‘పెళ్లెప్పుడు’ అని అడుగుతుంటారు..

4 Sep, 2019 08:42 IST|Sakshi
ప్రణవి

బాలనటిగా సినిమాల్లోకి ఎంటర్‌ అయిన ప్రణవి సీరియల్‌ నటిగా పేరుతెచ్చుకుంటోంది. ‘గంగ మంగ’ సీరియల్‌లో గంగ గా తెలుగింటి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అచ్చతెనుగు అమ్మాయిగా పదోతరగతితోనే ‘బుల్లితెర’ంగేట్రమ్‌ చేసిన ప్రణవి చెబుతున్న ముచ్చట్లివి.

‘‘మాది తాడేపల్లి గూడెం. నాకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్‌ అంటే చాలా ఇష్టం. శాస్త్రీయ నృత్యం కూచిపూడితో పాటు వెస్ట్రన్‌ డ్యాన్స్‌ కూడా నేర్చుకున్నాను. చిన్నప్పుడు ఢీ, ఆట.. ప్రోగ్రామ్‌ల్లోనూ పాల్గొన్నాను. ఆ ఇష్టం వెండితెరకు బాలనటిగా పరిచయం చేసింది. సినిమాల్లో ఉయ్యాల జంపాల, సీరియల్స్‌లో పసుపు కుంకుమ, భార్యామణిలో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా చేశాను. ఎవరేమోహినిలో హీరోయిన్‌గా చేశాను. గంగ మంగ సీరియల్‌కి ఆడిషన్స్‌కి వెళ్లినప్పుడు గంగ పాత్రకు నన్ను ఎంపిక చేశారు. దృశ్యం సినిమాలోని చిన్నపాపకు డబ్బింగ్‌ చెప్పి డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా కూడా మారాను.’’– నిర్మలారెడ్డి

మా అక్కే నా టీచర్‌!
నేనిప్పుడు ఇంటర్మీడియెట్‌ ఫస్టియర్‌ చదువుతున్నాను. బాలనటిగానే ఈ రంగంలోకి వచ్చాను. షూటింగ్స్‌ లేని రోజుల్లో చదువుకుంటాను. మా అక్క డిగ్రీ చేస్తోంది. తనే నా సబ్జెక్ట్స్‌ అన్నీ చెబుతుంటుంది.

అక్కతో...
లొకేషన్‌ ఎట్‌ ఫన్‌!
కాన్సెప్ట్‌ ఏదైనా డైరెక్టర్‌ చెప్పగానే అలా ఒక్కసారి ఊహించుకొని చేసేస్తాను. యూనిట్‌లో అంతా నన్ను మెచ్చుకుంటారు. కాకపోతే ఎక్కడా ఖాళీ ఉండను. లొకేషన్‌ ఎప్పుడూ ఫన్‌గా ఉంటుంది. అల్లరి బాగా చేస్తానని నాకు పేరు(నవ్వుతూ). ఖాళీ దొరికితే లొకేషన్‌లోనే కాసేపు చదువుకోవడం లేదంటే టిక్‌టాక్‌ వీడియోలతో హడావిడి చేస్తుంటాను.

నా ఫ్యామిలీ నా బలం
ఇంట్లో నన్ను ముద్దుగా ‘గంగమ్మ’ అని పిలుస్తుంటారు. నేనీ రంగంలోకి రావడానికి మా నాన్న శ్రీనివాసమూర్తి కారణం. ఏ సన్నివేశంలో ఎలా యాక్ట్‌ చేయాలో చెబుతుంటారు. అమ్మ రత్నవల్లి నా క్యాస్ట్యూమ్స్‌ అన్నీ తనే చూసుకుంటుంది. అక్క నా చదువు చూసుకుంటుంది. బామ్మలు నేను ఎదగాలని కోరుకుంటారు. నా ఫ్యామిలీ నా బలం.   మంచి నటిగా పేరు తెచ్చుకోవాలన్నదే నా ముందున్న కల.

సీరియల్‌లో ఓ దృశ్యం
సీరియల్‌లో గంగ!
‘గంగమంగ సీరియల్‌లో గంగ మొదట్లో ఏమీ తెలియని అమాయకురాలు. ఇప్పుడు మంగ ఆస్తికోసం చేసే కుట్రలను తిప్పి కొడుతుంటుంది. అమ్మమ్మతో చనువుగా ఉంటుంది. ఆమె చెప్పింది వేదంలా పాటిస్తుంది. నిజ జీవితంలోనూ అంతే అమ్మమ్మ, నాన్నమ్మలు చెప్పింది బుద్ధిగా వింటాను. వాళ్లకీ నన్ను నటిగా చూడటమే ఇష్టం. నటిగా బాగా ఎదగాలని కోరుకుంటారు.

స్నేహితులు కలిస్తే!
మా ఫ్రెండ్స్‌ ఇప్పుడు కలిస్తే చాలు నన్ను ‘పెళ్లెప్పుడు’ అని సరదాగా అడుగుతుంటారు. సీరియల్‌లో పెళ్లి సందర్భం సన్నివేశాలు చెప్పి ఆటపట్టిస్తుంటారు. చిన్నదాన్నైనా సీరియల్‌లో పెద్దదానిగా కనిపిస్తుంటాను. అప్పుడు మా అమ్మ కూడా నవ్వుతూ వాళ్లకి సమాధానమిస్తుంది.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా