్తి అయినట్లే మనకంటూ ఓ ప్రత్యేకమైన చోటూ ఎదురు చూస్తూనే ఉంటుంది.

– యామిజాల జగదీశ్‌

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా