రాధమ్మ అల్లుడు

15 Jan, 2020 02:21 IST|Sakshi

‘నటుడిగా నిరూపించుకోవాలనే ఆకాంక్ష ఉండాలే గాని అవకాశాలు ఏదో రూపంలో పలకరిస్తూనే ఉంటాయి. అది హీరోనా, విలనా.. అనే సందేహాలు పెట్టుకొని ఆగిపోవద్దు’ అంటారు బుల్లితెర నటుడు గోకుల్‌. తమిళ ఇంటి కుర్రాడు తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ‘జీ’ టీవీలో వచ్చే ‘రాధమ్మ కూతురు’లో లీడ్‌ రోల్‌ పోషిస్తున్న గోకుల్‌ మోడలింగ్‌ వైపు వెళ్లి, నటుడిగా ఎదుగుతున్న విధం గురించి ఇలా వివరించాడు...

తమిళంలో విలన్‌
‘పుట్టి పెరిగింది చెన్నైలో. నాన్నగారు ఉమామహేశ్వరన్‌. ఎలక్ట్రిసిటీ బోర్డులో వర్క్‌ చేస్తున్నారు. అమ్మ జయప్రభ గృహిణి. మా బ్రదర్‌ సింగర్, కంపోజర్‌. నేను బి.టెక్‌ పూర్తి చేశాను. కాలేజీ తర్వాత మోడలింగ్‌లో చేరాను. ఆక్కణ్ణుంచే సీరియల్‌లో అవకాశం వస్తే ఈ ఇండస్ట్రీకి వచ్చాను. నా గడ్డం మీసాలు చూసి విలన్‌గా అయితే బాగుంటుందని ఆ క్యారెక్టర్‌ ఇచ్చారు. అలా విలన్‌గా బుల్లితెరకు పరిచయం అయ్యాను. ఆ సమయంలోనే తెలుగు బుల్లితెర నుంచి ‘జ్యోతి’ సీరియల్‌లో లీడ్‌ రోల్‌కి ఆఫర్‌ వచ్చింది.

వెంటపడితే చదివాను..
బి.టెక్‌ అంటే అస్సలు ఇష్టం లేదు. నా చిన్నప్పటి నుంచి ఒకటే కల నటుడిని అవ్వాలని. ఇంట్లో వాళ్లకు ఈ విషయం చెప్పినప్పుడు అందరూ కనీసం డిగ్రీ అయినా ఉండాలన్నారు. చిన్నప్పటి నుంచి ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌ అంటే చాలా ఇష్టం. ఆ విధంగా బిటెక్‌లో ఐటీ  చేశాను. కానీ, జాబ్‌వైపుకు వెళ్లాలనిపించలేదు. ముందు అమ్మనాన్న కాస్త మౌనం వహించారు. కానీ, ఇప్పుడు నాకు వస్తున్న గుర్తింపు, హంగామా చూసి వాళ్లూ సంతోషిస్తుంటారు.  నా గురించి ఎవరైనా గొప్పగా మాట్లాడినప్పుడు గర్వంగా ఫీలవుతారు.  

రాధమ్మ కూతురు
ఇప్పుడు ‘జీ టీవీ’లో వచ్చే రాధమ్మ కూతురులో హీరో క్యారెక్టర్‌ చేస్తున్నాను. దీనికి ముందు జ్యోతి సీరియల్‌లో రీప్లేస్‌ క్యారెక్టర్‌ చేశాను. ఈ సీరియల్‌ పూర్తవుతుండగా రాధమ్మ కూతురు టీమ్‌ నుంచి ఆడిషన్స్‌కు పిలిచారు. ఊళ్లో అప్పులు ఇచ్చి, వడ్డీ వసూలు చేసే బుజ్జమ్మ కొడుకు అరవింద్‌ క్యారెక్టర్‌ నాది. వడ్డీ వసూలుకు అరవింద్‌ను పింపిస్తుంటుంది బుజ్జమ్మ. తోడుగా ఓ ఐదారుగురు రౌడీలు ఉంటారు. అలాంటి సమయంలో ఓ రోజు హీరోయిన్‌ అక్షరను చూస్తాడు అరవింద్‌. అక్షరకు బుజ్జమ్మ అంటే అస్సలు ఇష్టం లేదు. అందుకని, నేను బుజ్జమ్మ కొడుకుగా కాకుండా చిన్నాగా అక్షర ను పరిచయం చేసుకుంటాను. అబద్దం చెప్పి ఫ్రెండ్‌షిప్‌ చేసుకుంటాను. ఒకరోజు నేనే బుజ్జమ్మ కొడుకును అనే విషయం తెలుస్తుంది. దీంతో నా మీద పగ పెంచుకుంటుంది. ఇలా ప్రేమ – పగలతో సీరియల్‌ నడుస్తుంటుంది.

తెలుగు నేర్చుకున్నాను
తెలుగు బుల్లితెరకు వచ్చి ఆరునెలలు అయ్యింది. ఈ ఆరునెలల్లో చాలా నేర్చుకున్నాను. అందరి మాటలు వింటూ, నేను మాట్లాడుతూ తెలుగు నేర్చుకున్నాను. ముందు నెల రోజులయితే చాలా ఇబ్బంది పడ్డాను. ఏ భాషలో నటుడిగా కొనసాగాలనుకుంటున్నామో ఆ భాష నేర్చుకుంటే ముందు కాన్ఫిడెంట్‌ పెరుగుతుంది. ఆ ప్రయత్నంలో విజయం సాధించాను. సినిమా నటుడిని కావాలని ఉంది. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాను.

రెండు సంక్రాంతులు
టీవీ షో కోసం మొన్ననే ఓ సంక్రాంతి వేడుకలో పాల్గొన్నాను. చాలా బాగా ఎంజాయ్‌ చేశాను. పండక్కి చెన్నై వెళుతున్నాను. ఇక్కడ సంక్రాంతి అంటే తమిళ్‌లో పొంగల్‌ అంటారు. భోగి, పొంగల్, మట్టు(కౌ)పొంగల్‌ అని మూడు రోజులూ పండగ చేస్తాం. ఇంట్లో అమ్మ చేసే చక్రపొంగల్‌ అంటే  చాలా చాలా ఇష్టం. ఈ ఏడాది ఒకే పండగను వారం రోజుల్లో రెండు సార్లు జరుపుకోవడం హ్యాపీగా ఉంది.

క్యారెక్టర్‌ని బట్టి.. క్యాస్టూమ్స్‌!
ముందే టీమ్‌ సజేషన్స్‌ ఉంటాయి. ఎలాంటి క్యారెక్టర్‌కు ఎలాంటి క్యాస్టూమ్స్‌ బాగుండాలో డిస్కషన్స్‌ జరుగుతాయి. నా పాత్రకు తగ్గట్టు రెంగ్యులర్‌ పాయింట్‌ షర్ట్‌ లేదా కుర్తా పైజామా కాకుండా జీన్స్‌ ప్యాంట్‌ మీద షార్ట్‌ కుర్తా వేసుకుని ఉంటాను. ఈ గెటప్‌ నాకు బాగా నచ్చింది. చాలా మంది ఇండోవెస్ట్రన్‌ స్టైల్‌ బాగుందంటూ మెచ్చుకుంటూ ఉంటారు.

సంగీతం అంటే ప్రాణం
ఏ కాస్త సమయం దొరికినా మ్యూజిక్‌ వింటుంటాను. చిన్నప్పటి నుంచి ఇండోవెస్ట్రన్‌ మ్యూజిక్‌ని బాగా ఇష్టపడతాను. సినిమాలు కూడా బాగా చూస్తాను. ఒంటరిగానైనా సరే సినిమాలు చూస్తూనే ఉంటాను. రోజూ కంపల్సరీ ఫిట్‌నెస్‌ మీద శ్రద్ధ పెడతాను. అలాగే బైక్‌ మీద లాంగ్‌ డ్రైవ్స్‌కి వెళ్లడం చాలా ఇష్టం. అవకాశాలు వస్తున్నంత కాలం సీరియల్‌ నటుడిగా కొనసాగుతుంటాను. నటనలో మెళకువలు ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలి. ప్రతీసారీ కొత్తగానే భావించి, క్యారెక్టర్‌లో లీనమైనప్పుడే మంచి పేరు వస్తుంది. అలా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని గెలుచుకోవడం చాలా సంతోషంగా ఉంది.
– నిర్మలారెడ్డి

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు