వందే ఉగాది కోకిలమ్‌

18 Mar, 2018 03:25 IST|Sakshi

వందే వాల్మీకి కోకిలమ్‌. వాల్మీకి కోకిలకు వందనం అని అర్థం. త్రేతాయుగం నాడు వాల్మీకి మహర్షి ఆలపించిన రామాయణ కథా గానాన్ని ఆలకించిన భారతీయులు ‘‘ కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ‘‘ ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలమ్‌‘‘ అని ఆయనను కోకిలగా అభివర్ణించారు. కోకిల కారణంగా ఆయనకు గౌరవం దక్కిందా,  ఆయన కారణంగా కోకిలకు ప్రాధాన్యత వచ్చిందా అనే సందేహం కలిగింది షడ్రుచులకి. మనలో మనం తర్కించుకోవడం ఎందుకు, నేరుగా వాల్మీకి దగ్గరకు వెళ్లి, ఆయననే ప్రశ్నిద్దాం అని బయలుదేరాయి.. వేపపువ్వు, మామిడికాయ, చెరకుగడ, చింతపండు.. ఉప్పును వెంటబెట్టుకుని. అప్పటికే పుంస్కోకిల అక్కడకు చేరుకుని, మహర్షితో తీయగా సంభాషిస్తోంది.

‘మహర్షీ! నువ్వు ఎంతో అందంగా, తీయగా రామాయణ గానం చేశావు. రామ రామ అంటూ మధురంగా, మధురమైన అక్షరాలతో పలుకుతూ, కవితా శాఖలను అధిరోహిస్తూ, అందరిచేత ‘వాల్మీకి కోకిలమ్‌’ అని ప్రణతులు అందుకున్నావు. నాకు ఎంతో సంతోషంగా ఉంది స్వామీ, మీ కారణంగా నా పేరు చిరస్థాయిగా కోకిలగా కాకుండా వాల్మీకి కోకిలగా నిలబడిపోయింది’ అంటూ ఆనంద పారవశ్యంతో, తన మనసు పొరలలో వాల్మీకి మహర్షి మీద దాగున్న అభిమానాన్ని మధుర గంభీర కంఠస్వరంతో కలస్వనం చేసింది.

మహానుభావుడైన వాల్మీకి, వినమ్రంగా, ‘ఓ కోకిలా! నీ కంఠమాధుర్యంలా నా కవిత్వం ఉందన్నారే కాని, నా కవిత్వంలా నీ కంఠం ఉంది అనలేదు, గమనించావా. నీ తీయని స్వరం ఈ సృష్టిలో లేకపోతే, నాకు అంతటి మధురమైన ఉపమానం వచ్చి ఉండేది కాదు’ అంటూ కోకిలను ఆప్యాయంగా నిమిరి, మళ్లీ, ‘కోకిలమ్మా. నువ్వు కుహూకుహూ అని పలకగానే, వసంతం వచ్చిందని, ఉగాది సంబరాలు జరుపుకోవాలని ఒక్కసారిగా అందరూ సంసిద్ధులవుతారు. నీకు అంత ప్రత్యేకత ఉంది’ అంటుంటే కోకిల తన కుహూరవాలకు ఇంత ప్రాధాన్యత ఉందా అనుకుంటూ బిడియపడిపోయింది.

అక్కడే ఉన్న మావి చిగురు, ‘చెరుకుబావా. ఈ మహర్షి మాటలు విన్నావా. కేవలం కోకిల వల్లే వసంతం వచ్చిందని తెలుస్తుందట. అసలు ఆ కోకిల నా చిగుళ్లు తినకుండా గొంతు విప్పగలదా. మండుటెండలు ప్రవేశిస్తుంటే, నేను ఎర్రటి చిగుళ్లను చిగురించి, కోకిలను ఆకర్షిస్తాను. తన పదునైన ముక్కుతో నన్ను పొడిచి పొడిచి తింటుంది. నేను ఏ మాత్రం బాధ పడకుండా, నా బిడ్డకు ఆహారం పెడుతున్నట్టు భావిస్తాను. అలాంటి నన్ను విడిచిపెట్టి, నా ఆహారంతో కమ్మని స్వరంతో కుహుకుహూరవాలు చేసే కోకిలను పొగుడుతుంటే, నాకు బాధ వేస్తోంది’ అంది.

పక్కనే ఉన్న వేప పువ్వు, చింతపండు తమ తమ గొంతులు కూడా విప్పాయి. ‘నా గురించి ఒక్క మాట కూడా మాట్లాడరేం. వేప పూత వస్తోందంటే, కొత్త సంవత్సరం వస్తోందని నవ్వుల పువ్వులు పూయిస్తాను కదా. నన్ను గుర్తించకపోతే బాధగా ఉండదా...’ అంటుంటే పక్కనే చింతపండు చిరుచిరు నవ్వులు పండిస్తూ...  ‘మనం ఇలా అనుకోవడం సరి కాదు, మనమందరం కలిస్తేనే ఉగాది పండుగ. నన్ను పిండి రసం తీస్తారు, దానికి మిరియాల పొడి జత చేస్తారు. అందులో చెరుకు ముక్కలు, అరటి పండు ముక్కలు, వేప పువ్వు... ఇన్ని కలిస్తేనే కదా ఉగాది పచ్చడి అవుతుంది.

కాని కోకిల స్వయంగా కూస్తుంది, ఆ కుహూరవాలకు దేనితోను సంబంధం లేదు. అలాగే మహర్షి వాల్మీకి కూడా. ఆయన స్వయంగా పలికినవాడే కాని ఎవరో పలికిన పలుకులను అక్షరీకరించలేదు. ఇన్ని వేల సంవత్సరాలైనా ఆయనను మనం వాల్మీకి కోకిలమ్‌ అని అక్కున చేర్చుకుంటున్నాం కదా. మనం ఎంత మంది ఉన్నా లేకున్నా... కోకిల, వాల్మీకి కోకిల... వీరిద్దరే అసలైన ఉగాది ప్రతీకలు’... అంటూ వాల్మీకి పాదాలకు, కోకిల గళానికి నమస్కరించాయి.‘వసంత ఋతువు, ఉగాది, కోకిల కలస్వనాలు, ఎర్రటి మావి చిగుళ్లు...  ఇవే పండుగకు ప్రకృతిలో కనిపించే చిహ్నాలు. మనమందరం కలిసి, మానవ జీవితంలో షడ్రుచులు ఉంటాయని, జీవితం ఒకసారి తియ్యగా ఉంటుందని, మరోసారి చేదుగా, ఒక్కోసారి వగరుగా... ఇలా ఆరు రుచుల సమ్మేళనం జీవితం అని తెలియచెబుతాం. అందరం ఉంటేనే పండుగ అందంగా, ఆనందంగా ఉంటుంది’... అంటూ చెరకు ఆ సమావేశానికి ముగింపు పలికింది.

– పురాణపండ వైజయంతి

మరిన్ని వార్తలు