పచ్చడి పచ్చడి చేయండి

23 Mar, 2019 02:14 IST|Sakshi

ఒక్కదాన్ని చితకబాది పచ్చడి చేస్తే...  రుచిగా ఉంటుంది.రెండిటిని కలిపి బాది బాది పచ్చడి చేస్తే... రుచిరుచిగా ఉంటుంది...ఈ రకం కాంబినేషన్‌ పచ్చళ్లు ఆల్రెడీ కలిపి కొడుతున్నాం కాబట్టిదేనితో కలిపినా రుచిగానే ఉంటుంది.కాని వేడి వేడి అన్నంలోకి నేతితో కలిపి తింటే రుచి రెట్టింపవుతుంది.ఇంకెందుకు ఆలస్యం... మీకు నచ్చిన కాంబినేషన్లను పచ్చడి పచ్చడి చేయండి.వేడివేడిగా ముద్దలు ముద్దలు లాగించేయండి.

గోంగూర–పండుమిర్చి
కావలసినవి:  గోంగూర – అర కేజీ; పండు మిర్చి – పావు కేజీ; చింత పండు – 50 గ్రా.; నువ్వుల నూనె – పావు కేజీ; ఉప్పు – తగినంత; మెంతులు – ఒక టేబుల్‌ స్పూను (వేయించి పొడి చేయాలి); ఆవాలు – ఒక టేబుల్‌ స్పూను; ఎండు మిర్చి – 50 గ్రా.; ఇంగువ – రెండు టీ స్పూన్లు

తయారీ:
►గోంగూరను శుభ్రంగా కడిగి, పొడి వస్త్రం మీద తడి పోయేవరకు నీడలో ఆరబెట్టాలి
►పండు మిర్చిని శుభ్రంగా కడిగి, తొడిమలు తీసి పొడి వస్త్రం మీద ఆరబెట్టాక, ముక్కలు చేయాలి
►స్టౌ మీద బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక గోంగూర, చింత పండు వేసి కలపాలి
►బాగా వేగిన తరవాత దింపేసి, చల్లారనివ్వాలి
►మిక్సీలో పండు మిర్చి ముక్కలు, ఉప్పు వేసి కచ్చాపచ్చాగా తిప్పి, బయటకు తీసేయాలి
►చల్లారిన గోంగూర వేసి మెత్తగా చేయాలి
►మిక్సీ పట్టిన గోంగూర, పండు మిర్చి మిశ్రమాన్ని జాడీలోకి తీసుకుని బాగా కలపాలి
►మూడు రోజుల తరవాత, ఈ మిశ్రమాన్ని ఒక పాత్రలోకి తీసుకోవాలి
►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, ఎండు మిర్చి వేసి వేయించాలి
►ఇంగువ జత చేసి కలిపి దింపేయాలి
►చల్లారాక పచ్చడిలో వేసి కలిపి, జాడీలోకి తీసుకోవాలి
►వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి కలుపుకుని తింటే రుచిగా ఉంటుంది. పండుమిర్చి దొరక్కపోతే, పండుమిర్చి పచ్చడిలో కలుపుకోవచ్చు.


కొబ్బరి–కొత్తిమీర
కావలసినవి:  కొబ్బరి ముక్కలు – ఒక కప్పు; కొత్తిమీర తరుగు – అర కప్పు; పచ్చి మిర్చి – 5; ఉప్పు – తగినంత; చింత పండు – కొద్దిగా;

పోపు కోసం:ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – రెండు; నూనె – ఒక టేబుల్‌ స్పూను; పసుపు – పావు టీ స్పూను; ఇంగువ – పావు టీ స్పూను.

తయారీ:  
►స్టౌ మీద బాణలిలో నూనె కాగాక ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండు మిర్చి వేసి వేయించి దింపేయాలి
►కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి వేసి మెత్తగా అయ్యేవరకు తిప్పాలి
►కొత్తిమీర, చింత పండు, ఉప్పు జత చేసి, అన్ని పదార్థాలు బాగా కలిసి మెత్తగా అయ్యేవరకు మిక్సీ పట్టి దింపేయాలి
►పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకుని, వేయించి ఉంచుకున్న పోపును జత చేయాలి
►ఈ పచ్చడి అన్నంలోకి, ఇడ్లీలోకి, దోసెలలోకి రుచిగా ఉంటుంది.

టొమాటో– బీరకాయ
కావలసినవి:  బీరకాయలు – అర కిలో; టొమాటోలు – 4 (పెద్దవి); నూనె – 2 టేబుల్‌ స్పూన్లు; ఎండు మిర్చి – 8; పచ్చి సెనగ పప్పు – 2 టీ స్పూన్లు; మినప్పప్పు – 2 టీ స్పూన్లు; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; వెల్లుల్లి రెబ్బలు – 6; ఉల్లి తరుగు – అర కప్పు; ఉప్పు – తగినంత; పసుపు – కొద్దిగా; పోపు కోసం:
ఎండు మిర్చి – 2 (ముక్కలు చేయాలి); ఆవాలు + జీలకర్ర – ఒక టీ స్పూను; మినప్పప్పు + పచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు; కొత్తిమీర – కొద్దిగా.

తయారీ:
►బీరకాయలను శుభ్రంగా కడిగి, (చెక్కు తీయకుండా) ముక్కలు చేయాలి
►టొమాటోలను శుభ్రంగా కడిగి ముక్కలు చేయాలి
►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, బీరకాయ ముక్కలు వేసి కలపాలి
►కొద్దిగా మగ్గి నీరు బయటకు వచ్చిన తరవాత టొమాటో ముక్కలు జత చేయాలి
►బాగా మగ్గిన తరవాత దింపి పక్కన పెట్టాలి
►అదే బాణలిలో మరి కాస్త నూనె వేసి కాగాక ఎండు మిర్చి, పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి దోరగా వేయించి ఒక ప్లేట్‌లోకి తీసుకుని చల్లారబెట్టాలి
►మిక్సీలో ముందుగా ఎండు మిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా చేయాలి
►పోపు వేసి మరోమారు మిక్సీ పట్టి మెత్తగా అయ్యాక, బీరకాయ, టొమాటో ముక్కల మిశ్రమం, తగినంత ఉప్పు వేసి మెత్తగా అయ్యేలా మిక్సీ పట్టి, ఒక గిన్నెలోకి తీసుకోవాలి
►బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక, ఉల్లి తరుగు వేసి వేయించాలి
►కొద్దిగా వేగిన తరవాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చి సెనగపప్పు, ఎండు మిర్చి వేసి దోరగా వేయించాలి
►చివరగా కరివేపాకు వేసి కలపాలి
►తయారైన పచ్చడి జత చేసి రెండు నిమిషాల పాటు బాగా కలియబెట్టి స్టౌ మీద నుంచి దింపేయాలి
►కొత్తిమీరతో అలంకరించి, వేడివేడి అన్నంలోకి వడ్డించాలి.

వంకాయ–ఉల్లిపాయ
కావలసినవి:  వంకాయలు – పావు కేజీ; ఉల్లిపాయ – 1 (పెద్దది); చింతపండు – కొద్దిగా; పచ్చి మిర్చి – 5; ఉప్పు – తగినంత; పసుపు – పావు టీ స్పూను; ఇంగువ – పావు టీ స్పూను; ఎండు మిర్చి – 10; పచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; నూనె – ఒక టేబుల్‌ స్పూను.

తయారీ:
►వంకాయలను శుభ్రంగా కడిగి పొడవుగా ముక్కలు చేసుకోవాలి
►ఉల్లిపాయలను కూడా ముక్కలు చేసుకోవాలి
►స్టౌ మీద బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక పచ్చి సెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఒక దాని తరవాత ఒకటి వేసి వేయించి ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి
►అదే బాణలిలో మరి కాస్త నూనె వేసి కాగాక వంకాయ ముక్కలు, ఉల్లి తరుగు, పచ్చిమిర్చి, చింతపండు, ఉప్పు వేసి బాగా కలిపి, మూత పెట్టి, మంట బాగా తగ్గించాలి
►ముక్కలు మెత్తబడ్డాక మంట ఆర్పేసి, ముక్కలను ఒక ప్లేట్‌లోకి తీసుకుని చల్లారబెట్టాలి
►వేయించి ఉంచుకున్న పోపును కొద్దిగా పక్కన ఉంచుకుని, మిగతా పోపును మిక్సీలో వేసి మెత్తగా చేయాలి
►చల్లారిన వంకాయ, ఉల్లిపాయ ముక్కల మిశ్రమం జత చేసి మరోమారు మిక్సీ తిప్పి, ఒక గిన్నెలోకి తీసుకోవాలి
►పక్కన ఉంచుకున్న పోపు, పసుపు జత చేసి కలపాలి
►వేడి వేడి అన్నంలోకి రుచిగా ఉంటుంది.

కొబ్బరి – కందిపప్పు
కావలసినవి:  కందిపప్పు – ఒక కప్పు; పచ్చి కొబ్బరి తురుము – ఒక కప్పు; చింతపండు – కొద్దిగా; ఎండు మిర్చి – 12; ఆవాలు – పావు టీ స్పూను; పచ్చి సెనగ పప్పు – పావు టీ స్పూను; మినప్పప్పు – పావు టీ స్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు; జీలకర్ర – అర టీ స్పూను; నూనె – 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత

తయారీ:  
►స్టౌ మీద బాణలి ఉంచి, వేడయ్యాక  కంది పప్పు, జీలకర్ర, ఎండు మిర్చి వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి దింపేయాలి
►చల్లారిన కందిపప్పును మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి
►కొబ్బరి ముక్కలను జత చేసి కొద్దికొద్దిగా నీళ్లు జత చేస్తూ పచ్చడి మెత్తగా వచ్చేవరకు మిక్సీ పట్టాలి
►ఉప్పు, చింతపండు జత చేసి మరోమారు మిక్సీ పట్టి, పచ్చడిని ఒక పాత్రలోకి తీసుకోవాలి
►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు వేసి వేయించాక, కరివేపాకు జత చేసి మరోమారు కలిపి దింపేసి, పచ్చడి పైన వేసి కలపాలి
►వేడి వేడి అన్నంలోకి కమ్మటి నెయ్యి, అప్పడాలు, వడియాలు నంచుకుంటూ తింటే పచ్చడి మరింత రుచిగా ఉంటుంది.

దోసకాయ – చింత కాయ 
కావలసినవి:  దోసకాయలు – పావు కేజీ; చింత కాయలు – 50 గ్రా.; తరిగిన పచ్చి మిర్చి – 10; ఎండు మిర్చి – 10; ఇంగువ – అర టీ స్పూను; పచ్చి సెనగ పప్పు – ఒక టేబుల్‌ స్పూను; మినప్పప్పు – ఒక టేబుల్‌ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; మెంతులు – అర టీ స్పూను; పసుపు – కొద్దిగా; ఉప్పు – తగినంత; నూనె – 2 టేబుల్‌స్పూన్లు; ఉల్లి తరుగు – పావు కప్పు; వెల్లుల్లి రెబ్బలు – 5;

తయారీ:
►దోసకాయ తొక్కు తీసి, సన్నగా ముక్కలు తరగాలి
►చింతకాయలను శుభ్రంగా కడిగి, గింజలు తీసేసి, చిన్నచిన్న ముక్కలు చేయాలి
►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక  తరిగిన పచ్చి మిర్చి వేసి వేయించాలి
►జీల కర్ర, కరివేపాకు జత చేసి వేయించాలి
►మిక్సీలో వెల్లుల్లి రేకలు, చింతకాయలు, వేయించి ఉంచుకున్న పచ్చి మిర్చి మిశ్రమం వేసి, మెత్తగా అయ్యేలా మిక్సీ పట్టాలి
►కొన్ని దోసకాయ ముక్కలు జత చేసి మరోమారు మిక్సీ పట్టాలి
►ఈ మిశ్రమాన్ని మిగిలిన దోసకాయ ముక్కలకు జత చేయాలి
►స్టౌ మీద బాణలిలో నూనె కాగాక ఆవాలు, మినప్పప్పు, పచ్చి సెనగ పప్పు, ఎండు మిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి దోరగా వేయించి తయారుచేసి ఉంచుకున్న పచ్చడి మీద వేసి కలపాలి
►వేడి వేడి అన్నంతో తింటే రుచిగా ఉంటుంది. చింత కాయల బదులు చింతకాయ పచ్చడి కలుపుకో వచ్చు. 

క్యాబేజీ – ఉల్లిపాయ
కావలసినవి:  క్యాబేజీ – పావు కేజీ; ఉల్లి తరుగు – ఒక కప్పు; పచ్చిమిర్చి – 10; ఎండు మిర్చి – 2; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; పచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; ఇంగువ – కొద్దిగా; పసుపు – కొద్దిగా; చింత పండు – తగినంత; ఉప్పు – తగినంత; నూనె – ఒక టేబుల్‌ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు; కొత్తిమీర – కొద్దిగా.

తయారీ:
►క్యాబేజీని సన్నగా తరగాలి
►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక క్యాబేజీ వేసి పచ్చివాసన పోయేవరకు వేయించాలి
►ఉల్లి తరుగు, చింత పండు, పచ్చి మిర్చి, ఉప్పు, పసుపు జత చేసి మూత పెట్టి, కొద్దిసేపు మగ్గిన తరవాత ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి
►అదే బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక ఇంగువ, ఆవాలు, జీలకర్ర, పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఎండు మిర్చి, వరుసగా వేసి వేయించాలి
►మిక్సీలో క్యాబేజీ, ఉల్లి తరుగు మిశ్రమం వేసి మెత్తగా అయ్యేవరకు మిక్సీ పట్టి, ఒక గిన్నెలోకి తీసుకోవాలి
►వేయించి ఉంచుకున్న పోపు జత చేయాలి
►కొత్తిమీరతో అలంకరించాలి
►వేడి వేడి అన్నంలోకి కమ్మటి నేతితో ఈ పచ్చడి కలుపుకుని తింటే రుచిగా ఉంటుంది.

నిమ్మకాయ – కాకరకాయ 
కావలసినవి: కాకరకాయలు – 4 (చక్రాలుగా తరగాలి); నిమ్మ కాయలు – 6 (చిన్న చిన్న ముక్కలు చేయాలి); తరిగిన పచ్చి మిర్చి – 10; నిమ్మ రసం – ఒక కప్పు; మిరప కారం – 2 టేబుల్‌ స్పూన్లు; వెల్లుల్లి రెబ్బలు – 10; ఉప్పు – తగినంత; నూనె – 200 మి.లీ.; వేయించిన మెంతుల పొడి – అర టేబుల్‌ స్పూను.

తయారీ:
►ఒక పాత్రలో కాకర కాయ చక్రాలు, నిమ్మ కాయ ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి, ఉప్పు వేసి బాగా కలపాలి
►మిరప కారం జత చేసి మరోమారు కలపాలి
►వెల్లుల్లి రెబ్బలు వేసి మరోమారు కలపాలి
►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక వేడి నూనెను పచ్చడిలో వేసి కలిపి మూడు రోజుల పాటు ఉంచాలి
►మెంతి పొడి వేసి మరోమారు కలిపి మరో మూడు రోజుల తరవాత వాడుకోవాలి
►అన్నంలోకి రుచిగా ఉంటుంది.

టొమాటో – పుదీనా 
కావలసినవి: టొమాటోలు – అర కిలో; పుదీనా ఆకులు – ఒక కప్పు; పచ్చి మిర్చి – 6; నూనె – ఒక టేబుల్‌ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; పచ్చి సెనగ పప్పు ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; ఇంగువ – కొద్దిగా; పసుపు – కొద్దిగా

తయారీ:
►స్టౌ మీద బాణలిలో ఒక టేబుల్‌ స్పూను నూనె వేసి వేడిచేయాలి
►జీలకర్ర వేసి వేయించాలి
►పచ్చి మిర్చి జత చేసి మరోమారు వేయించాలి
►పుదీనా తరుగు వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి
►టొమాటో తరుగు జత చేసి పచ్చివాసన పోయేవరకు వేయించి దింపేయాలి
►చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా అయ్యే వరకు మిక్సీ పట్టాలి
►ఉప్పు, నూనె జత చేసి మరోమారు తిప్పాలి
►స్టౌ మీద బాణలిలో నూనె కాగాక ఆవాలు, జీలకర్ర, పచ్చి సెనగ పప్పు, కరివేపాకు, ఇంగువ, ఎండు మిర్చి వరుసగా వేసి వేయించి తీసి, పచ్చడి మీద వేసి కలపాలి
►అన్నంలోకి రుచిగా ఉంటుంది.

ముల్లంగి – పుదీనా 
కావలసినవి:   ముల్లంగి తరుగు – ఒక కప్పు; పుదీనా ఆకులు – ఒక కప్పు; పచ్చి మిర్చి – 5; చింతపండు – కొద్దిగా; ఉప్పు – తగినంత; నూనె – 2 టీ స్పూన్లు; పోపు కోసం... ఆవాలు – పావు టీ స్పూను; మినప్పప్పు – పావు టీ స్పూను; నూనె – ఒక టీ స్పూను; ఇంగువ – కొద్దిగా.

తయారీ:  
►చింతపండును పది నిమిషాల పాటు తగినన్ని నీళ్లలో నానబెట్టాలి
►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక తరిగిన పచ్చి మిర్చి వేసి వేయించాలి
►ముల్లంగి తురుము, పుదీనా అకులు జత చేసి ఐదారు నిమిషాల పాటు వాసన పోయేవరకు వేయించి, ప్లేట్‌లోకి తీసి చల్లారబెట్టాలి
►నానబెట్టిన చింతపండు, ముల్లంగి తురుము మిశ్రమం మిక్సీలో వేసి మెత్తగా అయ్యేవరకు మిక్సీ పట్టి, ఒక పాత్రలోకి తీసుకుని పక్కన ఉంచాలి
►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, మినప్పప్పు వేసి చిటపటలాడేవరకు వేయించాలి
►ఇంగువ జత చేసి బాగా కలిపి దింపేయాలి
►ముల్లంగి పచ్చడి మీద వేసి కలియబెట్టాలి
►ఇడ్లీ, దోసె, పొంగల్, ఊతప్పం వంటి టిఫిన్లతో తింటే రుచిగా ఉంటుంది.

కొత్తిమీర పచ్చడి
కావలసినవి: తాజా కొత్తిమీర – 2 కప్పులు (శుభ్రపరిచి తరగాలి)పచ్చిమిర్చి – 4 (రెండుగా కట్‌ చేసుకోవాలి)చింతపండు పేస్ట్‌ – 1 టేబుల్‌స్పూన్‌ఉప్పు – రుచికి తగినంత

తయారీ: కొత్తిమీర, పచ్చిమిర్చి, చింతపండు పేస్ట్, ఉప్పు వేసి గ్రైండ్‌ చేసుకోవాలి. మరీ గట్టిగా అయితే కొద్దిగా నీళ్లు చల్లుకోవచ్చు. ఈ పచ్చడి పెసరట్టుకు, ఇడ్లీ, దోశ, వడ... ఏ టిఫిన్‌లోకైనా మంచి కాంబినేషన్‌ అవుతుంది. మిరపకాయబజ్జీలను ఈ చట్నీలో అద్దుకుని తింటే చాలా రుచిగా ఉంటాయి. అలాగే బ్రెడ్‌ రోల్స్‌ని కూడా ఈ చట్నీలో ముంచుకొని తినచ్చు. 
నోట్‌: ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న కొత్తిమీర జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడానికీ, శ్వాసనాళాల్లో కఫం తొలగించడానికీ సహకరిస్తుంది. కొత్తిమీరను ఏదో ఒక రూపంలో తరచు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. అందులో భాగమే ఈ పచ్చడి. 

నువ్వులు–మామిడికాయ  
కావలసినవి: నువ్వులు– అర కప్పు; మామిడికాయ – 1 (మీడియం సైజుది); ఎండు మిర్చి – 10; పచ్చి మిర్చి – 5; పచ్చి సెనగపప్పు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; పసుపు – కొద్దిగా; ఆవాలు – టీ స్పూను; జీలకర్ర – టీ స్పూను; మెంతులు – పావు టీ స్పూను; ఇంగువ – పావు టీ స్పూను, నూనె – రెండు టీ స్పూన్లు; ఉప్పు – తగినంత; కరివేపాకు – రెండు రెమ్మలు

తయారీ:
►స్టౌ మీద బాణలిలో నూనె లేకుండా నువ్వులు, ఎండు మిర్చి వేసి దోరగా వేయించి తీసేయాలి
►అదే బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి తీసేయాలి
►ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు వేసి వేయించి పక్కన ఉంచుకోవాలి
►మామిడికాయ తొక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా తరగాలి
►మిక్సీలో నువ్వులు, ఎండు మిర్చి వేసి మెత్తగా చేయాలి
►వేయించిన పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు జత చేసి మరోమారు మిక్సీ పట్టాలి
►మామిడికాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి, పచ్చడి మెత్తగా అయ్యేవరకు మిక్సీ పట్టి ఒక పాత్రలోకి తీసుకోవాలి
►వేయించుకున్న పోపు జత చేయాలి
►వేడి వేడి అన్నంలో కమ్మటి నెయ్యి వేసుకుని కలుపుకుంటే చాలా రుచిగా ఉంటుంది.

పల్లీ– దొండకాయ
కావలసినవి: దొండకాయలు – పావు కేజీ; వేయించిన పల్లీలు – 50 గ్రా.; చింత పండు – నిమ్మకాయంత; ఉప్పు – తగినంత; పోపు కోసం... నూనె – ఒక టేబుల్‌ స్పూను; ఎండు మిర్చి – 10; పచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఇంగువ – కొద్దిగా; పసుపు – కొద్దిగా; కొత్తిమీర – ఒక టేబుల్‌ స్పూను; బాదం పప్పులు – 5 (నీళ్లలో సుమారు రెండు గంటలు నానబెట్టాలి).

తయారీ:  
►దొండకాయలను శుభ్రంగా కడిగి, ముక్కలు చేయాలి
►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక దొండకాయ ముక్కలు, చింతపండు, ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గిన తరవాత ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి
►అదే బాణలిలో నూనె వేసి కాగాక ఇంగువ, పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీల కర్ర, ఎండు మిర్చి వరుసగా వేసి దోరగా వేయించి ఒక ప్లేట్‌లోకి తీసుకుని చల్లారబెట్టాలి
►చల్లారిన పోపును మిక్సీలో వేసి మెత్తగా చేయాలి
►వేయించిన పల్లీలు జత చేసి మరోమారు మిక్సీ పట్టాలి
►దొండకాయ ముక్కలు, బాదం పప్పులు జత చేసి మెత్తగా అయ్యేవరకు తిప్పి, పచ్చడిని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి
►పసుపు, కొత్తిమీర జత చేయాలి. 

మరిన్ని వార్తలు