గజ్జె గల్ఫ్‌మంది!

5 Jan, 2015 22:50 IST|Sakshi
గజ్జె గల్ఫ్‌మంది!

ఎడారి దేశమైన కువైట్‌లో కూచిపూడి ద్వారా భారతీయ సంస్కృతిని ప్రతిష్ఠాపన చేయిస్తున్నారు వేదవల్లి ప్రసాద్. గృహిణిగా ఏడేళ్ల క్రితం కువైట్‌లో అడుగుపెట్టిన వేదవల్లి... నృత్య గురువుగా ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన కూచిపూడి నృత్యోత్సవాలలో పాల్గొనడానికి తన ఇరవై మంది కువైట్ శిష్యబృందాన్ని, వారి తల్లిదండ్రులను వెంటబెట్టుకొచ్చారు. ఆ సందర్భంగా తనను కలిసిన ‘ఫ్యామిలీ’తో ఆమె పంచుకున్న విషయాలు, విశేషాలు.
 
- నిర్మలారెడ్డి, ‘సాక్షి’ ఫీచర్స్ ప్రతినిధి
 
కువైట్ వెళ్లిన మొదట్లో మనవారెవరూ కనిపించక, విసిరేసినట్టు దూర దూరంగా ఉన్న ఇళ్ల మధ్య ఒంటరిగా ఉండాల్సి వచ్చినప్పుడు ఎంతో మానసిక ఒత్తిడికి లోనయ్యారు వేదవల్లి. ‘‘బాబోయ్ ఆ రోజుల్ని అస్సలు ఊహించుకోలేను. నాలుగు నెలల పాటు డిప్రెషన్‌లో ఉండిపోయాను’’ అంటారు వేదవల్లి. ఐదు పదులకు చేరువవుతున్న ఈ కూచిపూడి నృత్యకళాకారిణి స్వస్థలం తెనాలి. కొన్నాళ్లు హైదరాబాద్‌లో ఉన్నారు. అయితే భర్త ఉద్యోగరీత్యా ఏడేళ్ల క్రితం కువైట్ వెళ్లారు. అంతవరకు బాగానే ఉంది కానీ... భర్త ఉద్యోగానికి, కొడుకు స్కూల్‌కి వెళ్లాక వేదవల్లిని భయంకరమైన ఒంటరితనం అలుముకోవడం మొదలైంది!

‘గెట్ టు గెదర్’ మలుపు తిప్పింది

‘‘ఆ దుఃఖం మాటల్లో చెప్పలేను. తెలిసినవారెవరూ లేరు. కొత్త పరిచయాలు పెంచుకోవడానికి అక్కడ ఆడవాళ్లెవరూ బయటకు రారు. చుట్టుపక్కల మన భారతీయులు ఎవరైనా కనిపిస్తే బాగుండు అని రోజూ కిటికీ దగ్గర కూర్చొని బయటకు చూసేదాన్ని. ఒక్కరూ కనిపించేవారు కాదు. రోజూ మా వారితో గొడవ.. మన దేశం వెళ్లిపోదామని. కానీ, చేస్తున్న ఉద్యోగం వదిలి ఎలా వెళ్లడం? నాకు నేనే సర్దిచెప్పుకున్నాను. నాలాగే చాలామంది గృహిణులు అక్కడ ఉన్నారని చాలారోజుల తర్వాత తెలిసింది. ఓసారి ‘ఎంప్లాయీస్ గెట్ టు గెదర్’ అంటే మావారితో కలిసి వెళ్లాను. అక్కడ మన వారిని కొంతమందిని చూశాక ప్రాణం లేచివచ్చినట్లయింది. వారంతా మనదేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందినవారు. అయితే వారి పిల్లల్లో మనదైన సంస్కృతి ఏదో మిస్ అయినట్లు అనిపించింది. ఇంటికి వచ్చాక కూడా కొన్నాళ్ల పాటు అదే విషయం గురించి ఆలోచిస్తూ ఉండిపోయాను. నాకు కూచిపూడి వచ్చు. దీనినే అక్కడి పిల్లలకు పంచగలిగితే... కాలక్షేపమే కాదు, నా విద్య కూడా మెరుగుపడుతుంది. మనదైన సంస్కృతిని కాపాడటానికి ఇదో మంచి అవకాశం అనిపించింది’’ అని చెప్పారు వేదవల్లి.

ఇంటికి కళ వచ్చింది

ఆలోచన వచ్చిందే తడవుగా డ్యాన్స్ క్లాస్ బోర్డ్ పెట్టేశారు వేదవల్లి. పార్టీలో పరిచయమైన నలుగురికి ఆ సంగతి చెప్పారు. ముందు ఒకరు, ఇద్దరు తమ పిల్లలను తీసుకువచ్చారు. సాధారణంగా డ్యాన్స్ క్లాస్ అంటే వారంలో రెండు, మూడు రోజులు ఉంటుంది. కానీ, వేదవల్లి దగ్గర ప్రతి రోజూ క్లాస్ ఉంటుంది. ఒకరిద్దరితో మొదలైన క్లాస్ ఏడాది తిరగక ముందే ఇరవై మంది పిల్లల వరకు చేరుకుంది. ‘‘పిల్లలంతా చాలా ఉత్సాహంగా క్లాసులకు వస్తారు. వారి వెంట వారి తల్లులు కూడా! ఒకరిద్దరు తల్లులు కూడా డ్యాన్స్ క్లాస్‌లో చేరారు. మొదట్లో నిశ్శబ్దంగా నిద్రపోతున్నట్టుగా ఉండే మా ఇల్లు రోజూ సాయంత్రం పిల్లల కాలి అందెలతో  సందడిగా మారిపోయేది’’ అని వేదవల్లి అన్నారు.
 
మంచీచెడు కూడా!

 
క్లాస్‌కు వచ్చే పిల్లలకు, వారి తల్లులకు ఆహారపు అలవాట్లు, వ్యాయామం, ప్రవర్తనలకు సంబంధించి మంచి విషయాలు చెబుతుంటారు వేదవల్లి. ‘‘వాళ్లు కోపం తెచ్చుకుంటారేమో అని కూడా ఆలోచించాను. అయినా మంచి చెబితే తప్పేమిటి? అందుకే వినేంతవరకు వదలను. అంతేకాదు, పండగలు, వేడుకలు అంతా కలిసి చేసుకునేలా ప్లాన్ చేస్తాను’’ అని చెప్పారు వేదవల్లి. ఎక్కడ కూచిపూడి నృత్యోత్సవాలు జరిగినా అక్కడికి తన శిష్యురాళ్లను తీసుకెళతారు ఆవిడ. ‘‘కువైట్‌లో మాతో పాటు కేరళ, బెంగాల్, ఒరిస్సా రాష్ట్రాల వారు ఉన్నారు. ఒకప్పటిలా ఎవరికివారు అన్నట్టు కాకుండా ఇప్పుడు అందరం  మంచి మిత్రులమైపోయాం. ఇంట్లో కూర్చుని ఉండి ఉంటే ఇవన్నీ చేసేదాన్ని కాదు. ఈ ఏడాది హైదరాబాద్ వచ్చి అంతర్జాతీయ కూచిపూడి నృత్య సంబరాల్లో పాల్గొని ప్రదర్శన ఇచ్చిన మా పిల్లలంతా ఎంతో సంతోషించారు. రెండేళ్ళ క్రితం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం’’ అని తెలిపారు వేదవల్లి.  

 ‘‘ఏడేళ్ల క్రితం ఒంటరిని అని బాధపడిన నేను, ఇప్పుడు నా చుట్టూ ఉన్న నాట్యబృందాన్ని చూసి ముచ్చటపడిపోతుంటాను. ఎవరైనా మహిళలు ఒంటరిగా ఉంటే ఊరుకోను. తెలిసింది ఏ చిన్న పనైనా భయపడకుండా ముందు మొదలుపెట్టమని చెబుతుంటాను. ఎంచుకున్న పని ఇచ్చే సంతృప్తి నాకు తెలుసు కాబట్టి, ఆ ఆనందాన్ని నలుగురూ పొందాలని కోరుంటాను’’అని వివరించారు వేదవల్లి.
 ఆలోచనను ఆచరణలో పెట్టడానికి తెలిసిన ఊరే కానక్కర్లేదు. కొత్త ప్రపంచమైనా మనకు అనుకూలంగా మార్చుకునే నేర్పును పెంచుకుంటే చాలు, అనుకున్నది సాధిస్తాం అని నిరూపిస్తున్నారు వేదవల్లి.
 ఫొటోలు: సృజన్ పున్నా
 
 నృత్యం  వ్యక్తిత్వం


 మేం పన్నెండేళ్లుగా కువైట్‌లో ఉంటున్నాం. మా అమ్మాయి సాయిశ్రీ శ్రావ్య నాలుగేళ్లుగా వేదవల్లి గారి దగ్గర నృత్యం నేర్చుకుంటోంది.  నృత్యంతో పాటు వ్యక్తిత్వ వికాస విషయాలూ నేర్పిస్తున్నారు వేదవల్లి.
 - విజయ,
 విజయవాడ (కువైట్)
 
 ఎడారిలో ఒయాసిస్సు

మా అమ్మాయి వర్షికి 12 ఏళ్లు. రెండేళ్లుగా వేదవల్లిగారి దగ్గర నృత్యం నేర్చుకుంటోంది. వేల మంది మధ్య నృత్యాన్ని ప్రదర్శించే అవకాశం మాకు వేదవల్లి ద్వారా లభించింది. ఎడారిలో మాకు దొరికిన ఒయాసిస్ ఆవిడ.
 - స్మిత, బెంగళూర్ (కువైట్)
 
 చదువూ మెరుగైంది

 నేను నైన్త్ క్లాస్ చదువుతున్నాను. వేదవల్లి మేడమ్ దగ్గర మూడేళ్లుగా నృత్యం నేర్చుకుంటున్నాను. డ్యాన్స్‌లోనే కాదు చదువులోనూ బెస్ట్ అయ్యానని మా మమ్మీ డాడీ, టీచర్స్ చెబుతుంటారు. ఆ క్రెడిట్ అంతా మా మేడమ్‌దే.
 - అఖిల, కువైట్
 

whatsapp channel

మరిన్ని వార్తలు