ఐదుసార్లు ఫెయిల్‌

11 Nov, 2019 00:58 IST|Sakshi

సక్సెస్‌ స్టోరీ

ఉమ జీవితంలోని వరుస అపజయాలు ఆమెను దృఢపరచి, ఆత్మవిశ్వాసంతో సివిల్‌ సర్వీస్‌ ఎగ్జామినేషన్‌ పూర్తి చేసేందుకు ఉపయోగపడ్డాయి. గత ఏడాది చేసిన ఆరో ప్రయత్నంతో ఉత్తీర్ణత సాధించిన ఉమకు స్ఫూర్తిని ఇచ్చినవారు స్టీవ్‌ జాబ్స్‌ సహా ఎందరో ఉన్నారు.

‘‘నా బాల్యమంతా తమిళనాడులోని తిరునల్వేలిలో జరిగింది. ఇంజనీరింగ్‌ పూర్తి చేశాక, ఎంబిఏ చదవాలనుకున్నాను. సిఎస్‌ఈ చదువుతానని ఏ రోజూ అనుకోలేదు. మా ప్రొఫెసర్‌ అబూబకర్‌ ప్రోత్సాహం మీద 2011 లో మొదటిసారి పరీక్ష రాశాను. తగినంత కృషి చేయకపోవడం వల్లనో ఏమో ఫెయిల్‌ అయ్యాను’ అంటారు ఉమ.

ఒకేసారి మూడు ఉద్యోగాలు!
చదువు పూర్తి అవుతుండగానే, మూడు పెద్ద కార్పొరేట్‌ కంపెనీల నుంచి ఒకేసారి మూడు ఆఫర్‌ లెటర్స్‌ అందుకున్నారు ఉమ. ఒకదాన్ని ఎంచుకుని అందులో చేరారు. ‘‘నాన్న గతించేవరకు నా జీవితం పూలబాటలో నడిచింది. కొన్ని రోజులకే అమ్మ కూడా పోవడంతో, భవిష్యత్తు అగమ్యగోచరంగా అనిపించింది’ అని గుర్తుచేసుకుంటారు ఉమా మహేశ్వరి. కార్పొరేట్‌ సంస్థలలో ఆమె ఐదు సంవత్సరాలు పని చేశారు.

అలా పని చేస్తూనే, సివిల్‌ సర్వీస్‌కి ప్రిపేర్‌ అయ్యారు. ఐదుసార్లు రాసినప్పటికీ విజయం సాధించలేకపోయారు! సాధారణంగా ఇన్నిసార్లు ఓటమి చెందితే మళ్లీ రాయరు. చుట్టూ ఉన్నవారంతా ‘ఇంకేం చదువుతావులే మానేయ్‌’  అని హేళన చేసినా, ఉమలో తనను తాను నిరూపించుకోవాలనే పట్టుదల పెరిగింది. 2017లో ఉద్యోగాన్ని వదిలి, పరీక్ష కోసం దీక్షగా కూర్చొని ప్రిపేర్‌ అయ్యారు.  

చదువుతుండగానే తెల్లారేది
అప్పటికే పెళ్లయింది ఉమకు. ఇంటిని చక్కబెట్టుకుంటూ, పిల్లలను చూసుకుంటూ, చదువుకోవటానికి కొంత సమయం కేటాయించారు. ‘‘ఉదయం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు చదువు, ఆ తరవాత ఇంటి పనులు, అమ్మాయిని స్కూల్‌కి రెడీ చేయడం, మధ్యాహ్నం భోజన సమయం వరకు మళ్లీ చదువుకుని, సాయంత్రం మా అమ్మాయి ఇంటికి వచ్చాక తనతో గడపడం, తరవాత మళ్లీ చదువుకోవడం.. ఇదీ నా షెడ్యూల్‌. మెయిన్స్‌కి మాత్రం తెల్లవారుజామున మూడు గంటల వరకు చదివాను’’ అని తెలిపారు ఉమా మహేశ్వరి.ఇంటిని, పిల్లలను చూసుకుంటూనే సిఎస్‌ఈలో రెండోస్థానం సాధించిన  అనూ కుమారి కూడా ఉమకు ఒక ఇన్‌స్పిరేషన్‌.

హర్యానాకు చెందిన అనూ కుమారి సాధించిన విజయాలు, ఉమ అత్తమామలకు, భర్తకు కూడా ఉమ మీద నమ్మకాన్ని పెంచాయి. పట్టుదల ఉంటే బిడ్డ తల్లికి కూడా అన్నీ సాధ్యమే అని అర్థం చేసుకున్నారు. చివరి ప్రయత్నంలో 2018లో ఉమ సివిల్స్‌లో విజయం సాధించారు. ఈ ఏడాది ఇంటర్వ్యూకి హాజరయ్యారు. ఇప్పుడు తన పోస్టింగ్‌ కోసం నిరీక్షిస్తున్నారు. ‘‘నీ మీద నీకు ఉన్న నమ్మకాన్ని ఒమ్ము చేసుకోకు, ఆ నమ్మకమే నిన్ను విజయం వైపుగా నడిపిస్తుంది’’ అన్న స్టీవ్‌ జాబ్స్‌ మాటలు తన విజయానికి బాటలు వేశాయి అంటారు ఉమా మహేశ్వరి.
– వైజయంతి

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా