కరోనా వారియర్స్‌

11 Apr, 2020 10:41 IST|Sakshi

కరోనా వైరస్‌ని అరికట్టడానికి లాక్డౌన్‌ టైమ్‌లో ఎలా ఉండాలి, ఆరోగ్యకార్యక్తలను ఏ విధంగా చూడాలనే అంశాలను పాటలుగా కట్టి ప్రజల్లో అవగాహన కలిగిస్తున్నారు ఈ కవలలు. జమ్మూలో ఇటీవలే పదవ తరగతి పూర్తి చేసిన సాయిబా గుప్త, సయేషా గుప్తలు తాము పాడిన పాటను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. నెటిజన్లను ఆకట్టుకుంటున్న ఈ పాట ద్వారా లాక్డౌన్‌ నిబంధనలకు కట్టుబడి ఉండాలని, సామాజిక దూరాన్ని కొనసాగించాలని ఈ కవలలు కోరుతున్నారు.

టీనేజర్లు పాడిన పాట..
‘ఇస్‌కో భారత్‌సే కైసే భగాయే .. జిందగీ ఓ హమ్‌కో కైసే బచాయే.. కరోనా సే డరోనా..’ అంటూ కలిసి గానం చేసిన ఈ కవలలు ప్రస్తుత లాక్డౌన్‌ రోజులను తమలోని గాన నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటున్నారు. జనంలో అవగాహన కలిగించడానికి ఇప్పటికే ఎంతోమంది రచయితలు, సంగీతకారులు తమ వంతు అవగాహన చేపడుతున్నారు. ఇదే కోవలోకి చేరుతున్న ఈ ఇద్దరు తోబుట్టువులు జమ్మూలోని ప్రెజెంటేషన్‌ కాన్వెంట్‌ స్కూల్లో ఇటీవల పదవతరగతి పూర్తి చేశారు. ‘ప్రస్తుత పరిస్థితిని అర్ధం చేసుకున్నాక కరోనా వైరస్‌ గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి మా వంతు కృషి చేయాలని నిర్ణయించుకున్నాం. ప్రజలు భయపడకూడదు. ప్రభుత్వంతో సహకరించాలి. వైరస్‌ వ్యాప్తిని నివారించడానికి ఆరోగ్య అధికారులు సూచించిన విధంగా అవసరమైన అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి’ అని ఈ ఇద్దరమ్మాయిలు చెబుతున్నారు. ఎటువంటి కారణం లేకుండా తమ ఇళ్ల నుండి బయల్దేరిన వారు తమ ప్రాణాలను మాత్రమే కాకుండా, తమ కుటుంబంలోని వారి ప్రాణాలనూ ప్రమాదంలోకి నెడుతున్నారు’ అంటోంది సయేషా.

మరో సాంగ్‌..
ఈ ఇద్దరు అమ్మాయిల గానానికి ముచ్చటపడిన వారి తల్లిదండ్రులు, ఇద్దరు డాక్టర్ల అంగీకారంతో మరొక పాటను కూడా కంపోజ్‌ చేశారు. ఇటీవల ఆరోగ్య కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై సాయిబా, సయేషాలు కూడా అందోళన వ్యక్తం చేశారు. ‘వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు దేశానికి గొప్ప సేవ చేస్తున్నారు. వారిపై దాడులు జరుగుతుండటం చాలా బాధగానూ, భయానకంగానూ ఉంది’ అంటున్నారు ఈ కవల సోదరీమణులు.

మరిన్ని వార్తలు