సల్లంగ బతుకమ్మ

7 Oct, 2018 00:39 IST|Sakshi

మంగళవారం నుంచి బతుకమ్మ సంబురాలు

తెలంగాణలో కొన్ని పండుగలకు తరతరాల చరిత్ర ఉంది. కొన్ని పండుగలు ప్రజల సంబురాల నుండి పుట్టి, జీవన గమనంలో భాగంగా మారాయి. తెలంగాణ అంతటా గ్రామ గ్రామాల్లో మార్మోగిపోయే సంబరంగా చేసుకునే పండగ బతుకమ్మ పండుగ. ఆటపాటలతో, ఆనందంగా ప్రజలు తమ సంతోషాన్ని ఇతరులతో పంచుకునే ఒక సామాజిక జీవన సంరంభం ఈ పండుగ. బతుకమ్మ అనగానే మనకు ఒక సామాజిక వ్యవస్థగా, సమాజంలో జరిగిన సంఘటనలకు స్పందించి, చైతన్యాన్ని కల్పించే దిశగా పాట రూపంలో, ఆటల రూపంలో సామాజికులు తీర్చిదిద్దుకున్న ఒక అపురూపమైన కళారూపం ఈ బతుకమ్మ. 

వర్షాకాలం చివరి రోజుల్లో తెలంగాణ ప్రాంతమంతా ఎక్కడ చూసినా విరబూసే తంగేడు పూలతో సింగారించుకున్న పల్లెపడుచులా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎక్కడ చూసినా అలుగులు పారే చెరువులూ, నిండుకున్న కుంటలూ, ఆపైన గట్లమీద పూసే వెండిజిలుగుల గునుగుతో పల్లెలు అందాలు సంతరించుకుకుంటాయి. పూరిగుడిసెల మీద, పందిరిమీద, పొదలమీద, పెరట్లోనూ, విరగబూసిన బీరపూలూ, గుమ్మడిపూలు, కట్లపూలు, బంతిపూలతో పసిడి పూసినట్లుగా హరివిల్లులా– కనిపిస్తాయి గ్రామీణ కుటీరాలు. పూరిగుడిసెలకు ఇంత అందం ఎక్కడినుంచి వచ్చింది, ఎవరిచ్చారూ అని ఆలోచిస్తే, మన బతుకమ్మగాక మరెవరు అంటారు కల్మషమెరుగని నైజాం ప్రాంత ప్రజానీకం. పొలం గట్ల మీదకు ఇంద్రధనుస్సు దిగివచ్చిందా అన్నట్లు బతుకమ్మ పూలతో నిండుగా నవ్వుతూ స్వాగతం పలుకుతాయి.మగవారు పూలు కోసుకురావాలి. ఇక ఆ తర్వాత హడావుడి అంతా ఆడవారిదే మరి. తెలంగాణ సంస్కృతికీ, వైభవానికీ ప్రతీకగా నిలిచే ఈ తొమ్మిదిరోజుల పండుగరోజుల్లో భక్తిశ్రద్ధలు అడుగడుగునా కనిపిస్తాయి. మహాలయ పక్ష అమావాస్య రోజు మట్టితో చేసిన బొడ్డెమ్మలను సాగనంపి, ఆ తెల్లవారినుంచి, ప్రతిరోజూ సాయంత్రం అందంగా అలంకరించుకున్న ఆడపడచులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి లయబద్ధంగా ఆడతారు. చివరిరోజున అనగా దుర్గాష్టమి రోజున పెద్దగా పేర్చిన బతుకమ్మను ఇంటిముందు వాకిట్లో, వీధిలో కూడలిలో ఉంచి ఆడపడచులంతా కలిసి సామూహికంగా పాటలు పాడుతూ– లయబద్ధంగా చేతులు కలుపుతూ, అడుగులో అడుగు వేస్తూ, బతుకమ్మ ఆడతారు. ఇక బతుకమ్మ పాటలన్నీ ఎంతో హుషారు గొలిపిస్తాయి. ఆ పాటలు లక్ష్మీదేవి, గౌరమ్మ, పార్వతి, శివుడు, బతుకమ్మ మీదనే ఎక్కువగా ఉంటాయి. ఆడపిల్ల అత్తగారింట్లో ఎలా నడుచుకోవాలో కూడా తెలియజేస్తూ, ఇక తదితర ఆడపిల్లలకు సంబంధించిన విషయాలమీదే ఎక్కువగా ఉంటాయి. జాము రాతిరి దాకా ఆడి చివరకు బతుకమ్మను చెరువులోనో, వాగులోనో నిమజ్జనం చేస్తారు.

ముల్తైదువలు ఒకరికొకరు పసుపు కుంకుమలను ఇచ్చి పుచ్చుకుంటారు. తీపిపదార్థాలు తినిపిస్తారు. ఆ సమయంలో ఊరు ఊరంతా చెరువు గట్టు మీదకు తరలి వచ్చిందా అన్నట్లుగా ఉంటుంది.బతుకమ్మ పండుగ విషయంలో పలుకథలు ప్రచారంలో ఉన్నాయి. చాలా ప్రాచీనమైన కథను చెప్పుకుందాం. శివుని అర్ధాంగి, జగన్మాత పార్వతీదేవి తన పుట్టింటివారు పిలవకున్నా, తండ్రి దక్షుడు చేస్తున్న యజ్ఞానికి వెళ్లి అవమానం పొంది, యాగాగ్నిలో దూకి ఆత్మాహుతి చేసుకుందని, అది చూసి సహించలేని ప్రజలు, భక్తులూ ముక్తకంఠంతో బతుకమ్మ బతుకమ్మ అంటూ హృదయవిదారకంగా విలపిస్తూ భక్తితో పాటలు పాడగా పార్వతీదేవి ప్రత్యక్షమైందనీ, ఆనాటినుండి ప్రజలు బతుకమ్మ పండుగను చేసుకుంటున్నారని ఒక కథ ప్రచారంలో ఉంది. పుట్టినపిల్లలు పురిటిలోనే చనిపోతుంటే వారికి ‘బతుకమ్మ’ అని పేరు పెట్టే ఆచారం ఈనాటికీ తెలంగాణలో ఉంది. బతుకమ్మ అంటూ ఆ జగన్మాత పేరు పెడితే పిల్లలు బతుకుతారన్న గట్టి నమ్మకం ఈనాటికీ తెలంగాణలో ఉంది. 

సిరిలేని సురులతో ఉయ్యాలో
సంతోషమొందిరి ఉయ్యాలో
జగతిపై బతుకమ్మ ఉయ్యాలో
శాశ్వతంబుగ నిలిచె ఉయ్యాలో అంటూ బతుకమ్మ కథలను పాడుతూ ఉండడం కనిపిస్తుంది. బతుకమ్మ పాటలు నేటికీ వింటున్నామంటే అందుకు కారణం జనబాహుళ్యం వీటిని బతికించుకుంటూ రావడమే. 

ప్రకృతిలో పనికిరానిది ఏదీ లేదన్న సందేశం మనకు ఈ పండుగ ద్వారా అందుతుంది. ఈ ఆటపాటల వలన ఆడపిల్లల్లో ఐకమత్యం, అందరితో కలిసి మెలిసి అందరితో కలిసి మెలిసి ఉండాలనే మనస్తత్వం అలవాట్లలో మంచి మార్పు, ఇతరులకు సహాయం చేసే గుణం, ఓర్పు, నేర్పు అలవడతాయి. కులం, వర్గం అనే భేదాలు లేకుండా అందరూ కలిసి మెలిసి ఆడుకునే పాడుకునే ఒక అద్భుతమైన పండుగ ఈ బతుకమ్మ పండుగ. గౌరికి తల తల్లి నీటి మీద తేలే విధంగా వరమిచ్చిందట. గౌరి గౌరమ్మగా, బతుకమ్మగా మారి నీటిమీద తేలేలా సాధించుకుంటుందన్న కథను కూడా చెబుతారు. బతుకమ్మను పేర్చిన స్త్రీలు చివరి రోజున శివుడు మెచ్చిన గంగ గౌరీలను కలిపి చేసిన పసుపు ముద్దను ఒకరికొకరు పంచుకుంటారు. 

ఇంకొక ముఖ్యమైన కథ కూడా ప్రచారంలో ఉంది. ఇది అన్నా చెల్లెళ్లకు సంబంధించినది. చెల్లిని అన్నయ్య ప్రాణప్రదంగా చూసుకుంటుంటే సహించలేని వదినలు ఆమెకు పాలలో విషం కలిపి చంపేసి పాతిపెడతారు. ఆమె అక్కడ తంగేడై మొలుస్తుంది. తమ చెల్లెలిని చంపారన్న కోపంతో, భార్యలను చంపడానికి బయలుదేరిన అన్నలను బతుకమ్మ మీ చెల్లెలిని తంగేడునై పుట్టాను. వదినెల చేత బతుకమ్మను చేయించి ప్రతి ఏటా నన్ను సాగనంపమంటుంది.  అందుకే బతుకమ్మకు తంగేడును శ్రేష్ఠంగా చెబుతారు. మరొక కథ– వేల ఏళ్ల కిందట బతుకమ్మ ఒక సామాన్య రైతుకుటుంబంలో పుట్టింది.పెరిగి పెద్దది కాగానే వివాహం చేశారు. అత్తవారింట్లో అందరి మనసులెరిగి మసలుకుంటుంది. సుమంగళిగా తనువు చాలించాలని గౌరీదేవిని పూజించేది. ఆమె పూజలకు మెచ్చిన గౌరీదేవి బతుకమ్మగా వెలసి స్త్రీల కోర్కెలు తీర్చమంటూ దీవించింది. –చోళరాజైన ధర్మాంగదునికి వందమంది కుమారులు. వారందరూ యుద్ధంలో మరణిస్తారు. చాలాకాలం తర్వాత లక్ష్మీదేవి అనుగ్రహంతో వారికి ఆడపిల్ల కలుగుతుంది. ఆ పిల్లకు బతుకమ్మ అని పేరు పెట్టి పెంచుకుంటారు. ఇలా పలు కథలున్నాయి. స్త్రీలపండుగగా ప్రసిద్ధికెక్కిన బతుకమ్మగా తల్లి వారి కటుంబాన్ని చల్లగా చూస్తుందని గట్టి నమ్మకం.పిల్లాపాపలకు ఆరోగ్యాన్ని, ఆడపిల్లలకు ముత్తయిదువతనాన్ని ఇస్తుందని భావించే బతుకమ్మ– సర్వజనులనూ రక్షించాలని ప్రార్థిద్దాం. 
– డా. పులివర్తి కృష్ణమూర్తి 
 

మరిన్ని వార్తలు