పండగా మా ఆవిడా

18 Mar, 2018 03:22 IST|Sakshi

రాజకీయాల గోల మధ్య విళంబి కొంచెం భయం భయంగానే వచ్చింది. విళంబి అంటే ఆలస్యమని అర్థమట. ఆలస్యానికి మనం బ్రాండ్‌ అంబాసిడర్లం. లేట్‌ని లైట్‌గా తీసుకుంటాం. మన నాయకులు సభలకి ఆలస్యంగా వచ్చి సమయపాలన గురించి స్పీచులిస్తారు. స్పిరిచ్యుయాలిటీ తప్ప పంక్చువాలిటీ మనకెక్కదు. ఆలస్యం అమృతం విషం అంటారు కానీ, ఇప్పుడు అమృతం ఎక్కడుంది అంతా విషమే కదా! పురుగుల మందులు వాడి వాడి మనుషులు పురుగులుగానూ, పురుగులు మనుషులుగానూ మారిపోతున్నాయి. ఉగాది అంటే వేప పచ్చడి, పంచాంగ శ్రవణం, కోయిల కూత, కవిత్వం మోత.

మా బాబాయి ఒకాయన ఉగాది కవిత్వాల కోసం మూడు రోజుల ముందు నుంచే కత్తి నూరుతూ వుంటే, ఆయన బారి నుంచి కవిత్వాన్ని కాపాడ్డానికి గదిలో బంధించి హౌస్‌ అరెస్ట్‌ చేశారట. ‘మనిషి మంచాడే కానీ, కవిత్వమే మంచిగా వుండదు’ అని ఆయన మీద కామెంట్‌. ‘ఆలస్యంగానైనా అవశ్యంగా వచ్చావా విళంబి’ అని ఆయన కవిత్వపాదం స్టార్ట్‌ చేయగానే ఇంట్లోవాళ్ల ఫ్యూజులు ఎగిరిపోయి చేతులు కట్టేశారట. కవిత్వంతో కట్టిపడేయలేనప్పుడు కవిత్వాన్నే కట్టేయడం ఉత్తమం. ఆలస్యం ఒక సర్వనామం. ఐదేళ్ల క్రితం స్పెషల్‌ స్టేటస్‌ని ఢిల్లీ నుంచి విమానంలో పంపుతామన్నారు. కానీ ఆ విమానం ఎగరనే లేదు. ప్యాకేజీని రైల్లో పంపుతామన్నారు. అది మూడో కంటికి చిక్కలేదు.

ఆశ మానవ సహజం, నిరాశ దేవుడి లీల. ఉగాదికి పంచభక్ష్య పరమాన్నాలు తిందామని ఆశపడితే మా ఆవిడ అర వీర మాచినేని డైట్‌ ప్రారంభించింది. మూడు రోజుల క్రితం ట్రయల్‌ రన్‌ స్టార్టయింది. కాపీ కొట్టి సినిమా కథలు తయారుచేయాలని నేను ఆలోచిస్తుంటే, ‘మీకోసం అద్భుతమైన కాఫీ చేస్తున్నా. రండి చూద్దురుగానీ’ అని కిచెన్‌లోకి లాక్కెళ్లింది. కాఫీ వల్ల కాపీ వృద్ధి చెందునేమో అని సంబరపడ్డాను. ఫస్ట్‌ వేడినీళ్లు కాచింది. దాంట్లోకి ఇన్‌స్టంట్‌ కాఫీపొడి వేసింది. టైటిల్స్‌ పడుతున్నప్పుడు తెలుగు సినిమాల్లో మనం నింపాదిగా కూచున్నట్టు రిలాక్స్‌డ్‌గా స్టూల్‌ మీద సేదతీరాను. తరువాత ఆ నీళ్లలోకి కొంచెం బటర్‌ వేసింది. భయంగా చూశాను. రెండు స్పూన్ల కొబ్బరి నూనె వేసింది.

సినిమాల్లో రచయితగా టైటిల్‌ కార్డ్‌ పడకముందే లైఫ్‌కి శుభం కార్డు పడుతుందని అర్థమైంది. ఆ ద్రావకాన్ని మిక్సీలో వేసి బర్రుమని రెండు రౌండ్లు తిప్పింది. పారిపోవడం సరైన సమయంలో సరైన నిర్ణయమనుకున్నాను. కానీ మనుషులు ఎక్కడికి పారిపోగలరు? ఎంత దూరం పోయినా సాయంత్రానికి ఇల్లు చేరాల్సిందే. కాఫీ అని ఆమె నమ్ముతున్న ద్రవాన్ని ఒక కప్పులో పోసింది. అమృత మథనంలో హాలాహలాన్ని చూసి రాక్షసులు కూడా నా అంతలా భయపడి వుండరేమో! అది కాఫీ రంగులో వున్నప్పటికీ కాఫీ కాదు, మన ప్రజాస్వామ్యంలాగా డూప్‌. తాగమని చెప్పింది. గృహహింస చట్టం మగాళ్ల పక్షాన వుండదని నాకు తెలుసు. గటగట తాగేశాను. తరువాత ఏమైందో తెలియదు. కళ్లు తెరిచేసరికి విళంబి వచ్చేసింది.

పెద్దవాళ్లమయ్యేసరికి పండుగలు కూడా పాతబడిపోయాయి. మావిడాకుల తోరణాలు, వేప చిగురు, లేత మామిడి పిందెలు, కొత్త బట్టలు అన్నీ వున్నా అమాయకత్వాన్ని మిస్సయిపోయాం. తెలివి జీవితంలోని చాలా సౌందర్యాల్ని ధ్వంసం చేస్తుంది. మనకేమో బాల్యం తిరిగి రాదు. ఇప్పటి పిల్లలకు బాల్యం తెలియదు.జీవితమొక ప్రవాహం. జ్ఞాపకాలు కాగితపు పడవల్లా తేలుతుంటాయి. మన కంటే పెద్దవాళ్లు ఒక్కొక్కరుగా గోడమీది ఫొటోలుగా మారిపోతుంటారు. పాత ఉగాదులు కాసిన్ని ఆనందపు జల్లులు, కన్నీటి వడగండ్లు విసిరేసి వెళుతుంటాయి. కొత్త ఉగాదులు ఎండలతో పాటు మల్లెల మత్తుని కూడా మోసుకొస్తాయి. నవ్వేవానికి ప్రతిరోజూ ఉగాదే.

– జి.ఆర్‌.మహర్షి

మరిన్ని వార్తలు