సత్సంప్రదాయానికి వారధి

19 Mar, 2015 23:16 IST|Sakshi
సత్సంప్రదాయానికి వారధి

తెలుగు ఉగాది
 
యుగాది అనే పదానికి యుగానికి ఆది లేక ప్రారంభం అని అర్థం. యుగానికి వికృతి ఉగము. ఈ ఉగము నుంచి పుట్టినదే ఉగాది. తెలుగు వారిది, కన్నడిగులది చాంద్రమానం. కేరళ, తమిళనాడు రాష్ట్రాలవారిది సౌరమానం. మనం జరుపుకునే పండుగలు, చే సే శుభకార్యాలు, చెప్పుకునే సంకల్పాలన్నీ చాంద్రమానం ప్రకారమే! తెలుగు సంప్రదాయం ఉట్టిపడే ఈ పండుగలో  దాగి ఉన్న విశేషాలను అవలోకిద్దాం...  
 
మనకు జ్యోతిష శాస్త్రరీత్యా శుభాశుభ ఫలితాలను తెలిపే పండుగ ఉగాది. దీనినే సంవత్సరాది అని కూడా అంటారు. ఉగాది నుంచి తెలుగు వారికి కొత్త పంచాంగం ప్రారంభమవుతుంది. నిన్న మొన్నటి వరకు ఉన్న ‘జయ’ నామ సంవత్సరం నుంచి రేపటితో ‘మన్మథ’ నామ సంవ త్సరంలోకి అడుగు పెడుతున్నాం. రైతులు, రాజకీయ నాయకులు, ఉపాధ్యాయులు, కళాసాంస్కృతిక రంగాలవారు, సినీనటులు, ఉపాధ్యాయులు, వివిధ రకాల వృత్తులు, ఉద్యోగాలలో ఉండే వారంతా ఈ సంవత్సరం తమ రాశిఫలాలు లేదా నామనక్షత్ర ఫలాలు ఏ విధంగా ఉన్నాయో పంచాంగ శ్రవణం ద్వారా తెలుసుకుని దానికి అనుగుణంగా నడుచుకుంటారు.
 
ఆరోగ్యానికి అభ్యంగనం

ఉగాది వంటి పర్వదినాలలో నువ్వులనూనెలో లక్ష్మి, జలంలో గంగాదేవి ఉంటారనిశాస్త్రోక్తి. కాబట్టి ఉగాదినాడు పొద్దున్నే లేచి ఒళ్లంతా నువ్వుల నూనె, సున్నిపిండి పట్టించి, నలుగు పెట్టి, కుంకుడురసం లేదా సీకాయపొడితో తలారా స్నానం చేయాలి. తర్వాత నూతన వస్త్రాలు లేదా శుభ్రంగా ఉతికిన దుస్తులు ధరించి, నిత్యకర్మానుష్ఠానాలు ముగిసిన అనంతరం బంధుమిత్రులతో కలిసి భోజనం చేసి, పంచాంగ శ్రవణం చేయాలి.
 
నూత్న వస్త్రాలు లేదా  శుభ్రవస్త్రాలు
 
ఉగాది రోజున చిరిగిన, మాసిన లేదా విడిచిన బట్టలు ధరించిన వారికి, తలస్నానం చేయని వారికి సంవత్సరమంతా రకరకాల వ్యాధులు, దారిద్య్రబాధలు సోకుతాయని శాస్త్రోక్తి. కాబట్టి ఉగాదినాడు వీలయితే నూతన వస్త్రాలు లేదా చిరుగులు పడని, శుభ్రంగా ఉతికిన దుస్తులు ధరించడం శ్రేయోదాయకం. తెల్లటి దుస్తులు ధరించడం శుభప్రదర .
 
ఈ పండగ నాడు ఏమి చేయాలి?
 
ఈ పర్వదినాన ఉదయమే ఇల్లు అలికి, ముగ్గుపెట్టి లేదా అన్నిగదులలోనూ బూజు దులిపి ఊడ్చి, శుభ్రంగా కడుక్కుని, మామిడి మండలతో లేదా వివిధ రకాల పుష్పాలతో తోరణాలు కట్టాలి. గడపలకు పసుపు, కుంకుమలు అలంకరించాలి. ఇష్టదేవతల విగ్రహాలను షోడశోపచారాలతో పూజించి, శుచిగా చేసిన పిండివంటలను, ఉగాది పచ్చడిని నివేదించాలి. అనంతరం పంచాంగ పఠనం లేదా శ్రవణం చేయాలి.

పంచాంగం అంటే ...

తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే ఐదు భాగాలను కలిపి పంచాంగం అంటారు. తిథి వలన సంపద, వారం వల్ల అనుకూలతను, నక్షత్రం వల్ల పాపపరిహారం, సరైన యోగంతో వ్యాధి నివారణ, కరణం ద్వారా కార్యానుకూలతను పొందవచ్చు. కాబట్టి చేసే పనులలో విజయాన్ని కాంక్షించేవారు తప్పక పంచాంగం చూడాలి.
 
పంచాంగ శ్రవణం ఎందుకు?
 
ఉగాదినాటి పంచాంగ శ్రవణం గంగాస్నాన ఫలంతో సమానమని, పంచాంగ శ్రవణం వల్ల భూమి, బంగారం, ఏనుగులు, గోవులతో కూడిన సర్వలక్షణ లక్షితమైన కన్యను యోగ్యుడైన వరునకు దానం చేస్తే కలిగే ఫలంతో సమానమైన ఫలాన్నిస్తుందని శాస్త్రోక్తి. అంతేకాదు, సంవత్సరానికి అధిపతులైన రాజాది నవనాయకుల గ్రహఫలితాలను వినడం వల్ల గ్రహదోషాలు నివారించబడి, వినేవారికి ఆరోగ్యాన్ని, యశస్సును, ఆయుష్షునూ వృద్ధి చేసి, సంపదతో కూడిన సకల శుభఫలాలనూ ఇస్తుందట. కాబట్టి ఉగాదిన పంచాంగ ఫలాలను తెలుసుకోవాలి.

ఆ ఆరు రుచులలో అనేక అర్థాలు

ఉగాదికి సంకేతంగా చెప్పుకునే ఆరురుచుల కలయికలో అనంతమైన అర్థముంది. ప్రకృతి లేనిదే జీవి లేదు. జీవి లేని ప్రకృతి అసంపూర్ణం. కాబట్టి మానవునికి, ప్రకృతికి గల అవినాభావ సంబంధాన్ని గుర్తుచేస్తుంది ఈ పండుగ. ప్రకృతి అందించే తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు రుచుల సమ్మేళనంతో తయారయ్చే ఉగాది పచ్చడి సేవనం ఆరోగ్యదాయకం. జీవితమంటే కేవలం కష్టాలు లేదా సుఖాలే కాదు, అన్ని విధాలైన అనుభవాలూ, అనుభూతులూ ఉంటాయి, ఉండాలి! అలా ఉన్నప్పుడే జీవితానికి అర్థం పరమార్థం. ఈసత్యాన్ని బోధిస్తూనే ఆరోగ్యాన్ని అందిస్తుంది ఉగాది పచ్చడి.  

వైవిద్యభరితం

అభిరుచి, అలవాటు లేదా ఆచారాన్ని బట్టి ఉగాది పచ్చడి తయారుచేస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో దీనిని పచ్చడిలా గట్టిగా చేస్తే, ఇంకొన్ని ప్రాంతాలలో జారుగా చేసి, కొత్తకుండలో పోసి, ఇంటికి వచ్చిన బంధుమిత్రులకు, అతిథులకు ఇవ్వడం ఆనవాయితీ.
 
తెలుగు సంప్రదాయానికి నాంది...

 
తెలుగు వారి నూతన సంవత్సరం ఉగాదితోనే ఆరంభమవుతుంది కాబట్టి వేడుకలు, కవి సమ్మేళనాలు జరుగుతాయి. అవేమీ లేకపోయినా, ఉగాది సంప్రదాయం మేరకు ప్రతి ఒక్కరూ పాత కక్షలు, కార్పణ్యాలు మరచి అన్యోన్యంగా, సంతోషంగా గడపాలి.
 బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించినదీ, ప్రజానురంజకంగా పాలించిన శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగినదీ, వెయ్యేళ్లపాటు రాజ్యపాలన చేసిన విక్రమార్క చక్రవర్తి సింహాసనాన్ని అలంకరించిందీ, శకకారుడైన శాలివాహనుడు కిరీట ధారణ చేసినదీ, కౌరవ సంహారం అనంతరం ధర్మరాజు హస్తిన పీఠాన్ని అధిష్ఠించిందీ ఉగాదినాడేనని అనేక చారిత్రక, పౌరాణిక గ్రంథాలు చెబుతున్నాయి. కాబట్టి నూతనకార్యాలు ప్రారంభించడానికి ఉగాది మంచి శుభతరుణం అన్నమాట.మీరు సంకల్పించిన శుభకార్యాలన్నీ నెరవేరాలని, ఈ మన్మథ నామ సంవత్సరం ప్రతి ఒక్కరికీ సకల శుభాలు చేకూర్చాలని ‘సాక్షి’ ఆకాంక్షిస్తోంది.
 

మరిన్ని వార్తలు