లావుగా ఉన్నా హాయిగా ఉండు

10 Dec, 2019 00:36 IST|Sakshi

కొలతల్లో ఉన్న రూపమే ప్రకృతికి సమ్మతమైతే అందరూ అలాగే పుట్టేవారు. మన రూపం మన చేతుల్లో ఉండదు. జన్మతః వచ్చిన శరీరాన్ని క్రమశిక్షణలో ఆరోగ్యవంతంగా ఉంచుకోవడం మన పని. అంతేతప్ప ఒకరు చెప్పిన కొలతల్లో దానిని కుదించాల్సిన పనిలేదు. సన్నగా లేకపోతే సిగ్గు పడాల్సిన అవసరమూ లేదు. ఆ మాటే అంటున్నారు అమేయ, పల్లవి.

‘‘చుట్టాల ఫంక్షన్స్‌కి, ఫ్రెండ్స్‌ గెట్‌ టు గెదర్‌ పార్టీలకి లేదంటే సినిమా, షాపింగ్‌.. ఇలా ఎక్కడికి వెళ్లినా దగ్గరివాళ్ల నుంచి అసలు ముక్కూమొహం తెలియని అపరిచితుల దాకా ఎవరికి కనపడితే వాళ్లు సలహాలిస్తుంటారా?’’ అమేయ ప్రశ్న పూర్తవకముందే ‘‘ఓ భేషుగ్గా ఇస్తారు’’ అంటూ ఠక్కున సమాధానం చెప్పింది పల్లవి. ‘‘మంచినీళ్లు బాగా తాగండి, ఉదయం లేవగానే గోరువెచ్చని నీటిలో తేనె కలుపుకొని తాగండి నెల రోజుల్లో సన్నగా అయిపోతారు. బీరకాయ, సొరకాయ తినండి.. వారంలోగా రివటలా కాకపోతే నన్ను అడగండి.. అంటూ.. అబ్బో ఎన్ని సలహాలో’’ వెటకారమాడింది పల్లవి.

‘‘అంతేనా.. ఇలాంటి డ్రెస్‌లు వేసుకోకు. చీర కట్టుకో.. ఒళ్లు దాస్తుంది. నిలువు డిజైన్లు వేసుకో.. లావుగా కనపడవు.. అలా జుట్టు విరబోసుకోకు. పోనీ వేసుకో మొహం కోలగా కనిపిస్తుంది.. అంటూ జీతంలేని స్టయిలిస్ట్‌లు పుట్టుకురారూ?’’ అంతకన్నా వ్యంగ్యంగా అమేయ. ఫ్యాట్‌ డాట్‌ సో (జ్చ్ట.టౌ?) అనే పోడ్‌కాస్ట్‌ (ఆడియో) షో కోసం వాళ్ల సంభాషణ అలా సాగుతోంది. ఫ్యాట్‌ డాట్‌ సో ఏంటి అంటే.. ఎవరూ కావాలని లావు కారు. అనారోగ్యం, ప్రసవం, తన మీద తాను శ్రద్ధ పెట్టుకునే స్పృహను కల్పించని కుటుంబ వ్యవస్థ... ఇవన్నీ మహిళల ఊబకాయానికి కారణాలే. చూసేవాళ్లకు ఇవన్నీ అనవసరం కదా.

కానీ ఖర్చులేని సలహాలు, సూచనలు ఇస్తూంటారు స్థూలకాయానికి సంబంధించి. మానసిక స్థయిర్యాన్ని దెబ్బతీస్తూనే ఉంటారు. దీన్నే థీమ్‌గా తీసుకొని ‘‘అవును లావే. అయితే ఏంటీ? అంటూ అమ్మాయిలు ఆత్మ విశ్వాసంతో ముందడుగువేసేలా ‘‘ఫ్యాట్‌ డాట్‌ సో?’ షోను నిర్వహిస్తున్నారు ఆ ఇద్దరూ. ఒక్కమాటలో చెప్పాలంటే ‘బాడీ పాజిటివిటీ జర్నీ’ ని ఓ ఉద్యమంలా ప్రారంభించారు. వీళ్లిద్దరూ లావే. అందుకే ఈ షోలో వాళ్ల మీద వాళ్లే జోక్స్,సెటైర్లు వేసుకుంటూ షోను నడిపిస్తుంటారు.

ఆడవాళ్లకు మాత్రమే.. ఫిఫ్టీ డేట్స్‌ ఇన్‌ దిల్లీ
అమేయ, పల్లవి నాథ్‌.. ఢిల్లీలో స్థిరపడ్డ హైదరాబాదీయులు. అమేయకు 37 ఏళ్లు. పల్లవి వయసు నలభై. ఓ మీడియా డెవలప్‌మెంట్‌ స్టార్టప్‌ కోసం అమేయ పనిచేస్తోంది. పల్లవి కార్పొరేట్‌ ఉద్యోగిని. ఇద్దరికీ తెలుసున్న ఓ స్నేహితురాలి ద్వారా ఈ ఇద్దరూ ఒకరికొకరు పరిచయం అయ్యారు. ఆ స్నేహితురాలు ఢిల్లీలో వారం వారం ‘‘ఆడవాళ్లకు మాత్రమే’’ అనే సమావేశం పెట్టేవారు.

అందులో మహిళలకు సంబంధించిన ఆరోగ్య, ఆర్థిక, సామాజిక భద్రత సమస్యలన్నిటినీ చర్చిస్తారు. టీచర్లు, లెక్చరర్లు, థియేటర్‌ ఆర్టిస్టులు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, డాక్టర్లు, లాయర్లు, గృహిణులు కూడా హాజరవుతారు. అలా ఒకసారి ఆ సమావేశంలో పల్లవి.. తను లావుగా ఉండడం మీద మాట్లాడింది.

‘‘నలభై ఏళ్ల ఫాట్‌.. విడాకులు పొందిన సెల్ఫ్‌ ఎంప్లాయ్డ్‌ మహిళను నేను’’ అంటూ పల్లవి తనను తాను పరిచయం చేసుకున్న తీరు, ఆ ఆత్మవిశ్వాసం, వివిధ అంశాల మీద ఆమెకున్న స్పష్టమైన అభిప్రాయాలు అమేయకు నచ్చాయి. సమావేశం అయిపోయాక పల్లవిని పలకరించింది. తన గురించి చెప్పుకుంది. అమేయ బ్లాగు రాసేది. ‘‘50 డేట్స్‌ ఇన్‌ డెల్హీ’’గా ఆ బ్లాగ్‌ చాలా పాపులర్‌. అందులో తను తన ఢిల్లీ జీవితాన్ని, డేటింగ్‌ లైఫ్‌ వంటి వ్యక్తిగత విషయాలను కథనాల రూపంలో రాసేది. ఆ బ్లాగ్‌కు పల్లవి పెద్ద ఫాలోవర్‌. ఆ అమేయే ఈ అమేయ అని తెలిసి సంతోషపడింది. ఇద్దరి మధ్య స్నేహం గట్టిపడింది.

ఫ్యాట్‌ డాట్‌ సో?
అమేయ రాత, తన మాట రెండూ కలిస్తే మంచి షో అవుతుందన్న ఆలోచన వచ్చింది పల్లవికే. ఆ విషయాన్ని అమేయతో పంచుకుంది. వెంటనే ఒప్పేసుకుంది అమేయ. ఆలస్యం చేయకుండా మొదలుపెట్టారు. వాక్చాతుర్యం, సమయస్ఫూర్తి ఇద్దరికీ ఉన్న కామన్‌ లక్షణాలు. తమ నిజజీవితంలోని బాధలు, సమస్యలు, ఇబ్బందులకు వాటిని జోడించి సంభాషించడం.. రికార్డ్‌ చేయడం.. వాటిని వినడం. అంతే.. వాళ్ల మీద వాళ్లకు నమ్మకం కలిగింది. వాళ్లు చేసిన మొదటి రెండు షోలను ‘సునో ఇండియా’పాడ్‌కాస్ట్‌ చానెల్‌ విని.. ముచ్చటపడింది. స్పాన్సర్‌ చేయడానికి ముందుకు వచ్చింది.

ప్రస్తుతం ‘ఫ్యాట్‌ డాట్‌ సో?’ పది ఎపిసోడ్లు రిలీజ్‌ అయ్యాయి. ‘‘అవి విని మా చిన్నప్పటి ఫ్రెండ్స్‌ అందరూ కాల్‌ చేస్తున్నారు. చిన్నప్పుడు ఎంత షైగా ఉండేదానివి... ఆ అమేయవా? అని తనకు, ఓహ్‌.. పల్లవీ.. మీ షో సూపర్‌. ఎంత బాగుంటుందో? మా పిల్లలకూ వినిపిస్తున్నాం. వాళ్ల కాన్ఫిడెన్స్‌ లెవెల్స్‌ ఎంత మెరుగవుతున్నాయో తెలుసా? అమేజింగ్‌ డియర్‌ ’ అంటూ నాకు కాల్స్‌ వస్తున్నాయి’ అని అంటుంది పల్లవి.

‘‘నిజమే. ఈ షో హిట్‌ కావడానికి కారణం.. మేం గొప్పలు చెప్పట్లేదు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నాం. చిన్నప్పుడు నేను చాలా సన్నగా.. అందంగా చురుగ్గా ఉండేదాన్ని. అన్నిట్లో ఫస్ట్‌ వచ్చేదాన్ని అంటూ గొప్పలతో మా సంభాషణ స్టార్ట్‌ కాదు. మా శరీరం.. దానిపట్ల మాకున్న అంగీకారంతోనే సంభాషణ మొదలువుతుంది.. సాగుతుంది.. ముగుస్తుంది. దీనివల్ల స్థూలకాయులే కాదు.. రంగు తక్కువని బాధపడేవాళ్లు, హేళనకు గురయ్యేవాళ్లు, పొట్టి, పొడుగు అనే భేదంతో ఇబ్బంది పడేవాళ్లు... ఇలా దేన్నయినా లోపంగా ఊహించుకునేవాళ్లు, చూసేవాళ్లు  మా మాటల్లో తమను తాము వింటున్నారు. ముందు తమను తాము ప్రేమించుకోవాలి.. గౌరవించుకోవాలి అని గ్రహిస్తున్నారు. బాడీ షేమింగ్‌ చేసిన వాళ్లకు తగు సమాధానమిస్తున్నారు. ఇమ్‌పర్‌ఫెక్షనే పర్‌ఫెక్షన్‌ అని అర్థంచేసుకుంటున్నారు  కాబట్టే మా షో నచ్చుతోంది’’ అంటుంది అమేయ.

ఆడవాళ్ల మీద పెరుగుతున్న హింస, అభద్రత వంటి వాటినీ అంశాలుగా తీసుకొనీ షో చేస్తామని చెప్పారిద్దరూ!
నిజమే.. ప్రపంచంలో ఎవరూ పర్‌ఫెక్ట్‌ కారు.. ఏదీ పర్‌ఫెక్ట్‌గా ఉండదు. అలా ఉండకపోవడమే జీవితం. అందుకే ఆత్మవిశ్వాసం అవసరం. అప్పుడే మనల్ని మనం స్వీకరించుకోగలుతాం. ఆ విశ్వాసమే ఎదుటి వారికి మన మీద గౌరవాన్ని పెంచుతుంది. ఫ్యాట్‌ డాట్‌ సో? చెప్పేదీ అదే!

మరిన్ని వార్తలు