తులసి చెట్టు గొప్పతనం

12 Dec, 2016 15:17 IST|Sakshi
తులసి చెట్టు గొప్పతనం

మీకు తెలుసా?

ఇంటింటా తులసి మొక్కను పెంచడం, పూజించడం హిందూ సంప్రదాయం. తులసి మొక్కల్ని ఒక బృందావనంలా పెంచడం, ఆ తులసి కోట దగ్గర నిత్యం ధూప దీపారాధన స్త్రీలకు సనాతనంగా వస్తున్న విధి. అందులోనూ కార్తిక మాసంలో అది ఇంకా విశేషం. అంత మహత్తరమైన ప్రాధాన్యం తులసికి ఇచ్చారు. తులసీ మాహాత్మ్యం గురించి మన పురాణాలు, ఇతిహాసాలు స్పష్టంగా చెప్పాయి. తులసీ మాహాత్మ్యం గురించి సాక్షాత్తూ వ్యాసమహర్షి, ధర్మరాజుకు ఇలా చెప్పాడు... ‘‘సాక్షాత్తూ బ్రహ్మదేవుడు సైతం తులసి గొప్పదనాన్ని పూర్తిగా వర్ణించలేనన్నాడు. అయితే, ఆయన నారదుడికి చెప్పిన మాట ఏమిటంటే - కార్తిక మాసంలో తులసి పూజ చేసినవారు స్వర్గానికి వెళతారు.

తులసీ దళాలతో కూడిన నీటితో స్నానం చేస్తే, తుదిశ్వాస విడిచాక వైకుంఠానికి చేరుకుంటారు. ఎవరైతే ఒక బృందావనంగా తులసి మొక్కల్ని పెంచుతారో వారికి బ్రహ్మత్వం సిద్ధిస్తుంది. తులసి మొక్క ఉన్న ఇంట్లో నివసించడం, తులసి చెట్టు పెంచడం, తులసి పూసల మాల ధరించడం, తులసి ఆకులు తినడం వల్ల సమస్త పాపాలూ పోతాయి.

యమకింకరులు తులసి చెట్టు సమీపానికి కూడా రారు.‘యన్మూలే సర్వతీర్థాని, యన్మధ్యే సర్వదేవతా, యదగ్రే సర్వ వేదాశ్చ, తులసీమ్ త్వామ్ నమామ్యహమ్’ ‘ఏ చెట్టు మూలంలో అయితే సమస్త తీర్థాలూ ఉన్నాయో, ఏ చెట్టు మధ్యలో అయితే సర్వదేవతలూ వసిస్తున్నారో, ఏ చెట్టు అగ్రభాగంలో సమస్త వేదాలూ ఉన్నాయో - అలాంటి తులసి చెట్టుకు నమస్కరిస్తున్నాను’ అనే మంత్రం చదివితే, అన్ని సమస్యలూ, కష్టాలూ నశిస్తాయి. అకాల మృత్యు భయం ఉండదు.’’అని శాస్త్రవచనం.

- మహతి

మరిన్ని వార్తలు