ఇరవైల్లో ఉన్నారా? ఇది చదవండి....

17 Jul, 2014 00:01 IST|Sakshi
ఇరవైల్లో ఉన్నారా? ఇది చదవండి....

 - చేతన్ భగత్, రచయిత
 
 భవిష్యత్‌లో ఏం కావాలనుకుంటున్నానో ఒక పట్టాన తేల్చుకోలేకపోయేవాడిని. ఇరవై ఏళ్ల వయసులో  ఆలోచనలన్నీ కలగాపులగంగా ఉంటాయి. దేని మీదా మనసు స్థిరంగా నిలవదు. మీరు అలా కాకుండా ఒక నిర్ణయానికి రండి. డాక్టర్ కావచ్చు, యాక్టర్ కావచ్చు, రచయిత కావచ్చు. లక్ష్యం విషయంలో మీకు స్పష్టత ఉంటే, దానికి  చేరువ కావడం కష్టమేమీ కాదు.
 
ఇరవైల్లో ఉన్నవాళ్లు ఆరోగ్యాన్ని, ఫిట్‌నెస్‌ను పెద్దగా పట్టించుకోరు. ఆ వయసులో ఆ  ఆలోచనేదీ రాదు. వయసు పెరుగుతున్న కొద్దీ వాటి విలువ ఏమిటో తెలుస్తుంది. మరి అదేదో ముందే జాగ్రత్త పడితే మంచిది కదా! ఆరోగ్యస్పృహతో ఆరోగ్యకరమైన తిండి తినడానికి ప్రాధాన్యత ఇవ్వండి. ముప్ఫయ్యో ఏట గాని నేను నా  ఆరోగ్యం పై దృష్టి పెట్టలేకపోయాను. మనం ఆరోగ్యంగా ఉంటేనే, మనసు ఆరోగ్యంగా ఉంటుంది. మనసు ఆరోగ్యంగా ఉంటేనే లక్ష్యం సిద్ధిస్తుంది. ఈ సమాజంలో ఏదీ సవ్యంగా జరగడం లేదు. అంతమాత్రాన ఎప్పుడూ కోపంతో మండిపడాల్సిన అవసరం లేదు. ప్రతి చిన్న విషయానికీ కళ్లెర్ర చేసి గుండెల్లో రక్తం వేగాన్ని పెంచుకోవాల్సిన పనిలేదు. మనం ఆగ్రహంగా ఉన్నంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు. కోపానికి దూరంగా జరగండి. ప్రశాంతంగా ఉండండి.
     
ఇరవై సంవత్సరాల వయసులో మనం వాస్తవ ప్రపంచంలోకి అడుగుపెడతాం. చదువులో నిండా మునిగిపోయి స్నేహితులను మరచిపోతాం. అలా ఎప్పుడూ జరగనివ్వకూడదు. ప్రైమరీ స్కూల్ ఫ్రెండ్స్‌తో సహా నిన్న మొన్నటి ఫ్రెండ్స్ వరకు అందరితో టచ్‌లో ఉండండి. స్నేహంలోని మాధుర్యాన్ని అనుభవించండి. కలుసుకొనలేనంత దూరంలో ఉంటే ఫేస్‌బుక్ ద్వారానైనా టచ్‌లో ఉండండి.
     
పెద్దగా మీ దగ్గర డబ్బు ఉండదనే విషయం తెలుసు. అయితే తక్కువ డబ్బుతో కూడా ప్రయాణాలు చేయవచ్చు. ప్రయాణాల ద్వారా మన మానసిక పరిధి విస్తరిస్తుంది. ఒక్కసారి భద్రమైన జీవితం (కంఫర్ట్‌జోన్)నుంచి బయటకు వచ్చి లోకాన్ని చూడండి.
     
పుస్తకాలు చదవడాన్ని మీ జీవన విధానంలో భాగంగా చేసుకోండి. పుస్తకాలు చదవడం వల్ల పరిపూర్ణ జీవితం పరిచయం అవుతుంది. మీ సైన్స్, ఇంజనీరింగ్ సబ్జెక్ట్‌ల నుంచి బయటికి వచ్చి సాహిత్య వీధుల్లో తిరగాడండి.
     
లేటుగా నిద్ర పోవడం వల్ల లేటుగా నిద్ర లేస్తాం. ఇదొక సర్కిల్. కొందరు రాత్రంతా  ఏదో పని చేస్తూ గడుపుతారు. అలాంటి వారి ఆరోగ్యం అంతంత మాత్రమే అని గ్రహించాలి. ‘క్రమశిక్షణతో కూడిన జీవితం’ సౌకర్యంగా, సుఖంగా అనిపించకపోవచ్చు. కానీ అది మన అవసరం... వేళకు నిద్ర, వేళకు లేవడం అనేది క్రమశిక్షణతో కూడిన జీవితంలో భాగం అనే విషయం గ్రహించాలి.
     
{పేమ అనేది ఎంత ముఖ్యం? డబ్బు ఎంత ముఖ్యం? ఈ రెండింట్లో మీకు ఏది ముఖ్యం? దీని గురించి ఆలోచించండి.
     
ఇరవై ఏళ్ల వయసులో మంచి చెడు గురించి పెద్దగా ఆలోచించం. మనకు తెలియకుండానే ఇతరులను మాటలతో గాయపరుస్తుంటాం. మనం ఏం చేస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం?  అనేదాన్ని ఎప్పటికప్పుడు కనిపెట్టుకొని ఉండండి. వేరేవాళ్ల హృదయాలను గాయపరచకండి. దయతో ప్రవర్తించండి. అసంతృప్తిని అవతలకు నెట్టి సంతృప్తిగా జీవించండి.
 
 ‘క్రమశిక్షతో కూడిన జీవితం’ సౌకర్యంగా, సుఖంగా అనిపించవకపోవచ్చు. కానీ అది మన అవసరం. వేళకు నిద్ర, వేళకు లేవడం అనేది క్రమశిక్షణతో కూడిన జీవితంలో భాగం అనే విషయం గ్రహించాలి.

 

మరిన్ని వార్తలు